close

వార్తలు / కథనాలు

భలే ఐడియా బాతు!

భలే ఐడియా బాతు!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ బాతేంటో.. దాని సంగతేంటో తెలుసుకునే ముందు ఓ చిన్న కథ మనం చెప్పుకోవాలి. ‘‘రాజా.. రాము.. ఇద్దరూ మంచి స్నేహితులు. పక్క ఊళ్లో జాతరకు వెళ్లి తిరిగొస్తున్నారు. రాత్రి బాగా పొద్దు పోయింది. పైగా ఇంటికి చేరాలంటే అడవిని దాటాలి. ఎలాగోలా ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకొంటూ బయలుదేరారు. అడవి మధ్యలోకి రాగానే ఎదురుగా ఎలుగుబంటి కనిపించింది. ప్రాణ భయంతో రాము పక్కనే ఉన్న చెట్టు ఎక్కేశాడు. రాజా చెట్టు ఎక్కలేక అలాగే ఉండిపోయాడు. అప్పుడే రాజాకు ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. వెంటనే నిలబడిన చోటే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎలుగుబంటి నేరుగా నేలమీద పడిన రాజా దగ్గరికి వచ్చింది. అతడిని వాసన చూసింది. అప్పటికే ఊపిరి బిగపట్టి చచ్చినవాడిలా పడిపోయిన రాజాను చూసి కొద్దిసేపు అటూ ఇటూ నెట్టింది. ఇంకొంచెం సేపు అక్కడే ఉండి రాజా చుట్టూ తిరగడం ప్రారంభించింది. చివరకు నిజంగానే చనిపోయాడనుకుని దానిదారిన అది పోయింది. రాజా తెలివితేటలే అతణ్ని బతికించాయి.’’ ఎప్పుడో చిన్నప్పుడు విన్న కథేగా మళ్లీ ఇప్పుడెందుకంటారా?

రాజా ఆలోచించినట్లే ఓ బాతు కూడా అలానే ఆలోచించింది. తనని తినడానికి వచ్చిన కుక్కకు ‘బాతు-65’ కాకుండా ప్రాణాలు దక్కించుకుంది. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ, ఓ బాతు బయట తిరుగుతూ ఉంటే దాన్ని తినడానికి ఒక శునకం పరుగున వచ్చింది. ఇంకేముంది, ప్రాణాలను కాపాడుకునేందుకు వెంటనే అది చచ్చినదానిలా పడిపోయింది. కుక్క కొంచెంసేపు చూసి అటు పరిగెత్తగానే చచ్చినట్లు నటిస్తున్న బాతు టక్కున లేచి తన గూట్లోకి దూరిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. బాతు తెలివితేటలకు పడి పడి నవ్వుతున్నారు. కావాలంటే మీరూ చూసేయండి..

 


Tags :

మరిన్ని