Heavy rains in telangana: ఊరు.. ఏరైంది

నీరు, నేల ఏకమయ్యాయి. నగరాలు, పట్టణాలు చెరువులుగా మారాయి. రెండు, మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కాలనీలను వరద ముంచెత్తింది. పలుచోట్ల బలహీనంగా ఉన్న ఇళ్లు, గోడలు కూలాయి. రహదారులు కొట్టుకు పోయాయి. చెరువుల కట్టలు తెగి పోయాయి. వాగులు ఉప్పొంగడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు మునిగాయి. ఐదు జిల్లాల్లో బడులకు సెలవు ప్రకటించారు....

Updated : 08 Sep 2021 09:34 IST

ఉత్తర తెలంగాణలో వరద ఉద్ధృతి
పలు జిల్లాల్లో భారీ నష్టం
ఆరుగురి మృతి.. ఇద్దరి గల్లంతు
కోతకు గురైన నిజాంసాగర్‌ కాల్వ, ఊడిపడిన మాసాని చెరువు గేటు
వేములవాడలో కూలిన మూలవాగు వంతెన సెంట్రింగ్‌

నీరు, నేల ఏకమయ్యాయి. నగరాలు, పట్టణాలు చెరువులుగా మారాయి. రెండు, మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కాలనీలను వరద ముంచెత్తింది. పలుచోట్ల బలహీనంగా ఉన్న ఇళ్లు, గోడలు కూలాయి. రహదారులు కొట్టుకు పోయాయి. చెరువుల కట్టలు తెగి పోయాయి. వాగులు ఉప్పొంగడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు మునిగాయి. ఐదు జిల్లాల్లో బడులకు సెలవు ప్రకటించారు.

ఈనాడు, ఈనాడు డిజిటల్‌, న్యూస్‌టుడే, యంత్రాంగం: నింగి, నేల ఏకమయ్యాయి. నగరాలు, పట్టణాలు చెరువులుగా మారాయి. రెండు, మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కాలనీలను వరద ముంచెత్తింది. పలుచోట్ల బలహీనంగా ఉన్న ఇళ్లు, గోడలు కూలాయి. రహదారులు కొట్టుకుపోయాయి. చెరువుల కట్టలు తెగిపోయాయి. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో జనజీవనం అతలాకుతలమైంది. వాగులు ఉప్పొంగడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేల ఎకరాల్లో పంటలు మునిగాయి. వర్షాలు, వరదలకు ఆరుగురు మృతి చెందారు. ఇద్దరు గల్లంతయ్యారు. భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం భారీగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

నిలిచిన రాకపోకలు

వరంగల్‌- కరీంనగర్‌ జాతీయ రహదారిపై, వరంగల్‌-ములుగు జాతీయ రహదారిపై కటాక్షపూర్‌ చెరువు వద్ద వరద పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పాకాల వాగు, మున్నేరు, ఆకేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. కామారెడ్డి-కరీంనగర్‌ మార్గంలో కమాన్‌పూర్‌ వద్ద నిర్మాణంలో ఉన్న ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేటలోని రామప్ప తూర్పు రోడ్డుకు గండి పడింది. రామప్ప సరస్సు మత్తడి ఉప్పొంగి నీరు ఉద్ధృతంగా రావడంతో ఈ రహదారి తెగిపోయింది. తాడ్వాయి మండలం జంపన్న వాగు ప్రమాదకరస్థాయిలో ప్రవహించడంతో మేడారంతోపాటు పరిసర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాద్రి జిల్లాలో కిన్నెరసాని వాగు ఉప్పొంగడంతో ఆవలి ఒడ్డున ఉన్న గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద మంగళవారం సాయంత్రం 6 గంటలకు గోదావరి వరద 34.5 అడుగులకు చేరింది. దుమ్ముగూడెం వద్ద 15.3 అడుగులకు పెరిగింది.

పట్టణాలను తేరుకోనివ్వని వర్షం  

కరీంనగర్‌, వరంగల్‌ నగరాల్లో కాలనీలు జలమయమయ్యాయి. వరంగల్‌లో హంటర్‌ రోడ్డు, ఎన్టీఆర్‌ నగర్‌, సంతోషిమాత కాలనీ, బృందావన్‌, సాయినగర్‌తోపాటు సుమారు 20 కాలనీలు నీట మునిగాయి. సుమారు 500 మందిని విపత్తు నిర్వహణ దళం పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

కరీంనగర్‌లో 15 కాలనీలు ముంపునకు గురయ్యాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు జలసంద్రాన్ని తలపించాయి. కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, హుజూరాబాద్‌, జమ్మికుంట, ఇల్లందకుంట, నిజామాబాద్‌లోని పలు కాలనీలను వరద ముంచెత్తింది. రోడ్లే కాల్వలుగా మారాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు వరదకు కొట్టుకుపోయాయి.

నిర్మల్‌ పట్టణంలోని గణేశ్‌నగర్‌ కోతి హనుమాన్‌ ప్రాంతం, వివేకానంద(కుభీరు) చౌరస్తా, వినాయక్‌నగర్‌, రాహుల్‌నగర్‌, గోకుల్‌నగర్‌, తదితర ప్రాంతాలను వరద ముంచెత్తింది.

నష్టం అపారం

వరంగల్‌ జిల్లాలో 25 ఇళ్లకు నష్టం వాటిల్లింది. కొన్ని కూలిపోయాయి. కరీంనగర్‌ జిల్లాలో 48 విద్యుత్‌ స్తంభాలు కూలాయి. పలుచోట్ల ఇళ్ల గోడలు కూలినట్లు సమాచారం. సిరిసిల్ల జిల్లాలో 65 ఇళ్లకు నష్టం వాటిల్లింది.

సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ మూలవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో నిర్మాణంలో ఉన్న వంతెన మంగళవారం కూలిపోయింది. రాజన్న దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పాత వంతెనకు ఇరువైపులా రెండు వంతెనలను రూ.28 కోట్లతో నిర్మాణం చేపట్టారు. పడమటి వైపు వంతెన పూర్తయి వినియోగంలోకి వచ్చినప్పటికీ తూర్పువైపు వంతెన నిర్మాణంలో ఉంది. 2019 సెప్టెంబరులో బీమ్‌లపై స్లాబ్‌ వేసే దశలో వర్షాలకు కూలిపోయింది. గత ఏడాది పనులు పునఃప్రారంభించగా గత నెలలో కురిసిన వర్షాలకు మళ్లీ కుంగిపోయింది. మంగళవారం నాటి భారీ వర్షాలకు మూలవాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో వంతెన కూలింది.

కోనరావుపేట మండలం కొలనూరు చెరువు కట్ట తెగిపోయింది.  

కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలం మహ్మద్‌నగర్‌ మధ్య రోడ్డు పూర్తిగా తెగిపోయింది. కరీంనగర్‌ మండలంలో ఎలబోతారం, ముగ్ధుంపూర్‌ చెక్‌డ్యామ్‌ల కరకట్టలు తెగిపోయాయి. కోరుట్ల, మెట్‌పల్లిల్లోనూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. కరీంనగర్‌ ఆర్టీసీ వర్క్‌షాప్‌ వద్ద జగిత్యాల ప్రధాన రహదారి నీటితో నిండిపోయింది. మంత్రి గంగుల కమలాకర్‌ పర్యటించి పరిస్థితిని పరిశీలించారు.

నిజామాబాద్‌ నగర శివారుల్లో నిజాంసాగర్‌ నుంచి మాసాని చెరువుకు వెళ్లే కాల్వ కోతకు గురైంది. ప్రవాహ ఒత్తిడికి మాసాని చెరువు తూము గేటు కొట్టుకుపోయింది.

సిద్దిపేట జిల్లా చిలప్‌చెడ్‌ మండలం జగ్గంపేట ప్రాథమిక పాఠశాలలో తరగతి గది పైకప్పు కూలింది. విద్యార్థులను ఉపాధ్యాయులు పక్కగదిలో కూర్చోబెట్టడంతో ప్రమాదం తప్పింది. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువ విడుదల చేయడంతో మెదక్‌ జిల్లాలోని పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గామాత ఆలయం జల దిగ్బంధంలో చిక్కుకుంది.

నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం చింతలూర్‌లో కోళ్లఫారంలోని 5 వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం గుడిపాడు చివారులోని రెండు నాటుకోళ్ల ఫారాలు చిన్నవాగు వరదలో చిక్కుకుని దాదాపు 500 కోళ్లు మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు.

వర్షాల కారణంగా సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సోమవారం 1,88,417 టన్నులకు గాను 92,265 టన్నుల ఉత్పత్తి మాత్రమే సాధ్యమైంది. మంగళవారం సైతం ఉపరితల గనుల్లో పనులు నిలిచిపోయాయి.


జల దిగ్బంధంలో సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం జలమయమైంది. జిల్లా కేంద్రానికి రాకపోకలు స్తంభించిపోయాయి. పట్టణానికి ఎగువన పెద్దచెరువు, జంగమయ్యకుంట, శుద్ధికుంట, కొత్త చెరువులు అలుగు పారడంతో 25 కాలనీలు నీటమునిగాయి. 146 కుటుంబాలకు అధికారులు పట్టణంలోని సినారె కళామందిరం, నర్సింగ్‌ కళాశాలలో పునరావాసం కల్పించారు. డీఆర్‌ఎఫ్‌ బృందం రెండు పడవలతో వచ్చి సహాయ చర్యలు చేపట్టింది. సమీకృత కలెక్టరేట్‌ జల దిగ్బంధంలో చిక్కుకుంది.



11న మళ్లీ అల్పపీడనం

బంగాళాఖాతంలో ఈ నెల 11న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నట్లు నాగరత్న తెలిపారు. రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి ఛత్తీస్‌గఢ్‌ వైపు వెళ్లింది. అది ప్రయాణించిన మార్గంలో 20 సెం.మీ.లకు పైగా కుంభవృష్టి కురిసినట్లు వాతావరణ శాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్‌ నాగరత్న తెలిపారు. బుధవారం నుంచి 4 రోజుల దాకా రాష్ట్రంలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు చెప్పారు.


తండ్రి, కుమారుడు సహా ఆరుగురి మృతి

వరద ప్రవాహం తండ్రీ కుమారుల ప్రాణాలు తీసింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం నందిపల్లికి చెందిన కుడుకల గంగమల్లు(47), కుమారుడు విష్ణువర్ధన్‌(7)తో కలిసి మంగళవారం ఉదయం మల్లన్నపేట వెళ్లారు. ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తున్న సమయంలో మల్లన్నపేట-వెంగళాపూర్‌ రహదారిపై ఉన్న కల్వర్టుపై చిక్కుకున్నారు. వరద తీవ్రత ఎక్కువ కావడంతో ప్రవాహంలో కొట్టుకుపోయి చనిపోయారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సంజీవయ్యనగర్‌కు చెందిన పెరుమాండ్ల దేవయ్య(55) పాతబస్టాండ్‌ సమీపంలో పైకప్పు లేని మ్యాన్‌హోల్‌లో జారిపడి గల్లంతయ్యాడు. పోలీసులతో పాటు సహాయక బృందాలు వెతుకుతున్నాయి.

