Updated : 06/12/2021 05:00 IST

Konijeti Rosaiah: అభిమాన నేతకు అంతిమ వీడ్కోలు

కడసారి చూపు కోసం తరలివచ్చిన శ్రేణులు
రోశయ్య పార్థివ దేహానికి నేతల నివాళులు
సోనియా తరఫున హాజరైన మల్లికార్జున ఖర్గే

అమీర్‌పేట, గాంధీభవన్‌, శామీర్‌పేట, న్యూస్‌టుడే: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్యకు కాంగ్రెస్‌ నాయకులు, అభిమానులు బరువెక్కిన హృదయాలతో అంతిమ వీడ్కోలు పలికారు. ఆయన భౌతికకాయాన్ని అమీర్‌పేట ధరమ్‌కరమ్‌ రోడ్డులోని ఇంట్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ దూతగా అంత్యక్రియలకు హాజరయ్యారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ప్రముఖ సినీనటుడు చిరంజీవి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు, తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఎంపీలు సురేశ్‌రెడ్డి, టీజీ వెంకటేష్‌, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, కేంద్ర మాజీమంత్రి పల్లంరాజు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి, ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షుడు రామకృష్ణ టంగుటూరి, తెరాస పార్లమెంటరీ నేత కె.కేశవరావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌, ప్రెస్‌ అకాడమీ మాజీ ఛైర్మన్‌ తిరుమలగిరి సురేందర్‌ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బాలినేని శ్రీనివాసరెడ్డి, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్‌ హాజరయ్యారు.. మధ్యాహ్నం 12 గంటలకు భౌతికకాయాన్ని నాంపల్లిలోని గాంధీభవన్‌కు తీసుకువచ్చారు. తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, శైలజానాథ్‌, మాజీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, వి.హనుమంతరావు తదితరులు ఆయన పార్థివ దేహాన్ని ఉంచిన పేటికను మోస్తూ గాంధీభవన్‌ లోపలికి తీసుకువెళ్లారు. కాంగ్రెస్‌ పార్టీ, ఈ దేశం గొప్ప ప్రజాస్వామ్యవాదిని కోల్పోయాయని రేవంత్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌అలీ, బలరాం నాయక్‌, సీతక్క, మల్లు రవి, జి.నిరంజన్‌ పాల్గొన్నారు. అభిమాన నేతను కడసారి చూసేందుకు పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అక్కడి నుంచి మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా దేవరయాంజల్‌ గ్రామంలో ఉన్న వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర సాగింది. రోశయ్య కుమారులు శివ సుబ్బారావు, శ్రీనివాసమూర్తి దహన సంస్కారాలు నిర్వహించారు. డాక్టర్‌ గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, మర్రి శశిధర్‌రెడ్డి, సంపత్‌కుమార్‌, మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు, తెలంగాణ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దామోదర్‌, నిజామాబాద్‌ ఎమ్మెల్యే గణేశ్‌ గుప్త, ఏపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్‌రావు, ఏఐసీసీ కార్యదర్శి రుద్రరాజు పద్మరాజు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. పోలీసులు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఇన్‌ఛార్జి కలెక్టర్‌ హరీష్‌, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖుల నివాళి

కాంగ్రెస్‌ గొప్ప నేతను కోల్పోయిందని మల్లికార్జున ఖర్గే అన్నారు. రోశయ్య మరణవార్త విని సోనియాగాంధీ తీవ్రంగా చలించిపోయారని తెలిపారు. ఆయన 16 సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారని, ఏ పదవి అప్పగించినా సమర్థంగా నిర్వర్తించారని పేర్కొన్నారు. ఏఐసీసీ, సోనియాగాంధీ తరఫున ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రోశయ్య మృతి రాజకీయ వ్యవస్థకు తీరనిలోటని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సభలో ఎంతగా ఘర్షణ పడినా శత్రువుల మాదిరి కాకుండా, రాజకీయ ప్రత్యర్థుల్లాగే చూసేవారని పేర్కొన్నారు. నాటి సీఏం వై.ఎస్‌.రాజశేఖరరెడ్డికి కవచంలా ఉన్న ఘనత రోశయ్యకు దక్కుతుందని అన్నారు. అవినీతి ఆరోపణలకు దూరంగా ఉంటూ రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలిచారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఆర్థికమంత్రి అంటే ఇప్పటికీ రోశయ్యే గుర్తుకొస్తారని పేర్కొన్నారు. శాసనసభలో, పార్లమెంట్‌లో ఆయనను చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నామని తెలిపారు. ఆయనొక నిఘంటువు వంటివారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎంత కోసం ఉన్నా ముఖంలో ఎప్పుడూ చూపలేదని, ఎంత క్లిష్టమైన సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరించేవారని గుర్తుచేసుకున్నారు.

ప్రకాశం జిల్లాలో విగ్రహం పెడతాం: బాలినేని

తెలుగు ప్రజలకు చిరకాలం గుర్తుండిపోయే వ్యక్తి రోశయ్య అని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వివాదరహితుడిగా తోటి శాసనసభ్యులకు ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున ప్రకాశం జిల్లాలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని