ఈ ఏడాది సందడి చేయనున్న స్మార్ట్‌ఫోన్లివే..

మొబైల్‌ ఫోన్ల విషయానికొస్తే..5జీ టెక్నాలజీ, ఫోల్డింగ్ ఫోన్‌ల గురించి విపరీతమైన చర్చ నడించింది. దాదాపు అన్ని ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీలు 5జీ ఫోన్లను విడుదల చేశాయి. మొబైల్‌ కంపెనీలు కొత్త ఏడాదిలో విడుదల చేసే మోడల్స్‌ అమ్మకాలపైనే ఆశలు పెట్టుకున్నాయి... 

Updated : 12 Aug 2022 12:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: గతేడాది మొత్తం కొవిడ్‌ నామస్మరణతో గడిచిపోయినా.. టెక్‌ ప్రపంచంలో మాత్రం కొత్త మార్పులొచ్చాయి. ఎన్నో నూతన ఆవిష్కరణలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా టెక్నాలజీని సగటు మనిషికి మరింత చేరువ చేస్తూ రకరకాల యాప్‌లు, వెబ్‌సైట్లు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా మొబైల్‌ ఫోన్ల విషయానికొస్తే.. 5జీ టెక్నాలజీ, ఫోల్డింగ్ ఫోన్ల గురించి విపరీతమైన చర్చ నడించింది. దాదాపు అన్ని ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీలు 5జీ ఫోన్లను విడుదల చేశాయి. అయితే ఈ మోడల్స్‌ కంపెనీలు ఆశించినంతగా వినియోగదారులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో మొబైల్‌ కంపెనీలు కొత్త ఏడాదిలో విడుదల చేసే మోడల్స్‌ అమ్మకాలపైనే ఆశలు పెట్టుకున్నాయి. మరి 2021లో విడుదల కాబోతున్న కొత్త మోడల్స్‌ ఏంటి? వాటిలో ఎలాంటి ఫీచర్స్‌ ఇస్తున్నారు? ఆ వివరాలతో కూడిన సమాచారం మీ కోసం..


యాపిల్ ఐఫోన్ 13

గతేడాది చివర్లో ఐఫోన్ 12 సిరీస్‌లో 5జీ మోడల్స్‌తో సందడి చేసిన యాపిల్.. కొత్త సంవత్సరంలో నాలుగు కొత్త మోడల్స్‌ తీసుకురానుందట. వీటిలో ఐఫోన్ 13తో పాటు రెండు హై-ఎండ్ ప్రో మోడల్స్‌, రెండు బడ్జెట్‌ మోడల్స్ ఉంటాయని సమాచారం. అయితే వీటిలో ఎలాంటి ఫీచర్స్‌ ఇస్తున్నారనే దానిపై పూర్తి సమాచారం లేదు. అంతేకాకుండా ఫోల్డింగ్ ఫోన్‌ తయారీపై కూడా యాపిల్‌ దృష్టి సారించిందట. ఇప్పటికే ఈ ఫోన్‌లో ఉపయోగించే విడిభాగాల కోసం పలు కంపెనీలతో యాపిల్ ఒప్పందం చేసుకుందని సమాచారం.  


ఎంఐ 10ఐ

షావోమి కంపెనీ ఎంఐ 10ఐ పేరుతో కొత్త మోడల్ ఫోన్‌ను తీసుకొస్తోంది. జనవరి 5న భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 4,820 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారట. 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, స్నాప్‌డ్రాగన్‌ 750జీ ప్రాసెసర్‌ ఉపయోగించారట. 6జీబీ/128జీబీ 8జీబీ/128జీబీ వేరియంట్లో లభించనుందని సమాచారం. 


శాంసంగ్‌ ఎస్‌, ఎమ్‌, ఎఫ్‌ సిరీస్‌ 

గతేడాది ఆన్‌లైన్‌ అమ్మకాల్లో ముందంజలో ఉన్న శాంసంగ్‌ ఈ సారి కూడా తన మార్కెట్‌ పరిధిని మరింత విస్తరించుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఫ్లాగ్‌షిప్‌ మోడల్స్‌తో పాటు బడ్జెట్ మోడల్స్‌ని విడుదల చేయనుందట. ముందుగా శాంసంగ్ ఎస్‌ సిరీస్‌లో గెలాక్సీ ఎస్‌ 21, గెలాక్సీ ఎస్‌ 21+, గెలాక్సీ ఎస్‌21 అల్ట్రా ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌ను తీసుకురానుంది. ఫిబ్రవరి నెలలో విడుదల చేసి మార్చి నెల నుంచి అమ్మకాలు ప్రారంభించాలని శాంసంగ్ భావిస్తోందట. అలానే ఎం‌, ఎఫ్ సిరీస్‌లో 5 బడ్జెట్‌ ఫోన్లను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా 7 అంగుళాల ఇంటర్నల్‌ డిస్‌ప్లే, 4 అంగుళాల ఎక్స్‌టర్నల్‌ డిస్‌ప్లేతో జెడ్‌ ఫ్లిప్‌ సిరీస్‌లో మూడు ఫోన్లను తీసుకొస్తోందని సమాచారం. గెలాక్సీ ఏ సిరీస్‌లో కూడా 5జీ ఫోన్‌ను విడుదల చేయనుందట. 


ఎల్‌జీ 

ఎల్‌జీ కూడా మూడు కొత్త మోడల్స్‌ని విడుదల చేయనుంది. వీటిలో ఒకటి రోలింగ్ డిస్‌ప్లే కాగా మిగిలిన రెండు ఫ్లాగ్‌షిప్‌, బడ్జెట్‌ మోడల్స్‌ అని తెలుస్తోంది. ఎల్‌జీ రెయిన్‌బో ఫ్లాగ్‌షిప్‌ మోడల్‌ని మార్చి నెలలో విడుదల చేయనున్నారట. రోలింగ్ ఫోన్ డిస్‌ప్లే 6.8 అంగుళాల నుంచి 7.4-అంగుళాల వరకు జరుపుకోవచ్చు. ఇక ఎల్‌జీ క్యూ83 బడ్జెట్‌ మోడల్‌. దీన్ని కూడా 2021 మొదటి త్రైమాసికంలో విడుదల చేస్తారని తెలుస్తోంది. 


అల్ఫాబెట్‌ (గూగుల్‌)

గూగుల్ మాతృ సంస్థ అల్పాబెట్‌ కూడా ఈ ఏడాది ఫోల్డింగ్ మోడల్‌తో పాటు మరో రెండు కొత్త ఫోన్లను తీసుకురానుంది. వీటిలో పిక్సెల్ ఫోల్డింగ్‌ ఫోన్‌, పిక్సెల్‌ 6 మోడల్‌ని 2021 చివరి త్రైమాసికంలో, పిక్సెల్ 5ఏ మోడల్‌ని రెండో త్రైమాసికంలో విడుదల చేయనున్నారట. 


రియల్‌మీ ఎక్స్‌7 సిరీస్‌

రియల్‌మీ జనవరి 26న ఎక్స్‌7, ఎక్స్‌7 ప్రో పేరుతో రెండు కొత్త మోడల్స్‌ని విడుదల చేయనుంది. 5జీ సపోర్ట్‌తో రానున్న ఈ ఫోన్లలో ఆక్టాకోర్ డైమెన్సిటీ 1000+ (ఎక్స్‌7 ప్రో), ఆక్టాకోర్ డైమెన్సిటీ 800యూ(ఎక్స్‌7) ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్‌ 10 ఆధారిత రియల్‌మీ యూఐ ఓఎస్‌తో ఈ ఫోన్లు పనిచేస్తాయి. 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారట. ఫుల్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుందని సమాచారం. 8జీబీ/ 128జీబీ, 8జీబీ/ 256జీబీ వేరియంట్లో ఈ పోన్లు లభిస్తాయి.     


ఒప్పో రోలింగ్‌ ఫోన్‌ 

ఈ ఏడాది ప్రథమార్ధంలో ఒప్పో రెండు ఫోన్లు తీసుకురానుంది. వాటిలో ఒప్పో ఎక్స్‌ 2021 రోలింగ్‌ ఫోన్‌. రెండోది రెనో5 ప్రో+ 5జీ ఫోన్‌. ఎక్స్‌ 2021 ఫోన్‌ డిస్‌ప్లే 6.7 అంగుళాల నుంచి 7.4 అంగుళాల రోల్‌ చెయ్యొచ్చు. గతేడాది నవంబరులో ఒప్పో ఈ ఫోన్‌ టీజర్‌ విడుదల చేసింది. ఇక రెనో5 ప్రో+ 5జీ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌తో పాటు సూపర్ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారట.


వివో ఎక్స్‌60 సిరీస్‌ 

వివో ఎక్స్‌60, ఎక్స్‌60ప్రో పేరుతో రెండు కొత్త మోడల్స్‌ను తీసుకొస్తోంది. వీటిలో శాంసంగ్ ఎగ్జినోస్‌ 1080 ప్రాసెసర్‌ను ఉపయోగించారట. ఈ3 అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారని సమాచారం. ఆండ్రాయిడ్‌ 11 ఆరిజెన్‌ ఓఎస్‌ 1.0 ఓఎస్‌తో ఈ ఫోన్లు పనిచేస్తాయట. 4,300ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 8జీబీ/128జీబీ, 8జీబీ/256 జీబీ, 12జీబీ/256జీబీ వేరియంట్లో ఈ ఫోన్లను విడుదల చేయనున్నారు.


నోకియా

నోకియా 9.3 ప్యూర్‌వ్యూ మోడల్‌ను ఈ ఏడాది ప్రథమార్ధంలో విడుదల చేయనుంది. గతేడాదే ఈ ఫోన్‌ను విడుదల చేయాల్సినప్పటికీ పలు కారణాలతో వాయిదా వేశారు. ఇందులో క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్ 875 ప్రాసెసర్‌ ఉపయోగించారట. 108 ఎంపీ ప్రైమరీ కెమెరా ఇస్తున్నారట. ఇవే కాకుండా భారతీయ మొబైల్‌ తయారీ కంపెనీ లావా కూడా కొత్త ఫోన్లను విడుదల చేయనుందట. అయితే విడుదల తేదీ... ఎన్ని మోడల్స్‌.. వాటిలో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయనే దానిపై మాత్రం పూర్తి సమాచారం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని