మోదీ సందేశంతో నిద్ర లేచా: గేల్‌... మేమూ గణతంత్రం జరుపుకుంటున్నాం: జాంటీ రోడ్స్‌

భారత ప్రధాని నరేంద్ర మోదీ సందేశంతో.. ఈ రోజు నిద్ర లేచానని వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు క్రిస్‌ గేల్‌ పేర్కొన్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్బంగా భారత ప్రజలకు అతడు శుభాకాంక్షలు...

Updated : 25 Jan 2024 12:14 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : భారత ప్రధాని నరేంద్ర మోదీ సందేశంతో.. ఈ రోజు నిద్ర లేచినట్లు వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు క్రిస్‌ గేల్‌ పేర్కొన్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు అతడు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ మేరకు గేల్‌ ఓ ట్వీట్ చేశాడు. ‘‘భారతదేశ ప్రజలకు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారత ప్రజలతో నాకున్న సన్నిహిత సంబంధాలను గుర్తు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ పంపిన సందేశంతో ఈ రోజు నిద్ర లేచాను’’ అని క్రిస్ గేల్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జాంటీ రోడ్స్‌కి కూడా ప్రధాని నరేంద్ర మోదీ సందేశం పంపారు. అందులో భారతదేశ గణతంత్ర దినోత్సవ ఔచిత్యాన్ని వివరించారు. ప్రధాని పంపిన లేఖను జాంటీ రోడ్స్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నాడు. 

‘‘విదేశీయుల పాలన నుంచి స్వాతంత్ర్యం పొంది భారతీయులు 75 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న తరుణంలో.. ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఎంతో ప్రత్యేకం. ఈ నేపథ్యంలో భారత ప్రజలతో సన్నిహిత సంబంధాలున్న మరికొంత మంది స్నేహితులకు కూడా నేను లేఖ రాస్తున్నాను. భవిష్యత్తులోనూ ఇలాగే సత్సంబంధాలు కొనసాగించాలని ఆశిస్తున్నాను. మీ కుమార్తెకి ‘ఇండియా జెన్నీ రోడ్స్‌’ అని పేరు పెట్టుకున్నారంటే.. మీకు భారత్‌పై ఉన్న అభిమానమెంతో అర్థమవుతోంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగేందుకు మీరే ప్రత్యేక రాయబారిగా ఉంటారని ఆశిస్తున్నాను’’ అని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ.. జాంటీ రోడ్స్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘మీ అభిమానానికి ధన్యవాదాలు నరేంద్ర మోదీ. భారత పర్యటనలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. వ్యక్తిగా ఎంతో ఎదిగాను. భారత ప్రజల హక్కులను కాపాడే రాజ్యాంగం ప్రాముఖ్యతను గౌరవిస్తూ.. మా కుటుంబ సభ్యులమంతా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. జైహింద్‌’ అని జాంటీ రోడ్స్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

టీమ్ఇండియా మాజీలు సహా ప్రస్తుత క్రికెటర్లు భారతీయులందరికీ ట్విటర్‌ వేదికగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. విరాట్ కోహ్లీ, వీవీఎస్‌ లక్ష్మణ్, హర్భజన్‌ సింగ్‌, సచిన్‌ తెందూల్కర్, గౌతమ్ గంభీర్‌, రవీంద్ర జడేజా తదితరులు విషెస్‌ వెల్లడించారు.  









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని