పరిణామం అనంతం

ఇటీవల మానవజాతికో కొత్త బంధువు దొరికాడు. ఇప్పటివరకూ నియాండర్తాల్స్‌నే మన సమీప మానవులని భావిస్తున్న మనకు చైనాలో మరో ఆదిమ మానవుడి ఆచూకీ లభించటం పరిణామ  చరిత్రను తిరగరాసేలా చేస్తోంది. మానవ పరిణామ ప్రక్రియపై మనకున్న అవగాహనను మార్చుకోవాల్సిన పరిస్థితి కల్పించింది.

Updated : 07 Jul 2021 05:17 IST

ఇటీవల మానవజాతికో కొత్త బంధువు దొరికాడు. ఇప్పటివరకూ నియాండర్తాల్స్‌నే మన సమీప మానవులని భావిస్తున్న మనకు చైనాలో మరో ఆదిమ మానవుడి ఆచూకీ లభించటం పరిణామ చరిత్రను తిరగరాసేలా చేస్తోంది. మానవ పరిణామ ప్రక్రియపై మనకున్న అవగాహనను మార్చుకోవాల్సిన పరిస్థితి కల్పించింది. అనాదియైన, అనంతమైన మానవ పరిణామ క్రమం దిశగా మరోసారి దృష్టి సారించేలా చేసింది.

అప్పుడెప్పుడో 90 ఏళ్ల కిత్రం తూర్పు చైనాలోని హర్బిన్‌ పట్టణం సమీపంలో దొరికిన ఒక భారీ పుర్రె ఇప్పుడు మానవ పరిణామ చరిత్రనే తిరగరాస్తోంది. అది మామూలు పుర్రె కాదు. సుమారు 14.6 లక్షల ఏళ్ల క్రితం మరణించిన ఆదిమ మానవుడిది. నియాండర్తాల్స్‌ తర్వాత ఆవిర్భవించిన మానవజాతికి చెందిందని, మరణించే నాటికి అతడి వయసు 50 ఏళ్లని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ కొత్త జాతికి హోమో లోంగి అని పేరు పెట్టారు. ఇతడిని డ్రాగన్‌ మ్యాన్‌ అనీ పిలుచుకుంటున్నారు. ఆధునిక మానవజాతి అయిన హోమో సేపియన్స్‌ మాదిరిగానే హోమో లోంగి జాతి కూడా పక్షులను, జంతువులను వేటాడేదని.. పండ్లు, కూరగాయలను సేకరించేదని.. చేపలనూ పట్టుకొని ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. హోమో లోంగి కాలంలో హోమో సేపియన్స్‌ తూర్పు ఆసియాకు వచ్చినట్టయితే ఈ రెండు జాతుల మధ్య సంకరం జరిగి ఉండొచ్చన్నది శాస్త్రవేత్తల భావన. అయితే ఇదింకా స్పష్టం కాలేదు. పురాతత్వ వస్తువులేవీ లేకపోవటం వల్ల సంస్కృతి, పరిజ్ఞానం స్థాయుల గురించి ఎన్నో ప్రశ్నలు అలాగే మిగిలి ఉన్నాయి. తూర్పు ఆసియాలో ఇది మూడో మానవజాతి కావటం ఈ ప్రాంతం ప్రాముఖ్యతను చాటుతోంది. ఇదే కాదు.. ఇటీవల ఇజ్రాయెల్‌లోనూ పురాతన మానవుల ఎముకలను శాస్త్రవేత్తలు గుర్తించారు. రమ్లా ప్రాంతలో తవ్వకాలు జరుపుతుండగా ఈ శిలాజాలు బయటపడ్డాయి. ఈ కొత్త మానవజాతికి శాస్త్రవేత్తలు ‘నెషర్‌ రమ్లా హోమో టైప్‌’ అని పేరు పెట్టారు. లక్షలాది ఏళ్లుగా పరిణామం చెందుతూ వస్తున్న మన ప్రస్థాన రహస్యాలు ఇంకా మిగిలే ఉన్నాయని ఈ ఉదంతాలు చెప్పకనే చెబుతున్నాయి. మానవ పరిణామం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మున్ముందు మనషి స్వరూప, స్వభావాలెలా ఉంటాయో తెలియదు గానీ మన పరిణామ క్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ వచ్చింది.

సుదీర్ఘ ప్రక్రియ

పరిణామం ఉన్నట్టుండి జరిగేది కాదు. ఓ సుదీర్ఘ ప్రక్రియ. మానవుల వంటి సంక్లిష్ట జీవుల విషయంలో ఇందుకు ఇంకాస్త ఎక్కువ సమయమే పడుతుంది. కొత్త కొత్త శారీరక స్వభావాలు, ప్రవర్తనలను సంతరించుకుంటూ మానవజాతి క్రమంగా పరిణామం చెందుతూ వస్తోంది. తోకలేని కోతుల (ఏప్స్‌) నుంచి మొదలైన పరిణామం సుదీర్ఘంగా కొనసాగుతోంది. సుమారు 60 లక్షల ఏళ్లుగా శారీరక మార్పులు, ప్రవర్తనల వంటివన్నీ రూపుదిద్దుకుంటూ వస్తున్నాయని శాస్త్రీయ ఆధారాలు చెబుతున్నాయి. మొదట్లో అబ్బిన గుణాల్లో ముఖ్యమైంది రెండు కాళ్ల మీద నడవటం. జంతువుల నుంచి మనుషులను వేరు చేసిన తొలి మార్పు ఇదే. సుమారు 40 లక్షల సంవత్సరాల క్రితం ఇది ఆరంభమైంది. ఇతర ముఖ్య పరిణామాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి సంక్లిష్టమైన, పెద్ద మెదడు.. పరికరాలు తయారుచేసుకునే నైపుణ్యం.. భాషా సామర్థ్యం. మానవుడి ఆధిపత్యానికి బీజం వేసినవి ఇవే. సంకేతాలతో కూడిన వ్యక్తీకరణ, కళలు, విస్తృతమైన సాంస్కృతిక వైవిధ్యం వంటివన్నీ తదనంతర గుణాలని చెప్పుకోవచ్చు.

వానరుల నుంచి..

మానవులు వానరులు. అలాగని మనిషి ప్రస్తుతం జీవిస్తున్న  కోతులు, వానరుల నుంచి పుట్టుకొచ్చాడని అనుకుంటున్నారేమో. అది నిజం కాదు. కాకపోతే కోతులు, వానరాలు, మనుషుల పూర్వికులు ఒకరే. ఇప్పటివరకూ ఆధునిక మానజాతిగా భావిస్తున్న హోమో సేపియన్స్‌ శారీరక, జన్యు పోలికలన్నీ ఏప్స్‌తో దాదాపుగా పోలి ఉంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. సుమారు 80 లక్షల నుంచి 60 లక్షల ఏళ్ల కిందట నివసించిన ఒకే పూర్వికుల నుంచే ఆఫ్రికాలోని చింపాజీలు, బోనబోస్‌ వంటి తోకలేని పెద్ద కోతులు.. గొరిల్లాలతో పాటు మనుషులు పుట్టుకొచ్చారు. మానవ తొలి పరిణామం ఆఫ్రికాలోనే  మొదలైంది. మన పరిణామక్రమం మొత్తం దాదాపు అక్కడే కొనసాగింది. దాదాపు 60 లక్షల నుంచి 20 లక్షల ఏళ్ల కిందట నివసించిన తొలి మానవుల శిలాజాలన్నీ అక్కడే లభించటం దీనికి నిదర్శనం.

ఆఫ్రికా నుంచి ఆసియాకు

తొలి మానవులకు సంబందించిన ఎన్నో జాతులను శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిల్లో చాలావరకు పూర్తిగా అంతరించిపోయాయి. ఈ జాతుల పుట్టుకకు, అంతరించటానికి ఎలాంటి అంశాలు దోహదం చేశాయనేదానిపై తర్జనభర్జనలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఆదిమ మానవులు 20 లక్షల నుంచి 18 లక్షల ఏళ్ల కిందట మొదటిసారిగా ఆఫ్రికా నుంచి ఆసియాకు వలస వచ్చారు. అనంతరం 15 లక్షల నుంచి 10 లక్షల ఏళ్ల కిందట ఐరోపాకు చేరుకున్నారు. అనంతరం చాలాకాలం తర్వాతే ఆధునిక మానవజాతులు మిగతా భాగాలకు విస్తరించాయి. ఉదాహరణకు- ఆస్ట్రేలియాకు 60 వేల ఏళ్ల క్రితం, అమెరికాకు 30 వేల ఏళ్ల క్రితం వచ్చి ఉండొచ్చని అంచనా. వ్యవసాయం, తొలి నాగరికతల వంటివన్నీ గత 12వేల ఏళ్ల కాలంలోనే ఆరంభమయ్యాయి.

ఎన్నెన్నో కీలక ఘట్టాలు

సుమారు 15-21 మానవ జాతులు ఉండొచ్చన్నది శాస్త్రవేత్తల భావన. వీటిల్లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనుగడలో ఉన్నది ఒక్క మనమే. ఎన్నెన్నో కీలక ఘట్టాలను దాటుకొని మనం  ఈ దశకు చేరుకున్నాం. 

80-60 లక్షల ఏళ్ల క్రితం 

తొలి గొరిల్లాల ఆవిర్భావం. అనంతరం చింపాజీలు, మానవజాతులు విడిపోవటం. 

58 లక్షల ఏళ్ల క్రితం 

అతి పురాతన ఆదిమ మానవుడు (ఒరోరిన్‌ టుజెనెసిస్‌) రెండు కాళ్ల మీద నడిచాడని భావిస్తుంటారు. 

40 లక్షల ఏళ్ల క్రితం 

ఆస్ట్రలోపితెసిన్ల పుట్టుక. చింపాంజీలంత మెదడే ఉన్నప్పటికీ రెండు కాళ్ల మీద నిటారుగా నడిచారు. 

25 లక్షల ఏళ్ల క్రితం 

రాతి పరికరాల వాడకం ఆరంభం. ఈ పరికరాల తయారీ 10 లక్షల ఏళ్ల వరకు కొనసాగింది. కొందరు హోమినిడ్స్‌ మాంసాహారం తినటం అలవరచుకోవటం మెదడు పెద్దగా ఎదగటానికి దోహదం చేసింది. 

16  లక్షల ఏళ్ల క్రితం 

మంటను వాడుకోవటం ఆరంభమైంది. మరింత సంక్లిష్టమైన రాతి పరికరాలను తయారుచేయటం మొదలైంది. 

6 లక్షల ఏళ్ల క్రితం 

మెదడు సామర్థ్యం పెరగటం మొదలైంది. ఆధునిక మానవుల స్థాయికి మెదడు సామర్థ్యం చేరుకుంది. 

5 లక్షల ఏళ్ల క్రితం 

ఆవాసాలు, చెక్క గుడిసెలు నిర్మించుకోవటం ఆరంభించారు. 

4 లక్షల ఏళ్ల క్రితం 

బల్లాలతో వేట మొదలెట్టారు. 

1.95 లక్షల ఏళ్ల క్రితం 

మన సొంత మానవజాతి హోమో సేపియన్స్‌ రంగంలోకి వచ్చారు. ఆ వెంటనే ఆసియా, ఐరోపా అంతటికీ వలస వెళ్లారు. అప్పటి సగటు మనిషి మెదడు పరిమాణం 1350 సెంమీ 

1.7 లక్షల ఏళ్ల క్రితం 

ప్రస్తుతం జీవిస్తున్న మానవులందరి మూల జనని ‘మైటోకాండ్రియల్‌ ఈవ్‌’ ఆవిర్భావం. ఆమె ఆఫ్రికాలో నివసించి ఉండొచ్చు. 

1.5 లక్షల ఏళ్ల క్రితం 

మనిషి మాట్లాడే సామర్థ్యం సంతరించుకున్నాడు. 

50 వేల ఏళ్ల కిత్రం 

చనిపోయిన వారిని పూడ్చిపెట్టటం, జంతువుల చర్మం నుంచి దుస్తులు తయారుచేయటం వంటివన్నీ ఆరంభమయ్యాయి. ఆస్ట్రేలియాలో ఆధునిక మానవులు ఆవాసాలు ఏర్పరచుకున్నారు. 

33 వేల ఏళ్ల కిత్రం 

ఆసియాలో హోమో ఎరక్టస్‌లు మరణించారు. వీరి స్థానాన్ని ఆధునిక మానవులు ఆక్రమించారు. 

10వేల ఏళ్ల క్రితం 

వ్యవసాయం అభివృద్ధి చెందింది. విస్తరించింది. తొలి గ్రామాల పుట్టుక. 

5.5 వేల ఏళ్ల క్రితం 

రాతియుగం ముగిసి రాగియుగం మొదలైంది. 

5 వేల ఏళ్ల క్రితం 

తొలి రాత ఆనవాళ్లు. 

4,000-3,500 క్రీ.పూ. 

మెసొపొటామియాలో సుమేరియన్లు ప్రపంచపు మొట్టమొదటి నాగరికతను అభివృద్ధి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని