Rohit Sharma : నా దృష్టిలో రోహితే అత్యుత్తమ ఆటగాడు: హర్భజన్‌ సింగ్‌

టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మే తన దృష్టిలో అత్యుత్తమ ఆటగాడని మాజీ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్‌ చెప్పాడు. అలాగే, బుమ్రా తన ఫేవరెట్‌ బౌలర్‌ అని పేర్కొన్నాడు...

Published : 28 Jan 2022 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మే తన దృష్టిలో అత్యుత్తమ ఆటగాడని మాజీ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్‌ చెప్పాడు. అలాగే, బుమ్రా తన ఫేవరెట్‌ బౌలర్‌ అని పేర్కొన్నాడు. ‘‘నా ఫేవరెట్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ. టీ20, వన్డే, టెస్టు.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా గొప్పగా రాణించగలడు. అతడు బ్యాటింగ్‌ చేస్తున్నప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా చాలా కాలం ఆడుతాడు. భారత బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేయగలడనే నమ్మకం ఉంది. బహుశా ప్రపంచంలోనే రోహిత్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అనుకుంటున్నాను. అలా అని విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌ వంటి ఆటగాళ్లను తక్కువగా అంచనా వేయడం లేదు. వాళ్లిద్దరు కూడా మెరుగ్గానే రాణిస్తున్నారు. కానీ, రోహిత్ తన బ్యాటింగ్‌తో ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాడు. అందుకే, అతడే నా ఫేవరెట్‌ బ్యాట్స్‌మెన్. బౌలర్ల విషయానికి వస్తే.. బుమ్రా నా ఫేవరెట్‌. అతడు ప్రపంచ స్థాయి బౌలర్‌. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా గొప్పగా బౌలింగ్‌ చేస్తున్నాడు. అందుకే వీళ్లిద్దరూ నా అభిమాన క్రికెటర్లలయ్యారు’’ అని హర్భజన్‌ పేర్కొన్నాడు.

రోహిత్‌ వద్దంటే.. బుమ్రాకు ఓ అవకాశం ఇవ్వాలి..

టెస్టు కెప్టెన్సీ విషయంలో కూడా హర్బజన్‌ సింగ్‌.. బుమ్రాకు మద్దతుగా నిలిచాడు. ‘ప్రస్తుతం వన్డే, టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మనే టెస్టు పగ్గాలు కూడా చేపడితే బాగుంటుంది. ఒక వేళ రోహిత్‌ టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా లేకపోతే.. మరో ఆలోచన లేకుండా బుమ్రాకే ఆ బాధ్యతలు అప్పగించాలి. భారత్‌లో ఫాస్ట్‌ బౌలర్లకు సారథ్య బాధ్యతలు అప్పగించడం చాలా అరుదు. టీమ్‌ఇండియాకు తొలి ప్రపంచకప్‌ అందించిన కపిల్ దేవ్‌ కూడా బౌలరే కదా! మరో సారి బౌలర్‌కు ఆ బాధ్యతలు ఎందుకు అప్పగించకూడదు? ప్రస్తుతం భారత జట్టులోని మ్యాచ్‌ విన్నర్ల కంటే బుమ్రా మెరుగ్గా రాణిస్తున్నాడు. ఇప్పటికే ఒంటి చేత్తో ఎన్నో మ్యాచులు గెలిపించాడు’ అని హర్భజన్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని