Windows 11: కొత్త విండోస్‌లో డీఫాల్ట్ బ్రౌజర్‌ను ఎలా మార్చాలంటే! 

 విండోస్‌ 11 ఓఎస్‌లో వెబ్‌ లింక్‌లు మనకు నచ్చిన బ్రౌజర్‌లో ఓపెన్ అయ్యేందుకు సెట్టింగ్స్‌లో డీఫాల్ట్ బ్రౌజర్‌ను ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. 

Published : 06 Dec 2021 19:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుత సాంకేతిక యుగంలో ఏ చిన్న సమాచారం కావాలన్నా బ్రౌజర్‌లో వెతికేస్తాం. వీటిలో కూడా ఒక్కొ యూజర్‌ది ఒక్కో ఛాయిస్‌. కొందరు గూగుల్ క్రోమ్‌ ఉపయోగిస్తే, ఇంకొందరు మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌ వంటి వాటితోపాటు డక్‌ డక్‌ గో వంటివి వాడుతుంటారు. అలానే భద్రత పరంగా మెరుగైన ఫీచర్లు అందిస్తున్నామని ఆయా కంపెనీలు చెబుతుంటాయి. అయితే ఇటీవలి కాలంలో మైక్రోసాఫ్ట్ విడుదల చేసిన విండోస్‌ 11 ఓఎస్‌లో యూజర్స్‌ ఇతరుల నుంచి వచ్చే వెబ్‌ లింక్‌లను ఓపెన్ చేస్తే అవి ఎడ్జ్ బ్రౌజర్‌లోనే ఓపెన్ అవుతున్నాయట. ఒకవేళ సదరు లింక్‌లను యూజర్‌ క్రోమ్‌ లేదా ఇతర బ్రౌజర్లలో ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తే మైక్రోసాఫ్ట్ ఒక పాప్‌-అప్‌ మెసేజ్‌ను చూపిస్తుందని పలువురు యూజర్స్ వెల్లడించారు. ఇందులో ఎడ్జ్‌ బ్రౌజర్‌ ఉపయోగించమని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉండటంతో దీనిపై యూజర్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి మీరు క్లిక్ చేసిన వెబ్‌ లింక్‌లు మీకు నచ్చిన బ్రౌజర్‌లో ఓపెన్ అయ్యేలా.. విండోస్‌ 11లో డీఫాల్ట్‌ బ్రౌజర్‌ను ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. 

* ముందుగా పీసీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్‌ సెక్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత స్క్రీన్‌ ఎడమవైపున ఉన్న ప్యానల్‌పై క్లిక్ చేస్తే డీఫాల్ట్‌ యాప్స్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. 

* అందులో మీకు హెచ్‌టీటీపీ, హెచ్‌టీటీపీఎస్‌, హెచ్‌టీఎమ్‌ఎల్‌ పేరుతో వేర్వేరు ఎక్స్‌టెన్షన్స్‌ కనిపిస్తాయి. 

* వాటిలో ఒక్కో ఆప్షన్‌పై క్లిక్ చేసి మీకు నచ్చిన బ్రౌజర్‌ను సెలెక్ట్ చేయాలి. ఉదాహరణకు హెచ్‌టీటీపీఎస్‌ లింక్‌ ఓపెన్‌ అయ్యేందుకు క్రోమ్‌ బ్రౌజర్‌ను ఎంపిక చేస్తే, హెచ్‌టీఎమ్‌ఎల్‌ లింక్‌ కోసం మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే అన్ని లింక్‌లకు ఒకే బ్రౌజర్‌ను డీఫాల్ట్‌గా సెట్‌ చేయొచ్చు.

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని