Updated : 06/10/2021 01:52 IST

రాతల రాయుళ్లు మీరే..

మాట మాదిరిగానే రాత కూడా ఆకర్షిస్తుంది. మనమేంటో, మన గుణాలేంటో చెప్పకనే చెబుతుంది. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నా, బాస్‌కు ప్రత్యుత్తరం ఇచ్చినా, బ్లాగ్‌లో అనుభవాలు పంచుకున్నా, నవల రాసినా, కథలల్లినా ‘రాత చాతుర్యం’ లేకపోతే తేలిపోతాం. అక్షర దోషాలు, అసమంజస వాక్యాలు, అసంబద్ధ వర్ణనలు మనపై చులకన భావం ఏర్పడేలా చేస్తాయి. ప్రస్తుతం ఎక్కువగా ఆంగ్లంలోనే రాత వ్యవహారాలు నెరపుతున్నారు. మరి పరాయి భాషలో పొరపాట్లు దొర్లకుండా ఉండాలంటే?  అదృష్టం కొద్దీ ఇప్పుడు తప్పులు సరిదిద్దే, సముచిత పదాలను సూచించే, మంచి వాక్య నిర్మాణానికి తోడ్పడే ఉచిత యాప్‌లు, వెబ్‌సైట్లు, టూల్స్‌ చాలానే అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఇవీ..


జింజర్‌తో మంచి వ్యాకరణం

ప్రతి వాక్యానికీ తడబడుతున్నారా? అయితే జింజర్‌ టూల్‌ను వాడి చూడండి. కృత్రిమ మేధతో కూడిన ఇది గ్రామర్‌ను, స్పెల్లింగ్‌ను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంది. ఆకర్షణీయమైన పదబంధాలను, సముచిత నానార్థాలను సూచిస్తుంది. రాత నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. వెబ్‌ బ్రౌజర్‌ ఎక్స్‌టెన్షన్‌, మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ యాడ్‌-ఇన్‌గా ఇది అందుబాటులో ఉంది. డెస్క్‌టాప్‌తో పాటు మొబైళ్లకూ ఉపయోగపడేలా దీన్ని రూపొందించారు. ఉచిత వర్షన్‌ పరిమిత సవరణలు, సూచనలే అందిస్తుంది. అయినా ఒక మాదిరిగా వాడేవారికిదే సరిపోతుంది. కావాలనుకుంటే పెయిడ్‌ వర్షన్‌ కొనుక్కోవచ్చు. వ్యాకరణ దోషాలను సవరించుకోవటానికి ‘గ్రామర్లీ’ టూల్‌ కూడా బాగా ఉపయోగపడుతుంది.


స్లిక్‌ రైట్‌తో విశ్లేషణ

మనం రాసిన దాన్ని నిజంగా విశ్లేషించుకోవాలనుకుంటే స్లిక్‌ రైట్‌ను ఉపయోగించుకోవచ్చు. వ్యాకరణాన్ని చెక్‌ చేయటంతో పాటు ఫీడ్‌బ్యాక్‌నూ అందిస్తుంది. కర్మణ్యర్థకాలు, విశేషణాలు, పదాల వైవిధ్యం, వాక్యాల రకాలు, రీడబిలిటీ వారీగా డాక్యుమెంటును విశ్లేషించి చూపుతుంది. మన రాతలో ఇంత వైవిధ్యం ఉందా అని అనిపించేలా చేస్తుంది. స్లిక్‌ రైట్‌లో ఇన్‌బిల్ట్‌గా ఉండే వర్డ్‌ అసోసియేటర్‌ ఫీచర్‌ అయితే మనలోని రచయితను వెలికి తీస్తుంది. బ్లాగ్‌ రాసేవారైనా, రచయితలైనా, విద్యార్థులైనా.. అందరి రాతలనూ ఉన్నత స్థాయికి చేరుస్తుంది. ఆకట్టుకునే సెటింగ్స్‌ మెనూతో రాసిన దాన్ని ఆకర్షణీయంగా సర్దుకోవచ్చు కూడా. ఇతర ప్రోగ్రామ్‌లలో రాసిన డాక్యుమెంట్లను కూడా ఇందులో కలిపేసుకోవచ్చు.


హెమింగ్వే ఎడిటర్‌తో స్పష్టత

‘రీడబిలిటీ స్కోర్‌’ను బట్టి రాతను మెరుగు పరచే యాప్‌ ఇది. చదవటానికి టెక్స్ట్‌ ఎంత కష్టంగా ఉందో ఇది చూపిస్తుంది. వాక్యాలను చెక్‌ చేయటం, పదాలను లెక్కించటం వంటి ఫీచర్లూ ఉంటాయి. కర్మణ్యర్థకాలు, అతిగా వాడిన పదాలు, సంక్లిష్ట పదబంధాల వంటి వాటిని ఆయా రంగుల్లో కొట్టొచ్చినట్టు కనిపించేలానూ చేస్తుంది. వాటి స్థానంలో ఉపయోగపడే పదాలను సూచిస్తుంది. మంచి రాతకు అవసరమైన చిట్కాలనూ అందిస్తుంది. మొత్తం రాసిన తర్వాత టూల్‌బార్‌తో టెక్స్ట్‌ను ఫార్మాట్‌ చేసుకోవచ్చు కూడా.


ఉచిత ఐడియాలకు రైట్‌సోనిక్‌

ఇది కృత్రిమ మేధతో కూడిన రాత టూల్‌. మంచి మార్కెటింగ్‌ ప్రతిని సులభంగా రాయాలనుకునేవారికిది బాగా ఉపయోగపడుతుంది. అవసరమైన విభాగాలను ఎంచుకుంటే రకరకాల రూపాల్లో మన తరఫున ఇదే రాసి పెడుతుంది. కాకపోతే డబ్బులు చెల్లిస్తేనే వీటిని వాడుకోగలం. అలాగని ఇందులో ఉచిత ఫీచర్లు లేకపోలేదు. బ్లాగ్‌ రచనలు, పేజీ హెడ్‌లైన్స్‌, యూట్యూబ్‌ టైటిళ్లు, ఉత్పత్తుల పేర్లు.. ఇలాంటి వాటికి ఐడియాలను సృష్టించుకోవటానికి వీలుంది.


సరికొత్త నవలలకు రీడ్సీ

నిజానికిది రచయితలను, ఎడిటర్లను కలిపే ఫ్రీలాన్స్‌ మార్కెట్‌ కేంద్రం. కానీ ఇందులోని బుక్‌ రైటింగ్‌ టూల్‌ రచయితలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సరళమైన ఇంటర్‌ఫేస్‌తో ఇతరుల సహకారంతో ఎడిట్‌ చేసుకోవటానికిది వీలు కల్పిస్తుంది. రాయటం పూర్తయ్యాక పీడీఎఫ్‌, ఈపీయూబీ వంటి ఇ-బుక్‌ ఫార్మాట్‌లలోకీ మార్చుకోవచ్చు. రచనను అధ్యాయాల వారీగా విభజించుకోవచ్చు. కావాలనుకుంటే వీటిని డ్రాగ్‌ చేసి ఎక్కడైనా జోడించుకోవచ్చు. ఒక వరుస క్రమంలో రాయలేని రచయితలకిది మేలే కదా.


మెదడు పదునుకు డేంజరస్‌ యాప్‌

మెదడును మరింత చురుకుగా పనిచేయించాలని అనుకుంటున్నారా? అయితే మోస్ట్‌ డేంజరస్‌ రైటింగ్‌ యాప్‌ను వాడి చూడండి. స్క్విబ్లర్‌ రైటింగ్‌ వేదిక అందిస్తున్న ఉచిత వెబ్‌ సర్వీసు ఇది. ఏది రాస్తున్నా ముందుగా నిర్ణీత సమయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. రాస్తూనే ఉండాలి. మధ్యలో కొన్ని సెకండ్లు ఆగినా రాసిందంతా పోతుంది. మళ్లీ కనిపించదు. ఇది వినోదాత్మకంగా అనిపించొచ్చు గానీ మెదడు చురుకుగా ఆలోచించటానికి, వేళ్లు గబగబా కదలటానికిది ప్రేరణగా నిలుస్తుందనేది మాత్రం నిజం.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని