US: గగుర్పాటుకు గురిచేసే ఘటన.. మృతదేహం చుట్టూ 125 పాములు!

ఓ వ్యక్తి మృతదేహం చుట్టూ దాదాపు 125 పాములు పాకుతూ కనిపించాయి. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఈ ఘటన అమెరికాలోని మేరీలాండ్‌లో జరిగింది........

Updated : 23 Jan 2022 11:26 IST

వాషింగ్టన్‌: పొరుగింటి వ్యక్తి నిన్నటి నుంచి కనిపించడం లేదంటూ పోలీసులకు సమాచారం వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడి ఇంటికి చేరి తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అయితే అక్కడ కనిపించిన దృశ్యాలు చూసి ఉలిక్కిపడ్డారు. సదరు వ్యక్తి కిందపడి ఉండగా.. ఆ మృతదేహం చుట్టూ దాదాపు 125 పాములు పాకుతూ కనిపించాయి. ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే ఈ ఘటన అమెరికాలోని మేరీలాండ్‌లో జరిగింది.

చార్లెస్‌ కౌంటీ ప్రాంతంలో నివసించే ఓ వ్యక్తి  కనిపించకుండా పోయాడు. దీంతో అనుమానం వచ్చిన పొరుగింటి వ్యక్తి గత బుధవారం రాత్రి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అతడి ఇంటికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. అయితే సదరు వ్యక్తి మృతదేహం కిందపడి ఉండగా.. ఆ మృతదేహం చుట్టే 125 పాములు పాకుతూ కనిపించాయి. అందులో అత్యంత విషపూరితమైన కోబ్రాలతోపాటు, 14 అడుగుల ఓ కొండచిలువ కూడా ఉంది. ఆ సర్పాలను అతడు పెంచుకుంటున్నట్లు సమాచారం. ఇతర సహాయక సిబ్బందితో కలిసి పోలీసులు ఆ పాములన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అతడి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

అయితే ఆ ఇంట్లోని కొన్ని పాములు తప్పించుకుపోయాయేమోనని ఇరుగుపొరుగు వారు భయాందోళన వ్యక్తం చేశారు. కాగా దీనిపై చార్లెస్ కౌంటీ యానిమల్ కంట్రోల్ ప్రతినిధి జెన్నిఫర్‌ హారిస్‌ స్పందించారు. ఇంట్లోని సర్పాల్లో ఏవి కూడా తప్పించుకుపోయే అవకాశం లేదని, అన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని స్పష్టం చేశారు. ప్రజలు బయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని