Afghanistan: మీరైనా మమ్మల్ని గుర్తించండి: ముస్లిం దేశాలకు తాలిబన్ల విజ్ఞప్తి

అప్ఘానిస్థాన్‌లో తాలిబన్ల అరాచక పాలన కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతేడాది ఆగస్టులో దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్లు ప్రజల మానవ హక్కులను కాలరాస్తూ అనేక ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ప్రపంచదేశాలన్నీ తాలిబన్ల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారి ఉగ్రవాద చర్యలకు అడ్డుకునేందుకు

Published : 20 Jan 2022 02:12 IST

కాబూల్‌: గతేడాది ఆగస్టులో అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు మానవ హక్కులను కాలరాస్తూ అనేక ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో ప్రపంచదేశాలన్నీ తాలిబన్ల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వారి చర్యలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే అఫ్గాన్‌కు నిధులు అందకుండా స్తంభింపజేశారు. మరోవైపు తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించేందుకు దేశాధినేతలు విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కనీసం ముస్లిం దేశాలైనా ముందుకు వచ్చి తమ ప్రభుత్వాన్ని గుర్తించాలని ప్రస్తుత అఫ్గాన్‌ ప్రధాని మొహ్మద్‌ హసన్‌ అఖుంద్‌ విజ్ఞప్తి చేశారు. 

దేశ ఆర్థిక సంక్షోభంపై కాబూల్‌లో నిర్వహించిన ఓ సమావేశంలో అఖుంద్‌ మాట్లాడుతూ ‘‘మా ప్రభుత్వాన్ని ముస్లిం దేశాలైనా అధికారికంగా గుర్తించాలని కోరుతున్నాం. అప్పుడే, దేశాన్ని త్వరగా అభివృద్ధి చేయగలం. మా అధికారుల కోసం కాదు.. దేశ ప్రజల కోసమే మేం అడుగుతున్నాం’’అని అఖుంద్‌ అన్నారు. దేశంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడం ద్వారా అవసరమైన అన్ని షరతులను తాలిబన్‌ ప్రభుత్వం నెరవేర్చిందని స్పష్టం చేశారు. 

అఫ్గాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ దేశంలో ఆర్థిక, ఆహార సంక్షోభం ఏర్పడింది. విదేశాల్లోని అఫ్గాన్‌ నిధులను ఆయా దేశాలు స్తంభింపజేశాయి. దేశంలో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఆహార కొరత తీవ్రమవడంతో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ ప్రజల్ని కాపాడుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా బ్యాంకుల్లో నిల్వ ఉంచిన అఫ్గాన్‌ నిధుల్ని విడుదల చేయాలని, తమ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించాలని గత కొంతకాలంగా ప్రపంచదేశాలను తాలిబన్లు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని