యాప్‌ తోడుగా... మారిపోండి ఫిట్‌గా

జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పుల కారణంగా ఎక్కువ మంది చిన్న వయసులోనే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో తినే తిండి నుంచి చేసే పని వరకు ప్రతిదీ లెక్కలు వేసుకుని మరీ చేస్తున్నారు. కొవిడ్‌-19 నేపథ్యంలో ఈ జాగ్రత్తలు మరింత పెరిగాయి....

Updated : 22 Aug 2022 15:53 IST

ఇంటర్నెట్ ‌డెస్క్‌: ఫిట్‌గా ఉండటం అంటే ఎవరికి నచ్చదు. ఈ విషయంలో అశ్రద్ధ చేసేవారు కూడా కొవిడ్‌-19 నేపథ్యంలో ఫిట్‌గా ఉండేందుకు కసరత్తు బాటపట్టారు. ఇంట్లోనే కసరత్తులు చేసేందుకు ఉపయోగపడే ఫిట్‌నెస్‌ యాప్‌లపై దృష్టి సారిస్తున్నారు. ఫిట్‌నెస్‌ యాప్‌లు ఎప్పటికప్పుడు యూజర్‌ ఫిట్‌నెస్‌ను మానిటర్‌ చేస్తూ అవసరమైన సూచనలు చేస్తుంటాయి. అంతేకాకుండా మీరు ఎంత బరువు ఉండాలి, ఎన్ని కేలరీలు ఖర్చు చేయాలి అంటూ పర్సనల్ ట్రైనర్‌లా చెబుతాయి. అలాంటి కొన్ని యాప్‌ల వివరాలు మీ కోసం..


గూగుల్ ఫిట్ (Google Fit)

వర్కవుట్స్‌ని మానిటర్‌ చేస్తూ టార్గెట్ రీచ్‌ అయ్యేందుకు ఇంకా ఎంత దూరంలో ఉన్నామనేది గూగుల్‌ ఫిట్‌లో చూపిస్తుంది. మనిషి బరువు, ఎత్తుతో పాటు, ఎప్పుడు నడవాలనుకుంటున్నారు వంటి వివరాలు యాప్‌లో ఎంటర్ చేస్తే మీ అడుగుల్ని ట్రాక్ చేసి వివరాలను అందిస్తుంది. అలానే మీరు చేసే యాక్టివిటీ ఆధారంగా హార్ట్‌ పాయింట్స్‌ను ఇస్తుంది. మీరు పొందిన పాయింట్ల ఆధారంగా యాక్టివిటీ గోల్స్‌ను సెట్ చేస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌తో కలసి రూపొందించిన ఆరోగ్యపరమైన విశేషాలను అందిస్తుంది.


ఎంఐ ఫిట్ (Mi Fit)

షావోమి ఫిట్‌నెస్‌ బ్యాండ్‌లకు అనుసంధానంగా షావోమి ఫిట్‌ యాప్‌ పని చేస్తుంది. ఇందులో యాక్టివిటీ మానిటర్‌, స్లీప్‌ ఎనాలసిస్‌ లాంటి ఫీచర్స్‌ ఉన్నాయి. వాటితో వర్కవుట్స్‌ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగిన సూచనలు చేస్తుంది. యాప్‌లోని వీడియో ట్యుటోరియల్స్ మీరు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. 


శాంసంగ్‌ హెల్త్‌ (Sasmsung Health)

బిల్ట్‌ ఇన్ ట్రాకర్స్‌తో రోజువారీ ఫిట్‌నెస్‌ యాక్టివిటీని రికార్డ్ చేసి ఆరోగ్యంగా ఉండేందుకు శాంసంగ్‌ హెల్త్‌ యాప్ సూచనలు చేస్తుంది. ఫిట్‌గా ఉండేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలి వంటి వాటిని సూచిస్తుంది. అలానే హెల్త్‌ ప్రొఫెషనల్స్‌ నుంచి ఫిట్‌గా ఉండేందుకు సలహాలు యాప్‌లో పొందొచ్చు.


హెల్తీఫై మి (HealthifyMe)

రోజూ తీసుకునే ఆహార వివరాలు ఎంటర్‌ చేస్తే వాటితో ఎన్ని క్యాలరీలు వచ్చాయనేది హెల్తీఫై మీ యాప్‌ చెప్పేస్తుంది. వ్యాయామం, ఆడే ఆటలు వల్ల ఎన్ని క్యాలరీలు ఖర్చయ్యాయనేదీ తెలుసుకోవచ్చు. ఆహార వివరాల ఆధారంగా మీ ఫిట్‌నెస్‌ గోల్స్‌ను సూచిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి ప్రత్యేకమైన డైట్, వర్కవుట్ ప్లాన్స్‌తో యాప్‌ ఫిట్‌నెస్‌ కోచ్‌లా పని చేస్తుంది. ఇందులో 50 రకాల వర్కవుట్ మోడ్స్‌ ఉంటాయి.


మైఫిట్‌నెస్‌పాల్ (MyFitnesspal)

బరువు తగ్గాలన్నా, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలన్నా తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మైఫిట్‌నెస్‌పాల్ యాప్‌‌లో అనేక ఫుడ్‌ వెరైటీల వివరాలు ఉంటాయి. ఇవన్నీ పోషకాహార నిపుణులు‌ సూచించనవే. వాటిని ఎలా తయారు చేసుకోవాలి, ఏవేవి ఎప్పుడు తినాలి వంటి వివరాలు యాప్‌లో ఉంటాయి. అంతేకాకుండా బరువు తగ్గడానికి, పెరగడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇందులో వివరంగా ఉంటుంది. వివిధ రకాల వర్కవుట్ వీడియోలనూ చూడొచ్చు. నిపుణుల సలహాలు తీసుకోవచ్చు, యాక్టివిటీ వివరాలను స్నేహితులకు షేర్ చేయొచ్చు.


హోం వర్కవుట్ (Home Workout)

ఎలాంటి పరికరాల అవసరం లేకుండా వర్కవుట్స్‌తో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలనుకునే వారికి హోం వర్కవుట్‌ యాప్‌ ఎంతో ఉపయోగపడుతుంది. వారంలో మీరు ఎలాంటి వర్కవుట్స్‌ చేయాలనేది ముందుగా సూచిస్తుంది. ఒకవేళ ఆ వారంలో మీరు గోల్స్‌ను అందుకోలేకపోతే దానికి అనుగుణంగా తర్వాతి వారం వర్కవుట్ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. యాప్‌లో యానిమేషన్స్‌, వీడియోల ద్వారా వర్కవుట్స్‌ ఎలా చేయాలో సూచిస్తుంది.


నైక్‌ ట్రైనింగ్ క్లబ్ (Nike Training Club)

ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ పర్యవేక్షణలో ఇంట్లోనే వర్కవుట్స్‌ చేయాలనుకునే వారు నైక్‌ ట్రైనింగ్‌ క్లబ్‌ యాప్‌ ఉపయోగించవచ్చు. ఇందులో ప్రొఫెషనల్‌ ట్రైనర్స్‌, అథ్లెట్స్‌ రూపొందించిన వీడియోలు ఉంటాయి. కార్డియో, స్ట్రెంగ్త్‌, హిట్, యోగా తదితర కేటగిరీల వర్కవుట్స్‌‌ జాబితా ఉంటుంది. ఫిట్‌నెస్‌లో భాగంగా ఆహారపు అలవాట్లలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో యాప్‌ సూచిస్తుంది.


డైలీ వర్కవుట్స్‌ (Daily Workouts)

వర్కవుట్స్ కోసం ఎక్కువ సమయం కేటాయించలేని వారు ఈ యాప్‌తో తమ పిట్‌నెస్ గోల్స్‌ సులభంగా పూర్తి చేయొచ్చు. ఐదు నుంచి పది నిమిషాల్లో పూర్తి చేసేలా పది రకాల వర్కవుట్స్‌ను యాప్‌ సూచిస్తుంది. 10 నుంచి 30 నిమిషాల్లో ఫుల్ బాడీ వర్కవుట్స్‌ ఉంటాయి. పురుషులు, మహిళలకు ఫిట్‌నెస్‌కు సంబంధించి వందకు పైగా ఎక్సర్‌సైజ్‌ల జాబితా ఇందులో ఉంది. అలానే యానిమేటేడ్ వీడియోల ద్వారా వర్కవుట్స్‌ ఎలా చేయాలో చూపిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని