Chandrababu: విలపించిన చంద్రబాబు

ఏపీ శాసనసభలో  వైకాపా ఎమ్మెల్యేలు తన భార్య గురించి అసభ్యంగా వ్యాఖ్యానించారని తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అవమానాన్ని తట్టుకోలేక భోరున విలపించారు.

Updated : 20 Nov 2021 04:53 IST

భార్యను అవమానించారంటూ ఆవేదన

చలించిన తెదేపా అధినేత

అది గౌరవ సభ కాదు... కౌరవ సభ అని మండిపాటు

ప్రజాక్షేత్రంలో తేల్చుకున్నాకే మళ్లీ అసెంబ్లీకి వస్తానని శపథం

ఈనాడు, అమరావతి: ఏపీ శాసనసభలో వైకాపా ఎమ్మెల్యేలు తన భార్య గురించి అసభ్యంగా వ్యాఖ్యానించారని తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అవమానాన్ని తట్టుకోలేక భోరున విలపించారు. శుక్రవారం సభలో జరిగిన తీవ్ర వాగ్వివాదాలు చంద్రబాబు ఆవేదనకు కారణ మయ్యాయి. తీవ్రంగా చలించిపోయిన ఆయన ప్రజాక్షేత్రంలో తేల్చుకున్నాకే సభకు వస్తానని ప్రకటించి సభ నుంచి బయటకు వచ్చేశారు. నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని అతి కష్టం మీద నియంత్రించుకుంటూ, విషణ్ణ వదనంతో, గద్గద స్వరంతో విలేకరులతో మాట్లాడారు. 

విలేకరుల సమావేశం కొనసాగినంత సేపూ... ఆయనలో దుఃఖం కట్టలు తెంచుకు వస్తూనే ఉంది. కళ్లు తుడుచుకుంటూనే మాట్లాడటం కొనసాగించారు. అంతకుముందు శాసనసభ ఆవరణలోని తన ఛాంబర్‌లోనూ ఆయన వెక్కి వెక్కి ఏడ్చారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి అవమానం ఎప్పుడూ ఎదురవ్వలేదన్నారు. ఎన్నికల్లో ఓడినా ఇంత బాధ పడలేదని, ఎన్నో సంక్షోభాల్ని అత్యంత సునాయాసంగా ఎదుర్కొన్నానని, కానీ తన భార్య వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధంలేని తన భార్యను అవమానిస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ... అధికార పార్టీ ఎమ్మెల్యేలు అత్యంత నీచంగా మాట్లాడిన ఆ సభ, ఇక ఎంత మాత్రం గౌరవ సభ కాదని, అలాంటి కౌరవ సభకు ఇక వెళ్లబోనని ప్రకటించారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకున్నాకే మళ్లీ సభలో అడుగుపెడతానని ప్రతిజ్ఞ చేశారు. అదే నిర్ణయాన్ని శాసనసభలోనే చెప్పి బయటకు రావాలనుకున్నానని, కానీ స్పీకర్‌ మైక్‌ ఇచ్చి... మాట్లాడుతుండగా మధ్యలో కట్‌ చేసి మరోసారి అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విషణ్ణ వదనంతో... విలపిస్తూ

అప్పటికే మానసికంగా తీవ్రంగా కుమిలిపోయిన చంద్రబాబు... విలేకరుల సమావేశానికి విషణ్ణ వదనంతో వచ్చారు. గద్గద స్వరంతో మాట్లాడటం ప్రారంభించారు. సభలో జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ దుఃఖాన్ని నియంత్రించుకోలేకపోయారు. ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చేశారు. రెండు చేతుల్లో ముఖాన్ని దాచుకుని కొంతసేపు అలానే ఉండిపోయారు. దుఃఖంతో గొంతు పూడుకుపోవడంతో ఆయన నోటివెంట మాటలు రావడం కష్టమైంది. చంద్రబాబుని ఎప్పుడూ అలా చూడని పార్టీ సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిశ్చేష్ఠులయ్యారు. కాసేపటికి ఆయనే తేరుకుని, మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ ఎంత ప్రయత్నించినా భావోద్వేగాల్ని ఆపుకోలేకపోయారు. మధ్య మధ్యలో వెక్కి వెక్కి రోదిస్తూనే విలేకరుల సమావేశాన్ని ముగించారు. చంద్రబాబు పరిస్థితి చూసి యనమల రామకృష్ణుడు, బుచ్చయ్యచౌదరి వంటి సీనియర్‌ నాయకులూ చలించిపోయారు. అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవాని, పంచుమర్తి అనురాధ తదితరులూ కంటతడి పెట్టారు.

నా భార్యను నీచ రాజకీయాల్లోకి లాగుతారా?

రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని తన భార్యను నీచ రాజకీయాల్లోకి లాగి, శాసనసభలో ఆమెపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తూ అవమానించడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని చంద్రబాబు చెప్పారు. ‘ఆమెకు ఎప్పుడూ రాజకీయాలపై ఆసక్తి లేదు. వాళ్ల నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ, సుదీర్ఘకాలం నేను సీఎంగా ఉన్నప్పుడు గానీ ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. నేను సీఎంగా ఉన్నప్పుడు ప్రొటోకాల్‌ ప్రకారం తప్పనిసరిగా ఆమె పాల్గొనాల్సిన కార్యక్రమాలుంటే, రిక్వెస్ట్‌ చేస్తే వచ్చేవారంతే. తన పనేదో చేసుకోవడం, నలుగురికీ సాయపడటం, నన్ను ప్రోత్సహించడం తప్ప తనకు ఇంకొకటి తెలీదు. అలాంటి వ్యక్తిని అంత ఘోరంగా అవమానించడం భరించరాని విషయం. నలభై ఏళ్లు ఏ ప్రతిష్ఠ కోసం, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి కష్టపడ్డామో, దానికి భంగం వాటిల్లింది. నా భార్య నాకు అన్నివిధాలా సహకరించారు.  హుద్‌హుద్‌ తుపాను వచ్చినప్పుడు నేను సచివాలయంలో ఉంటే... ఆమే ఫోన్‌ చేసి మీ బట్టలు సర్ది సూట్‌కేస్‌ పంపిస్తున్నా, వెంటనే అక్కడికి వెళ్లండని చెప్పారు’ అని ఆయన పేర్కొన్నారు.

ఎన్ని విధాలుగా అవమానించినా భరించాం

‘ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నన్ను, మా పార్టీ నాయకుల్ని అవమానించారు. మా నాయకుల్ని జైల్లో పెట్టారు. ఆర్థికంగా, రాజకీయంగా వేధించారు. అనరాని మాటలన్నారు. అన్నీ భరించాం. శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో... ‘కుప్పంలో ఓడిపోయిన మీ నాయకుడి ముఖం చూడాలని ఉంది, రమ్మనండి’ అని సీఎం అన్నా భరించాం. అన్నీ భరిస్తూ ఈ రోజు అసెంబ్లీకి వెళ్తే నా భార్యను అవమానించారు. నేను ఎనిమిదోసారి ఎమ్మెల్యేని. 38 ఏళ్లుగా అసెంబ్లీలో ఉన్నాను. అనేకమంది నాయకులతో కలసి పనిచేశాను. రాజకీయంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నాం. కానీ నేను ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉన్న ఏ వ్యక్తినీ అవమానకరంగా మాట్లాడలేదు. గెలుపోటములను స్పోర్టివ్‌గా తీసుకున్నాను. ఎన్టీఆర్‌ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో నేషనల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసినప్పుడు... వీపీ సింగ్‌, జ్యోతిబసు, వాజపేయి వంటి గొప్ప నాయకులతో కలసి పనిచేశాను. యునైటెడ్‌ ఫ్రంట్‌లో కరుణానిధి, బిజూ పట్నాయక్‌ వంటి నాయకులతో పనిచేశాను.  ఇక్కడి అభివృద్ధి చూసి బిల్‌ క్లింటన్‌ లాంటి అంతర్జాతీయ నాయకులూ గౌరవించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా ఏమీ అడగరు, ప్రజల కోసమే పనిచేస్తారని వాజపేయి ప్రశంసించేవారు. అలా నేను దేశం కోసం, రాష్ట్రం కోసం పని చేశానే తప్ప నా స్వార్థం కోసం ఎప్పుడూ ఆలోచించలేదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

మాకు సంస్కారం అడ్డొస్తోంది..

‘నలభై ఏళ్లుగా క్రమశిక్షణతో మెలగుతూ, ప్రజలకు సేవ చేసింది... ఇలా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాటలు అనిపించుకోవడానికా? అన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నాను. రాజకీయాల్లో విలువలు ఉండాలని బలంగా నమ్మి, 40 ఏళ్లుగా ఆచరిస్తూ వచ్చాను. మా నాయకులకు, కార్యకర్తలకు అదే నేర్పాను. ఎదుటివాళ్లు బూతులు తిట్టినా మేం తిట్టట్లేదంటే చేతకాక కాదు. సంస్కారం, విలువలు అడ్డుపడుతున్నాయి. మీరు నీతి నిజాయతీగా పనిచేస్తున్నప్పుడు మీ భార్య గురించి ఎవరైనా నీచంగా మాట్లాడితే ఎంత బాధ కలుగుతుందో విజ్ఞులైన ప్రజలు అర్థం చేసుకోవాలి’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.

