Android Powerful Processor: పవర్‌ఫుల్ ఆండ్రాయిడ్ ప్రాసెసర్‌తో రానున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే!

క్వాల్‌కోమ్‌ కంపెనీ కొత్తగా స్నాప్‌డ్రాగన్ సిరీస్‌లో కొత్త ప్రాసెసర్‌ను విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్‌ ప్రాసెసర్లలోనే దీన్ని అత్యంత పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ అని క్వాల్‌కోమ్ చెబుతోంది. మరి ఈ ప్రాసెసర్‌తో ఏయే ఫోన్ మోడల్స్ రానున్నాయనేది చూద్దాం. 

Updated : 28 Dec 2021 22:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో క్వాల్‌కోమ్‌ (Qualcomm) ప్రాసెసర్‌లేని ఫోన్లు చాలా అరుదు.  దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌ తయారీ కంపెనీలు క్వాల్‌కోమ్‌ ప్రాసెసర్లనే ఉపయోగిస్తుంటాయి. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగానే క్వాల్‌కోమ్‌ సమర్థవంతమైన కొత్త ప్రాసెసర్లను ఎప్పటికప్పుడు తయారుచేస్తుంది. తాజాగా స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 (Snapdragon 8 Gen 1) పేరుతో స్నాప్‌డ్రాగన్‌ (Snapdragon) 8 సిరీస్‌లో ఈ కొత్త ప్రాసెసర్‌ను పరిచయం చేసింది. దీన్ని ఆండ్రాయిడ్ ప్రాసెసర్లలోనే పవర్‌ఫుల్‌ ప్రాసెసర్‌గా టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రీమియం మొబైల్‌ టెక్నాలజీతో గత ప్రాసెసర్‌ల కన్నా మెరుగైన ఫీచర్స్‌ ఇందులో ఉంటాయని క్వాల్‌కోమ్‌ వెల్లడించింది. 

ఈ ప్రాసెసర్‌ సాయంతో ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ శ్రేణిలో కటింగ్ ఎడ్జ్‌ 5జీ (5G), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI), గేమింగ్‌ , కెమెరా, వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ, సౌండ్‌, భద్రత వంటి ఫీచర్స్‌ యూజర్స్‌కు మరింత మెరుగైన సేవలను అందిస్తాయని క్వాల్‌కోమ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్ అలెక్స్‌ కటౌజియాన్ తెలిపారు. ఇప్పటికే పలు మొబైల్ కంపెనీలు స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 ప్రాసెసర్‌తో స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. మరి పవర్‌ఫుల్ ప్రాసెసర్‌తో రానున్న మొబైల్ జాబితాపై ఓ లుక్కేద్దామా..


షావోమి 12 (Xiaomi 12)

షావోమి కొత్తగా 12 సిరీస్‌లో ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. క్వాల్‌కోమ్‌ టెక్ సమ్మిత్‌లోనే ఈ విషయాన్ని షావోమి ప్రకటించింది. టెక్ వర్గాల సమాచారం ప్రకారం షావోమి 12 అల్ట్రా పేరుతో ఈ ఫోన్ తీసుకురానుంది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ ఫోన్‌ను విపణిలోకి విడుదల చేయనుంది. 


ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌4 (Oppo Find X4)

ఒప్పో కూడా త్వరలో విడుదల చేయనున్న కొత్త మోడల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు సమాచారం. గతంలో విడుదలైన ఒప్పో ఫైండ్‌ ఎక్స్‌3 ప్రో మోడల్‌కు కొనసాగింపుగా ఒప్పో ఫైండ్ ఎక్స్‌4 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను పరిచయం చేయనుంది. ఇందులో 120 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌, 2K రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల శాంసంగ్‌ ఈ4 అమోలెడ్ ఎల్‌టీపీఓ డిస్‌ప్లే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలుంటాయని సమాచారం. వెనుకవైపు రెండు 50 ఎంపీ కెమెరాలతోపాటు 13 ఎంపీ కెమెరా ఉంటుందట. ముందుభాగంలో క్యాట్-ఐలెన్స్‌తో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చినట్లు తెలుస్తోంది. ఇతర వివరాలు తెలియాల్సివుంది. 


రియల్‌మీ జీటీ2 ప్రో (Realme GT2 Pro)

రియల్‌మీ జీటీ 2 ప్రో కూడా స్నాప్‌డ్రాగన్ 8 జెన్‌ 1 ప్రాసెసర్‌తో విడుదలకానుంది. ప్రీమియం శ్రేణిలో రానున్న తొలి జీటీ సిరీస్‌ ఫోన్‌ ఇదేనని టెక్‌ వర్గాలు తెలిపాయి. దీని ధర సుమారు రూ. 60 వేల వరకు ఉంటుందని అంచనా. షావోమి 11 అల్ట్రా మోడల్ తరహాలోనే జీటీ2 ప్రోలో కూడా వెనుకవైపు కెమెరా కోసం ప్రత్యేక కన్సోల్ ఇస్తున్నారట. వెనుకవైపు మూడు కెమెరాలలో రెండు 50 ఎంపీ కెమెరాలని సమాచారం. అలానే ఈ ఫోన్ 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట. 


మోటో ఎడ్జ్‌ ఎక్స్‌30 (Moto Edge X30)

స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 1 ప్రాసెసర్‌తో రానున్న మరో ఫోన్‌ మోటో ఎడ్జ్‌ ఎక్స్‌30. ఈ ఫోన్‌ను అంతర్జాతీయ మార్కెట్లోకి డిసెంబర్‌ నెలలో లేదా జనవరి మొదటి వారంలో విడుదల చేయనున్నారట. ఇందులో 144 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉటుందని తెలుస్తోంది. వెనుకవైపు 50 ఎంపీ మూడు కెమెరాలు, ముందుభాగంలో సెల్ఫీల కోసం 60 ఎంపీ కెమెరా ఉంటుందని సమాచారం. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 68 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట. 


వన్‌ప్లస్‌ 10 సిరీస్‌ (OnePlus 10 Series) 

వన్‌ప్లస్‌ కూడా 10 సిరీస్‌లో వన్‌ప్లస్‌ 10, వన్‌ప్లస్ 10 ప్రో రెండు కొత్త ఫోన్లను తీసుకురానుంది. ఈ ఫోన్లు  స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తాయి. వీటిలో 10 ప్రోలో 120 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల సిర్కా డిస్‌ప్లే ఇస్తున్నారట. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుందని, ఇది 125 ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు