Jio Phone: జియో ఫోన్‌ ‘ప్రగతి ఓఎస్‌’ గురించి ఈ విషయాలు తెలుసా?

జియో, గూగుల్ సంయుక్తంగా తీసుకొస్తున్న జియోఫోన్ నెక్స్ట్‌ కోసం ఆండ్రాయిడ్ కొత్తగా ప్రగతి అనే ఓఎస్‌ను అభివృద్ధి చేసింది. మరి ఇందులో ఎలాంటి ఫీచర్లున్నాయి.. ఇది ఇతర ఫోన్లలను సపోర్ట్ చేస్తుందా అనేది తెలుసుకుందాం. 

Updated : 23 Nov 2022 10:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రిలయన్స్‌ జియో, గూగుల్ కలిసి తీసుకొస్తున్న జియోఫోన్‌ నెక్స్ట్‌ కోసం ఆండ్రాయిడ్ కొత్తగా ‘ప్రగతి’ అనే ఓఎస్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపింది. తొలుత ఈ ఫోన్‌లో ఎంట్రీ లెవల్ ఫోన్లలో ఉపయోగించే ఆండ్రాయిడ్ లైట్ వెర్షన్‌ ఓఎస్‌ ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌ ఓఎస్‌తో పనిచేస్తుందని భావించినప్పటికీ.. కొత్తగా ప్రగతి ఓఎస్‌ను రూపొందించినట్లు ప్రకటించారు. దీంతో ప్రగతి ఓఎస్‌ ఎలా ఉంటుంది? ఇందులో ఎలాంటి ఫీచర్లుంటాయి? ఆండ్రాయిడ్ లైట్ వెర్షన్‌కి దీనికి ఏమేం తేడాలున్నాయి? ఈ ఓఎస్‌ ఇతర ఫోన్లలో పనిచేస్తుందా.. లేదా అనే చర్చ మొదలైంది. మరి ఈ ప్రశ్నలకు టెక్ నిపుణులు ఏం సమాధానాలు చెబుతున్నారో చూద్దాం.. 


ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌

ఎంట్రీ లెవల్ ఫోన్ల కోసం గూగుల్ 2017లో అప్పటి ఆండ్రాయిడ్ ఓరియో ఓఎస్‌ లైట్‌ వెర్షన్‌గా ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్ ఓఎస్‌ను విడుదల చేసింది. దీంతో అప్పటి నుంచి గూగుల్ ఆండ్రాయిడ్ ఓఎస్‌లో కొత్త వెర్షన్ తీసుకొచ్చిన ప్రతిసారీ ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌ను కూడా తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ ఓరియో గో ఎడిషన్‌ విడుదలతో మొబైల్ తయారీ కంపెనీలు కూడా ఎంట్రీ లెవల్ ఫోన్ల తయారీపై దృష్టి సారించాయి. నోకియా, శాంసంగ్, అల్కాటెల్‌, లెనోవా, షావోమి, రెడ్‌మీ వంటి కంపెనీలు ఎక్కువగా ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌తో ఎంట్రీ లెవల్‌ ఫోన్లను విడుదల చేశాయి. తాజాగా ఈ ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌లో కొన్ని మార్పులు చేసి జియో కొత్త ఫోన్‌ కోసం ప్రగతి ఓఎస్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. 


ప్రగతి ఓఎస్‌

జియోఫోన్‌ నెక్స్ట్‌ని రిలయన్స్‌ జియో, గూగుల్ సంస్థలు కలిసి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గూగుల్ తన బ్లాగ్‌లో ప్రగతి ఓఎస్‌ యూజర్స్‌కి ఆండ్రాయిడ్ తరహా అనుభూతిని అందిస్తుందని పేర్కొంది. అయితే ప్రగతి ఓఎస్‌ను భవిష్యత్తు ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌ అత్యాధునిక వెర్షన్‌గా టెక్‌ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ప్రగతి ఓఎస్‌లో దాదాపు ఆండ్రాయిడ్ గో ఎడిషన్‌ తరహా ఫీచర్స్‌ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ‘ప్రగతి ఓఎస్‌’ బ్యాటరీని తక్కువగా ఉపయోగించుకుంటుందని.. దానివల్ల బ్యాటరీపై ఒత్తిడి తగ్గి ఛార్జింగ్ ఎక్కువసేపు ఉంటుందని సమాచారం. 

రిలయన్స్‌ కానీ, గూగుల్ కానీ ప్రగతి ఓఎస్‌ను ఆండ్రాయిడ్ 11 గో కస్టమైజ్‌డ్‌ వెర్షన్‌గా చెప్పలేదు. గూగుల్ ఇటీవల విడుదల చేసిన వీడియోలో జియో ఫోన్‌లో దాదాపు ఆండ్రాయిడ్ గో ఎడిషన్ యాప్‌లనే ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. జియోఫోన్ నెక్స్ట్‌లో అన్ని గూగుల్, జియో యాప్‌లు ఉంటాయని ఆయా సంస్థలు వెల్లడించాయి. గూగుల్‌ గో, గూగుల్ అసిస్టెంట్ గో, గ్యాలరీ గో, కెమెరా గో వంటి యాప్‌లే ఇందుకు ఉదాహరణ. జియో ఫోన్‌లోని అసిస్టెంట్ గో యాప్‌ పన్నెండు భారతీయ భాషల వరకు సపోర్ట్ చేస్తుందని గూగుల్ వెల్లడించింది. అలానే ఇందులో గూగుల్‌ లెన్స్‌ ఇస్తున్నారు. ఇందులో హెచ్‌డీఆర్‌, నైట్ మోడ్‌, పొట్రెయిట్ మోడ్ వంటి ఫీచర్లుంటాయి. 


ఇతర ఫోన్లలో పనిచేస్తుందా?

దీనిపై టెక్‌ నిపుణులు స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతున్నారు. ప్రగతి ఓఎస్‌ను పూర్తిగా జియోఫోన్ నెక్స్ట్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. దీంతో ఈ ఓఎస్‌ ఇతర ఫోన్లను సపోర్ట్‌ చేయకపోవచ్చని అంటున్నారు. అయితే జియో ఫోన్‌తో పాటు కొన్ని సంవత్సరాలపాటు ఉచితంగా ఓఎస్‌ అప్‌డేట్స్‌ ఇస్తామని సంస్థ ప్రకటించింది. దానివల్ల భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికరమైన, ఆధునిక ఫీచర్స్‌తోపాటు మెరుగైన ఇంటర్నెట్‌ సేవలు భారతీయ యూజర్స్‌కి అందుబాటులోకి వస్తాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని