Updated : 19/10/2021 10:14 IST

Rains in Kerala: 10 జలాశయాలకు రెడ్‌ అలర్ట్‌

కేరళలో ఆందోళనకర పరిస్థితులు
రేపటి నుంచి మళ్లీ భారీ వర్షాలు!
శబరిమలకు భక్తుల నిలిపివేత

పథనంతిట్ట: కేరళలో జల విలయం కొనసాగుతోంది! ప్రస్తుతానికి వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా పలు జలాశయాల్లో నీటి నిల్వలు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే 10 డ్యాంలకు సంబంధించి రెడ్‌ అలర్ట్‌లు జారీ అయ్యాయి. కక్కి డ్యాంలో రెండు షట్టర్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. తాజా భయాందోళనల నేపథ్యంలో శబరిమల యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం నుంచి ఈ నెల 24 వరకు కేరళలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

కేరళలో తాజా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం పథనంతిట్టలో సమీక్ష నిర్వహించింది. ఈ నెల 20-24 తేదీల మధ్య భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో.. తులా మాసం పూజల కోసం శబరిమల ఆలయానికి భక్తులను అనుమతించడం ప్రస్తుతానికి సాధ్యపడదని పేర్కొన్నారు. కేరళలో తాజాగా కొండచరియలు విరిగిపడటం, వరదల వంటి ఘటనల్లో మృత్యువాతపడ్డ వారి సంఖ్య 27కు పెరిగింది. ఈ నెల 12 నుంచి రాష్ట్రంలో మొత్తంగా 38 మంది వర్షాల సంబంధిత ఘటనల్లో దుర్మరణం పాలయ్యారు.

కళ్ల ముందే కొట్టుకుపోయిన ఇల్లు

కేరళలో వర్ష బీభత్సం ధాటికి వేలమంది నిరాశ్రయులయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో, వరదలు ముంచెత్తడంతో చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఒక్క కొట్టాయం జిల్లాలోనే 62 గృహాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముందకయం పట్టణంలో ప్రైవేటు బస్‌ డ్రైవర్‌గా పనిచేసే జేబి అనే వ్యక్తి ఇల్లు కళ్ల ముందే మణిమాల నది వరదలో కొట్టుకుపోవడం అక్కడి తాజా విలయానికి నిదర్శనం. తన 27 ఏళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరుగా మారిందంటూ జేబి కన్నీరుమున్నీరయ్యారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సోమవారం భారీ వర్షాలు కురిశాయి. రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌, ఉత్తరాఖండ్‌, తమిళనాడు, హరియాణా, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లలోని చాలా ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదైంది.

ఉత్తరాఖండ్‌లో ఐదుగురి మృత్యువాత

ఉత్తరాఖండ్‌ను 2 రోజులుగా వర్షాలు వణికిస్తున్నాయి. పౌరి జిల్లాలోని సమ్ఖాల్‌ ప్రాంతంలో వానల ధాటికి ఎత్తయిన ప్రాంతం నుంచి రాళ్లు, మట్టి కూలిపోవడంతో.. ముగ్గురు నేపాలీ కూలీలు మృత్యువాతపడ్డారు. చంపావట్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఇల్లు కూలిపోయి మరో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.

వంటపాత్రలో వధూవరులు

వర్షాల ధాటికి విలవిలలాడుతున్న కేరళలో ఓ వివాహం అందరి దృష్టిని ఆకర్షించింది. వధూవరులు వంటపాత్రలో కూర్చొని జలమయమైన వీధుల గుండా వివాహ వేదికకు చేరుకోవడమే అందుకు కారణం. అలప్పుజ జిల్లాకు చెందిన ఆకాశ్‌, ఐశ్వర్య ఆరోగ్య కార్యకర్తలు. సోమవారం వీరి వివాహం భారీ వర్షాల నడుమే జరిగింది. పెద్ద వంటపాత్రలో వీరిని కూర్చోబెట్టి వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లారు.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని