close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఈ శతాబ్దం సౌర విద్యుత్తుదే

 
  ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు: ప్రధాని మోదీ
  మధ్యప్రదేశ్‌లోని రీవాలో భారీ సౌరపార్కు ప్రారంభం
  అది నాణ్యమైనది, స్వచ్ఛమైనది
  ప్రధాని మోదీ ఉద్ఘాటన

ఆర్థికం, పర్యావరణం వేర్వేరు అంశాలు కాదు...  అవి ఒకే నాణేనికి రెండు వైపుల ఉన్న గుర్తులని భారత్‌ నిరూపించింది.

ఈనాడు, దిల్లీ: ‘‘21 వ శతాబ్దంలో విద్యుత్తు అవసరాలు తీర్చడంలో సౌర విద్యుత్తుదే కీలకపాత్ర. అది స్వచ్ఛం..నాణ్యం.. సుభద్రమైంది. విద్యుత్తు ఉత్పత్తికి ఉపయోగించే మిగతా వనరులు అంతరించిపోవచ్చునేమోగానీ సూర్యరశ్మి  మాత్రం నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంది. ఇది పర్యావరాణాన్ని కలుషితం చేయడానికి బదులు సంరక్షిస్తుంది. స్వావలంబనకు ప్రతీక అయిన సౌరశక్తి మన విద్యుత్తు అవసరాలను సురక్షితం చేస్తుంది’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని రీవాలో ఏర్పాటుచేసిన 750 మెగావాట్ల భారీ సౌరవిద్యుత్తు ప్లాంటును ఆయన శుక్రవారం వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా దిల్లీ నుంచి ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ భారత్‌ ఇకమీదట సౌర విద్యుత్తు తయారీకి ఉపయోగించే ఉపకరణాలన్నింటినీ దేశంలోనే ఉత్పత్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు.  ఈ విషయంలో ఇతరులపై ఆధారపడటం తగ్గించి పూర్తి స్వావలంబన సాధించాలన్నారు. సౌర విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటుచేసేవారే సోలార్‌ పీవీ తయారీని ప్రారంభిస్తే ప్రోత్సాహకాలు అందిస్తామని పేర్కొన్నారు. అంది వచ్చిన ఈ అవకాశాన్ని ఎవ్వరూ చేజార్చుకోవద్దని, స్టార్టప్‌లనుంచి భారీ పరిశ్రమలవరకు అందరూ దేశీయంగా సౌర విద్యుత్తు ఉపకరణాలు తయారుచేయాలని పిలుపునిచ్చారు. ‘‘ఆత్మనిర్భర్‌ భారత్‌ను సాధించాలంటే విద్యుత్తు ఉత్పత్తిలో స్వావలంబన సాధించడం చాలా ముఖ్యం. స్వావలంబన సాధనలో ఆర్థిక వ్యవస్థకు కీలక పాత్ర ఉంటుంది. ఇలాంటి సమయంలో విధానాలు రూపొందించేటప్పుడు ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకోవాలా? పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకోవాలా? అన్న ఊగిసలాట ఉంటుంది. చాలామంది ఏదో ఒక అంశాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటుంటారు. కానీ భారత్‌ ఆ రెండింటికీ ప్రాధాన్యం ఇస్తోంది.  దేశంలో ఇప్పటివరకు 36 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ చేశాం. కోటికిపైగా వీధిదీపాలు ఏర్పాటుచేశాం. కానీ దీని గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఏదైనా వస్తువు మన దగ్గర లేనప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఒకప్పుడు సామాన్యులకు అందుబాటు ధరల్లో లేని ఎల్‌ఈడీ గురించి ఎవ్వరూ పట్టించుకొనేవారుకాదు. ఆరేళ్లలో మేం తీసుకున్న చర్యల వల్ల దాని విలువ పదిరెట్లు తగ్గింది. రూ.400 బల్బు రూ.40కి చేరింది. ఇళ్లు, వీధుల్లో ఎల్‌ఈడీలు ఏర్పాటుచేయడంవల్ల విద్యుత్తు వినియోగం తగ్గి మధ్యతరగతి వారికి ఏటా రూ.24వేల కోట్లు  మిగులుతోంది. ఎల్‌ఈడీలవల్ల ఏటా 4.50 కోట్ల టన్నుల కర్బన ఉద్గారాలు కూడా ఆగిపోయి కాలుష్యం తగ్గింది. 2014లో సౌర విద్యుత్తు ధర యూనిట్‌కు రూ.8 ఉంటే ఇప్పుడు రూ.2.50కి వచ్చింది. దీనివల్ల దేశ ప్రజలంతా లబ్ధిపొందుతున్నారు’’ అని మోదీ వివరించారు.

ఒక సూర్యుడు.. ఒక గ్రిడ్‌

‘‘సౌరశక్తి కోసం అంతర్జాతీయ సౌర కూటమి  ఏర్పాటుచేశాం. ఒకే సూర్యుడు, ఒకే ప్రపంచం, ఒకే గ్రిడ్‌ దాని ప్రధాన ఉద్దేశం. దానివల్ల ప్రపంచం ముందున్న ప్రధాన కాలుష్య సమస్య తగ్గుతుంది. సౌర విద్యుత్తు వచ్చిన తర్వాత సామాన్యులుకూడా విద్యుత్తు ఉత్పత్తిదారులుగా మారారు. ఇందులో ఇప్పుడు రైతులుకూడా పాలుపంచుకుంటున్నారు. రైతులు ఒకవైపు పంట పడిస్తూనే మరోవైపు బంజరు భూముల్లో విద్యుత్తు ఉత్పత్తి చేయగలుగుతున్నారు. దీనివల్ల వారి ఆదాయం పెరుగుతుంది. భారత్‌ను విద్యుత్తు ఎగుమతిదారుగా చేయడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు.

ముఖ్యాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.