కామారెడ్డి జిల్లాలోని గర్గుల్‌లో ఇంటి గోడ కూలి నిమ్మ నర్సవ్వ అనే వృద్ధురాలు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.  బోధన్‌ మండలంలోని పెగడాపల్లి, చిన్నమావంది శివారులోని పసుపువాగులో గుర్తుతెలియని మహిళ మృతదేహం కొట్టుకుపోయింది. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్‌ పంచాయతీ పరిధిలోని కన్నయ్యతండాలో పొలానికి వెళ్లిన అష్రద్‌ అనే రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు.

నిర్మల్‌ జిల్లా నర్సాపూర్‌(జి) మండలం టెంబుర్నిలో గుమ్ముల నరేశ్‌(30) అనే జాలరి గోదావరిలో చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యాడు.

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లి-గుడాటిపల్లి గ్రామాల మధ్యన ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నించిన రంగు కిష్టస్వామి (45) ప్రాణాలు కోల్పోయాడు. ఇదే జిల్లా మల్లంపల్లిలో ద్విచక్ర వాహనంపై వాగును దాటేందుకు ప్రయత్నించిన కామాద్రి వెంకటయ్య నీటిలో కొట్టుకుపోతుండగా గ్రామస్థులు కాపాడారు.

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట కల్వర్టు వద్ద నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న మల్ల రాజయ్య అనే వ్యక్తిని స్థానికులు కాపాడారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గోదావరి నది మధ్యలో దిబ్బపై ముగ్గురు గొర్రెల కాపరులు చిక్కుకుపోయారు. మేడిపల్లి మండలం పోరుమల్ల సమీపంలో వరదలో కారు చిక్కుకోగా.. అందులోని వ్యక్తిని స్థానికులు కాపాడారు.

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు యువకులు బాబీ, జితే, హామరు పెగ్గెర్ల వద్ద ఉన్న లోతట్టు వంతెన దాటుతున్న క్రమంలో చెరువులో కొట్టుకుపోయి చెట్ల పొదల్లో చిక్కుకున్నారు. స్థానిక యువకులు వారిని కాపాడారు.


ఐదు జిల్లాల్లో బడుల మూత

ఈనాడు, హైదరాబాద్‌: కుండపోత వర్షాల నేపథ్యంలో మంగళవారం అయిదు జిల్లాల్లో పాఠశాలలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. జగిత్యాల, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో మంగళవారం బడులు తెరవలేదని విద్యాశాఖ వెల్లడించింది.


దెబ్బతిన్న ఎల్లంపల్లి పైపులు

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి శివారులో ఎల్లంపల్లి జలాశయం పైపులైన్లు దెబ్బతిన్నాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షానికి పైపులైన్ల దిగువన వర్షం నీరు చేరడంతో 200 మీటర్ల మేర పైపులు దాదాపు మీటరున్నర పైకి లేచాయి.


రికార్డు కుంభవృష్టి

ఈనాడు, హైదరాబాద్‌: కుంభవృష్టిలా కురుస్తున్న వర్షాలకు పాత ‘రికార్డులు’ కొట్టుకుపోతున్నాయి. గత 120 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షపాతం తాజాగా నమోదైంది. సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట నుంచి మంగళవారం తెల్లవారుజామున 5 గంటల వరకూ (4 గంటల వ్యవధిలో) అత్యధికంగా హనుమకొండ జిల్లా నడికూడలో 38.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గత 120 ఏళ్ల వాతావరణ రికార్డులను పరిశీలిస్తే.. 1983 అక్టోబరు 6న నిజామామాద్‌లో 24 గంటల వ్యవధిలో నమోదైన 35.5 సెం.మీ. వర్షపాతమే అత్యధికం కాగా.. తాజాగా ఆ రికార్డు చెరిగిపోయింది. నడికూడలో సరికొత్త రికార్డు నమోదైంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21 ప్రాంతాల్లో 20 నుంచి 38.8 సెం.మీ.ల దాకా వర్షం కురవడంతో వరదలా నీరు పోటెత్తింది.


వాహనాలు వరద పాలు

ఫొటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని