
వార్తలు / కథనాలు
లేటుగా వచ్చినా.. లేటెస్ట్ ట్రెండ్‌గా అనిల్ గొచికర్
ఇంటర్నెట్‌డెస్క్: పూరి జగన్నాథుడి రథోత్సవం జరుగుతోంది.. అదే సమయంలో ఒక వ్యక్తి జంధ్యం వేసుకొని పంచెకట్టుకొని హడావుడిగా వెళుతున్నాడు.. అతని పర్సనాలిటీ అక్కడి ఉన్నవారిని చూపు తిప్పుకోనివ్వలేదు. ఎంతో అకుంఠిత దీక్షతో కష్టపడితేగానీ గ్రీకు శిల్పం వంటి ఆ దేహదారుఢ్యం సొంతం కాదు. అంతే చాలా కెమేరాలు అతన్ని క్లిక్‌మనిపించాయి. అక్కడకు సీన్ కట్ చేస్తే.. ఆ ఫొటోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి. కండలు తిరిగిన ఈ అయ్యగారు ఎవరా? అని నెటిజన్లు గూగుల్ తల్లిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆ తల్లి చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయారు. పూరి జగన్నాథ ఆలయ పూజారి కుమారుడు.. ప్రస్తుతం ఆలయంలో సేవలు చేస్తున్న వ్యక్తి.. అంతకు మించి పక్కా శాకాహారి..! అతని పేరు అనిల్ గొచికర్..! మిస్టర్ ఇంటర్నేషనల్ ఇండియా బంగారు పతక విజేత. 30 ఏళ్లు దాటగానే ఆ.. ఈ ఏజ్‌లో జిమ్‌కు ఏం వెళతాం అని నిరాశపడే వారికి గొచికర్ జీవితం స్ఫూర్తినిస్తుంది. అతను తొలిసారి జిమ్‌లో అడుగుపెట్టింది 30ఏళ్ల వయస్సులోనే.. క్రమం తప్పకుండా పద్దతి ప్రకారం వ్యాయామం చేసి అంతర్జాతీయ వేదికలపై భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. ఈ కండల వీరుడు ఒడిశాలోని పూరీ వాసులకు మాత్రం జగన్నాథుడి బాడీగార్డ్‌గా సుపరిచితుడు.
కుటుంబ నేపథ్యం..
పూరీ జిల్లాలో ఓ సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో అనిల్ జన్మించాడు. అనిల్ తండ్రి పూరి ఆలయంలో పండిట్‌గా సేవలు అందించారు. ఆయన 2006లో చనిపోయారు. ఈ కుటుంబానికి జగన్నాథుడి సేవ తప్పనిసరి. దీంతోపాటు వీరి కుటుంబం ‘హోటల్ గొచికర్’ను కూడా నిర్వహిస్తోంది. అందుకే అప్పటి వరకు జాతీయ స్థాయి బాడీబిల్డర్‌గా రాణించిన అనిల్ సోదరుడు దామోదర్ 2009లో కుటుంబ బాధ్యతలను మీద వేసుకొన్నారు. దీంతో అనిల్ అన్న కోసం బాడీ బిల్డింగ్‌లోకి అడుగుపెట్టాడు. అప్పుడు అతని వయస్సు 30 ఏళ్లు. 2010లో అనిల్ సోదరుడితో కలిసి సొంతగా జిమ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ వీరి శిక్షణలో రాటుదేలిన పలువురు జాతీయస్థాయి పోటీల్లో కూడా రాణించారు. అనిల్‌కు అన్న అంటే గౌరవం ఎక్కువ. అందుకే ఆయన్ను హీరోగా అభివర్ణిస్తాడు. పోటీల సమయంలో ఉదయం 2.30 గంటలు, సాయంత్రం 2.30 గంటలు జిమ్‌లో కసరత్తులు చేస్తాడు. పోటీలు లేని సమయంలో రోజుకు 2గంటలు జిమ్‌లో గడుపుతాడు. ఉత్ప్రేరకాల వినియోగాన్ని అనిల్ పూర్తిగా వ్యతిరేకిస్తాడు. క్రమశిక్షణ, ప్రణాళిక ప్రకారం సాధన చేస్తే అద్బుతమైన శరీర సౌష్ఠవం పొందవచ్చన్నది అనిల్ నమ్మిన సిద్ధాంతం.
అమ్మచేతి వెజిటేరియన్ డైట్..
25వ ఏటే అనిల్‌కు పెళ్లి అయింది. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. కానీ, అనిల్ డైట్ మాత్రం తల్లే చూసుకొంటుంది. నూనె, ఉప్పు, మసాలాలు అతి తక్కువగా వాడి అనిల్‌కు డైట్ తయారు చేస్తుంది. నిత్యం కాయగూరలు, పండ్లు ఉండేట్లు జాగ్రత్తలు తీసుకొంటుంది. అనిల్ ఆహారంలో ప్రొటీన్ల కోసం పాల ఉత్పత్తులపైనే ఆధారపడతాడు. పాలు, చీజ్, పనీర్ ఎక్కువగా తీసుకొంటాడు. పోటీల సమయంలో మాత్రం పాలు వినియోగించడు. బ్రాహ్మణ కుటుంబం కావడంతో గుడ్లు, మాంసం అస్సలు ముట్టడు. వేప్రొటీన్, మాస్‌గెయినర్, మల్టీ విటమిన్లు, ప్రీ, పోస్టు వర్కౌట్ సప్లిమెంట్లు మాత్రం వినియోగిస్తాడు.
తొలిసారే విజేతగా..
అనిల్ తొలిసారి ఒడిశాలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. అప్పట్లో 65కేజీల కేటగిరిలో పాల్గొనాలని భావించాడు. కానీ, 65.4కేజీల బరువు ఉండటంతో.. అప్పటి రన్నింగ్ చేసి 400 గ్రాముల బరువు తగ్గించుకొని పోటీల్లో పాల్గొని ఛాంపియన్‌గా నిలిచాడు. 2012 మిస్టర్ ఒడిశా, ఫెడరేషన్ కప్ రజత పతకం, 2014 వరల్డ్ బాడీబిల్డింగ్, ఫిజిక్ ఫెడరేషన్ పోటీల్లో కాంస్యం, 2016 మిస్టర్ ఇంటర్నేషనల్ బంగారు పతకం సాధించాడు. ‘అత్యంత ఖరీదైన క్రీడల్లో బాడీబిల్డింగ్ ఒకటి. దీనిలో ప్రోత్సాహం అవసరం. నాకు మిస్టర్ ఇంటర్నేషనల్ వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు’అని అనిల్ వాపోయారు. అయినా కానీ తాను నిరాశపడనని వెల్లడించాడు.