స్పీకర్‌ ఆత్మవిమర్శ చేసుకోవాలి

‘నా భార్యను అవమానించేలా మాట్లాడారని, భరించలేకపోతున్నానని, సభ నుంచి వెళ్లిపోతున్నాని, అదే విషయం చెప్పేందుకు మైక్‌ ఇవ్వాలని అడిగితే స్పీకర్‌ తమ్మినేని సీతారాం నిరాకరించారు. ఆయన గతంలో నా దగ్గరే మంత్రిగా చేశారు. కానీ గతాన్ని పూర్తిగా మర్చిపోయారు. ఆయన్ని నాకేదో మేలు చేయాలని అడగలేదు. సభలో అభిప్రాయాన్ని చెప్పడం నా హక్కు. తరిమెల నాగిరెడ్డి వంటివారు శాసనసభలో ప్రకటన చేశాకే బయటకు వెళ్లారు. ఆ రోజు ఎన్టీ రామారావుకు సైతం నిండు సభలో అవమానం జరిగితే... మళ్లీ ముఖ్యమంత్రయ్యే వరకూ సభకు రానని అక్కడే చెప్పి బయటకు వచ్చేశారు. ఈ రోజు సభలో నాకు ఎలాంటి అవమానం జరిగిందో స్పీకర్‌ చూశారు. అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పని వైకాపా ఎమ్మెల్యేలకు ఆయన చెప్పలేదు సరికదా, మా సభ్యులు పోడియం దగ్గరకు వెళ్లి నిరసన తెలియజేస్తుంటే... చీఫ్‌విప్‌ వచ్చి చెప్పారని సభను వాయిదా వేసేశారు. తర్వాత నేను మళ్లీ సభలోకి వెళ్లి ముఖ్యమైన ప్రకటన చేయాలి, మైక్‌ ఇవ్వమంటే ఇవ్వలేదు. పదే పదే అడిగితే... ఇచ్చినట్టే ఇచ్చి మధ్యలోనే కట్‌ చేసి మళ్లీ అవమానించారు. తమ్మినేని సీతారాం ఆత్మవిమర్శ చేసుకోవాలి.’ అని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు.


అట్టుడికిన శాసన సభ..

వ్యవసాయంపై శుక్రవారం శాసనసభలో చర్చ జరిగింది. వివిధ అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య పలుసార్లు వాదోపవాదాలు జరిగాయి.ఈ సందర్భంగా చంద్రబాబును ఉద్దేశించి వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలతో  శాసనసభలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ‘ఆయన మాట్లాడేందుకు గంట, అరగంట కావాలి, మాకు అయిదు నిమిషాలిస్తే మాట్లాడతాం’ అని తెదేపా ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించగా ‘చంద్రబాబు బండారం, మాధవరెడ్డి సంగతి మాట్లాడుకునే సమయం కాదిది.. నాకు గంట కావాలని వ్యంగ్యంగా మాట్లాడారు.. సూటిగా చంద్రబాబును అడుగుతున్నా.. అలాంటి అంశాలపై చర్చకు మీరు, మీ పార్టీ చర్చకు సిద్ధమా?’ అని అంబటి ప్రశ్నించారు. ఇదే సమయంలో ఒక ఎమ్మెల్యే వెనక నుంచి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో తెదేపా సభ్యుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అంబటి వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు. తరువాత వాదోపవాదాలతో సభ అట్టుడికింది.


ఇది ధర్మపోరాటం

‘ఇప్పుడు జరగబోయేది ధర్మపోరాటం. ప్రజలు సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో నా వంతు కర్తవ్యం నిర్వహిస్తాను. క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తాను. అధికారంలో ఉన్న దుర్మార్గులు వాళ్లు చేస్తున్న తప్పుల్ని వేరేవాళ్లపై రుద్ది ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. ప్రజాచైతన్యంతోనే వారికి బుద్ధి చెప్పగలం. ధర్మాన్ని కాపాడటం కోసం మేం ముందుకే వెళ్తాం. ఈ పోరాటంలో ధర్మమే గెలుస్తుందా? అధర్మం గెలుస్తుందా? అన్నది ప్రజలే నిర్ణయించాలి. నాకు కొత్తగా పదవులు అవసరం లేదు. మరో ఐదేళ్లు సీఎంగా ఉండాలని నాకు కోరిక లేదు.  దేవతల నుంచి వరాలు తీసుకుని వారిపైనే దాడులకు పాల్పడ్డ రాక్షసుల్లా... వైకాపా నాయకులు ప్రవర్తిస్తున్నారు.  నేను ఏం తప్పు చేశానని ప్రజలు అలాంటి తీర్పు ఇచ్చారో ఇప్పటికీ తెలీదు. అయినా ప్రజల నిర్ణయాన్ని శిరసావహించి ప్రతిపక్షంలో బాధ్యతగా పనిచేస్తున్నాం’ అని చంద్రబాబు అన్నారు.


 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని