Mobile Market: అమ్మకాల్లో షావోమీదే జోరు.. అయినా విన్నర్ రియల్‌మీనే..!

భారత్‌లో స్మార్ట్‌ మొబైల్స్‌ మార్కెట్‌ 2021 ఏడాదికి సంబంధించి 12 శాతం వృద్ధిని సాధించిందని కెనాలీస్‌ పరిశోధన సంస్థ వెల్లడించింది. కొవిడ్‌ భయపెట్టినా..

Updated : 25 Jan 2022 10:49 IST

దిల్లీ: భారత్‌లో 2021 ఏడాదికి సంబంధించి స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో  చైనా కంపెనీ షావోమీ సత్తా చాటింది. 25 శాతం మార్కెట్‌ వాటాతో టాప్‌లో నిలిచింది. అయితే, కంపెనీ వార్షిక వృద్ధిలో మాత్రం వెనబడింది. మరోవైపు అమ్మకాల్లో 15 శాతం వాటాతో నాలుగో స్థానంలో నిలిచిన ఒక్క రియల్‌మీ మాత్రమే రెండంకెల వార్షిక వృద్ధిని నమోదు చేయడం విశేషం. ఏడాది ప్రారంభంలో కొవిడ్‌ మహమ్మారి భయపెట్టినా.. రెండో త్రైమాసికానికల్లా భారత్‌లో మొబైల్‌ మార్కెట్‌ పుంజుకుంది. ఏడాది మొత్తం 162 మిలియన్ యూనిట్ల రికార్డు అమ్మకాలు జరిగినట్లు కెనాలీస్‌ (Canalys) సంస్థ వెల్లడించింది. ఫలితంగా 2020 (150 మిలియన్లు)తో పోలిస్తే భారత్‌లో మొబైల్‌ మార్కెట్‌ దాదాపు 12 శాతం వృద్ధిని సాధించినట్లు వివరించింది.

 

ఇక నాలుగో త్రైమాసికంలో మొత్తంగా 44.5 మిలియన్ ఫోన్ల షిప్పింగ్ జరగ్గా.. షావోమీ 9.3 మిలియన్‌ యూనిట్లను షిప్‌మెంట్స్‌ (21% మార్కెట్‌ షేర్‌) చేసింది. శాంసంగ్‌ 8.5 (19%), రియల్‌మీ 7.6 (17%), వివో 5.6 (13%), ఒప్పో 4.9 (11%) మిలియన్‌ యూనిట్లతో తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. ఇతర కంపెనీలు 8.5 మిలియన్‌ యూనిట్లను సరఫరా చేశాయి. ఇదే త్రైమాసికంలో షావోమీ గతేడాది ఏడాది 12 మిలియన్స్‌, శాంసంగ్‌ 9.2 మిలియన్‌ యూనిట్లను సరఫరా చేశాయి. వార్షిక వృద్ధిని చూసినప్పుడు షావోమీ -22 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. శాంసంగ్‌ -7 శాతం, రియల్‌మీ +47 శాతం, వివో -27 శాతం, ఒప్పో -19 శాతం, ఇతర కంపెనీలు +126 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

మరోవైపు బడ్జెట్‌ ధరల్లో జియో ఫోన్‌ నెక్స్ట్‌, ఇన్ఫినిక్స్‌, టెక్నో బ్రాండ్‌ మొబైల్స్‌ కూడా మార్కెట్‌ను అందిపుచ్చుకున్నట్లు కెనాలీస్‌ పేర్కొంది. 2022 ఏడాదిలోనూ భారత్‌లో మొబైల్‌ మార్కెట్ వృద్ధిని కొనసాగిస్తుందని అంచనా వేసింది. కొత్త తరం 5జీ మొబైల్స్‌ ఈ ఏడాది మార్కెట్‌ వృద్ధిని పెంచుతుందని భావిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు