Lahore Blast: లాహోర్‌లో శక్తిమంతమైన పేలుడు.. ముగ్గురి మృతి

పాకిస్థాన్‌లోని లాహోర్‌లో గురువారం శక్తిమంతమైన బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. ఇక్కడి ప్రసిద్ధ అనార్కలి మార్కెట్‌లోని పాన్‌ మండీ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక పోలీసు...

Published : 21 Jan 2022 01:45 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని లాహోర్‌లో గురువారం శక్తిమంతమైన బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. ఇక్కడి ప్రసిద్ధ అనార్కలి మార్కెట్‌లోని పాన్‌ మండీ వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి అక్కడ దాదాపు ఒకటిన్నర అడుగుల లోతైన గుంత ఏర్పడగా, సమీపంలోని దుకాణాలు, భవనాల కిటికీలు ధ్వంసం కావడం గమనార్హం. ద్విచక్ర వాహనాలూ దెబ్బతిన్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ మార్కెట్‌లో భారతీయ వస్తువుల విక్రయాలు సాగుతుంటాయని స్థానికులు చెప్పారు.

పేలుడు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు, ఇప్పటి వరకు ఏ సంస్థ ఈ ఘటనకు బాధ్యత వహించలేదు. అయితే, ద్విచక్ర వాహనంలో అమర్చిన టైం బాంబు ఈ పేలుడుకు కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని లాహోర్ పోలీసు అధికార ప్రతినిధి రాణా ఆరిఫ్ ఓ వార్తాసంస్థకు తెలిపారు. ఉగ్రవాద నిరోధక విభాగం, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పేలుడు ఘటనను విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. ఆస్పత్రికి తరలించిన వారిలోనూ నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అక్కడి వైద్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని