Updated : 10/10/2021 10:08 IST

Hyderabad Rains: మేఘం మళ్లీ ముంచేసింది

రెండో రోజూ గ్రేటర్‌లో కుండపోత
జలదిగ్బంధంలో వందలాది కాలనీలు  
జంట జలాశయాల గేట్ల ఎత్తివేత
ఆదిలాబాద్‌ జిల్లాలో నలుగురి మృతి
సికింద్రాబాద్‌లో 9.5 సెం.మీ.

ఈనాడు, హైదరాబాద్‌: భీకర శబ్దాలు, కుండపోత వానతో శనివారం హైదరాబాద్‌ చిగురుటాకులా వణికిపోయింది. వరసగా రెండో రోజూ జడివాన నగరాన్ని ముంచెత్తింది. ఉదయం నుంచి రాత్రి వరకు వేర్వేరు ప్రాంతాల్లో భారీవర్షం కురిసింది. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల మధ్య అయితే మరీ నిర్దయగా దంచికొట్టింది. యూసుఫ్‌గూడ, కూకట్‌పల్లిలోని రెండు భవనాలపై పిడుగులు పడ్డాయి. సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఇళ్లలోని ఎలక్ట్రానిక్‌ వస్తువులు దెబ్బతిన్నాయి. వందలాది కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దిల్‌సుఖ్‌నగర్‌లోని శివగంగ థియేటర్‌లోకి వరద చొచ్చుకెళ్లింది. ప్రవాహ తీవ్రతకు ప్రహరీ కూలింది. ప్రేక్షకుల ద్విచక్ర వాహనాలు 50 వరకు దెబ్బతిన్నాయి. సికింద్రాబాద్‌ మైలార్‌గడ్డ ప్రాంతంలో శిథిల భవనం నేలకూలింది. ఎగువ నుంచి వరద ఉద్ధృతి పెరగడంతో జలమండలి అధికారులు జంట జలాశయాల గేట్లు తెరిచారు. మూసీకి వరద నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. చెరువులు, నాలాలు ఉప్పొంగి పొర్లడంతో హయత్‌నగర్‌, వనస్థలిపురం, చంపాపేట, సరూర్‌నగర్‌ డివిజన్లలోని చాలా కాలనీలు నీటమునిగాయి. బాధితులను జీహెచ్‌ఎంసీ పునరావాస కేంద్రాలకు తరలించింది. మూసీ వరద ముప్పున్న ప్రాంతాల్లోనూ బల్దియా, పోలీసు యంత్రాంగం నిఘా పెట్టింది. గ్రేటర్‌ వ్యాప్తంగా వందలాది కాలనీలు 48 గంటలుగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. హబ్సిగూడ, వనస్థలిపురం, అస్మాన్‌గఢ్‌, చాంద్రాయణగుట్ట, జంగంమెట్‌ ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. నగరవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. రాత్రి 10 వరకు చాలా రహదారులపై వాహనాలు బారులు తీరి కనిపించాయి. ఎల్బీనగర్‌ కూడలి నుంచి మలక్‌పేట వరకు, సికింద్రాబాద్‌ నుంచి పంజాగుట్ట వరకు, కూకట్‌పల్లి, ఖైరతాబాద్‌ తదితర అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది.

వివిధ ప్రాంతాల్లో వర్షపాతం..
శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకూ సికింద్రాబాద్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయం వద్ద 9.5, బేగంపేట విమానాశ్రయం వద్ద 8.6, ఫిరోజ్‌గూడలో 7.1, పాటిగడ్డలో 7, తిరుమలగిరిలో 5.8, వెస్ట్‌ మారేడ్‌పల్లిలో 5, ఎల్‌బీనగర్‌లో 4.6, బజార్‌హత్నూర్‌(ఆదిలాబాద్‌)లో 4.7, గోవిందరావుపేట(ములుగు)లో 4.3 సెంటీమీటర్ల వంతున వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకూ అత్యధికంగా సరూర్‌నగర్‌(హైదరాబాద్‌)లో 15, అమీర్‌పేట(రంగారెడ్డి జిల్లా)లో 14.6, నందిగామ(రంగారెడ్డి)లో 13.3 సెం.మీ. కురిసింది.


పిడుగుల వాన

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో శనివారం వర్షంతో పాటు భారీగా పిడుగులు పడ్డాయి. తాంసి మండలం బండల్‌నాగపూర్‌ శివారులో పత్తి ఏరడానికి వచ్చిన మహారాష్ట్ర భవానిపూర్‌కు చెందిన బాలిక దీపాళి(13) పిడుగుపాటుకు కన్నుమూసింది. ఈ ఘటనలో మరో ఇద్దరు మహిళలు  గాయపడ్డారు. ఓ ఎద్దు మృత్యువాత పడింది.

* బజార్‌హత్నూర్‌ మండలం బుర్కపల్లిలో వ్యవసాయ పనులకు వెళ్లిన బనియా గరన్‌ సింగ్‌(48), అతడి తమ్ముడి భార్య ఆశాబాయి(28) పిడుగుపాటుకు మృతిచెందారు. కుమురం భీం జిల్లా జైనూర్‌ మండలం గూడామామడా గ్రామంలో శనివారం మధ్యాహ్నం పిడుగుపడి రైతు మెట్‌కర్‌ గణపతి(35)  మృతి చెందాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని పొలంపల్లి శివారులో పిడుగుపడి రెండు గొర్రెలు, ఒక మేక మృత్యువాత పడ్డాయి.

రేపటిలోగా అల్పపీడనం...
బంగాళాఖాతంలో అండమాన్‌ దీవులకు ఉత్తర ప్రాంతం వద్ద గాలులతో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సోమవారంలోగా అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడి.. అది తీవ్రమై నాలుగైదు రోజుల్లో ఉత్తరాంధ్ర తీరం వైపు వెళ్లవచ్చని అంచనా. ఆది, సోమవారాల్లో తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.


Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని