రోడ్లపై, బస్టాండుల్లో, రైల్వేస్టేషన్లలో ఎంతో మంది తినడానికి తిండి దొరకక ఖాళీ కడుపుతో పడుకుంటున్నారు. కొందరు ఆకలితో అలాగే చనిపోతున్నారు కూడా.. అది చూసి చలించిపోయాడు నవీన్ చంటి. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈ యువకుడు విద్యుత్తుశాఖలో గ్రేడ్2 ఉద్యోగి. మొదట ఓ 50మందికి సరిపడా ఆహారం వండుకొని రోడ్లపై ఆకలితో ఉన్న వారికి అందించారు. తనొక్కడే కాకుండా మరికొంత మందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తే బాగుంటుందనే తన ఆలోచనని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. అది నచ్చి చాలా మంది మిత్రులు వెంట నడిచారు. అలా ‘ఫుడ్ బ్యాంక్ ఆఫ్ తెలంగాణ’ అనే సంస్థ ప్రారంభమైంది.. ఇప్పుడు నవీన్‌కు 500 మంది తోడుగా నిలిచారు. ప్రతి ఆదివారం సంస్థ వలంటీర్లు రోడ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లకు వెళ్లి పేదలకు పౌష్టికాహారం అందజేస్తారు. మిగిలిన రోజుల్లో ఆదివారానికి సరిపడా సరుకులు సమకూర్చుకుంటారు. గత ఏడాది కేరళలోనూ వీరు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో మొదలైన వీరి సేవా ప్రస్థానం ప్రస్తుతం నిర్మల్, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు విస్తరించింది.
- గెంటిల నిఖిల్, హైదరాబాద్
|