Viral Video: క్రికెట్‌ పిచ్‌ మీదే ఆటగాళ్ల డ్యాన్స్‌

జింబాబ్వే బౌలర్‌ బ్లెస్సింగ్‌ ముజరబాని, బంగ్లాదేశ్‌ పేసర్‌ తస్కిన్‌ అహ్మద్‌ క్రికెట్‌ మైదానంలో వింత చేష్టలు చేశారు. ఇరుజట్ల మధ్య జరిగిన ఏకైక టెస్టులో బంగ్లా ఆదివారం ఆతిథ్య జట్టును 220 పరుగుల భారీ తేడాతో ఓడించింది...

Updated : 12 Jul 2021 18:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జింబాబ్వే బౌలర్‌ బ్లెస్సింగ్‌ ముజరబాని, బంగ్లాదేశ్‌ పేసర్‌ తస్కిన్‌ అహ్మద్‌ క్రికెట్‌ మైదానంలో వింత చేష్టలు చేశారు. ఇరుజట్ల మధ్య జరిగిన ఏకైక టెస్టులో బంగ్లా ఆదివారం ఆతిథ్య జట్టును 220 పరుగుల భారీ తేడాతో ఓడించింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల పేసర్లు ముజరబాని, తస్కిన్‌ అహ్మద్‌ ప్రవర్తించిన తీరు హాస్యాస్పదంగా ఉండటమే కాకుండా వింతగానూ అనిపిస్తోంది. ఐసీసీ లెవెల్‌-1 నిబంధనలు అతిక్రమించి మరీ ఒకరినొకరు కళ్లలోకి కళ్లుపెట్టి ఎంతో కోపంగా చూసుకున్నారు. మరోవైపు ఒకరి బౌలింగ్‌లో ఇంకొకరు బ్యాటింగ్‌ చేసేటప్పుడు పిచ్‌మీదే స్టెప్పులేసి ప్రేక్షకులకు నవ్వులు తెప్పించారు.

బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ముజరబాని వేసిన ఓ బంతిని తస్కిన్‌ ఆఫ్‌సైడ్‌ షాట్‌ఆడి క్రీజులోనే డ్యాన్స్‌ చేశాడు. మరోసారి అలాగే చేయడంతో చిర్రెత్తుకొచ్చిన జింబాబ్వే పేసర్‌ అతడి వద్దకెళ్లి కోపంగా కళ్లలోకి కళ్లు పెట్టి చూశాడు. అప్పుడు తస్కిన్‌ సైతం అంతే కోపంతో చూడసాగాడు. ఇక జింబాబ్వే ఇన్నింగ్స్‌లో తస్కిన్‌ బౌలింగ్‌లో ముజరబాని బ్యాటింగ్‌ చేస్తూ అలాగే చేశాడు. బంగ్లా పేసర్‌ వేసిన షాట్‌ డెలివరీని ఆడిన ముజరబానీ తర్వాత క్రీజులోనే తస్కిన్‌లాగే కాలు కదిపాడు. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ రిఫరీ ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు. మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోత విధిస్తూనే ఒక్కొక్కరికీ ఒక్కో డీమెరిట్‌ పాయింట్‌ విధించారు.

(Twitter Viral Video Screenshot)

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా 468 పరుగులకు ఆలౌటైంది. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ మహ్మదుల్లా (150), తస్కిన్‌ అహ్మద్‌ (75) బాధ్యతగా ఆడి జట్టుకు భారీ స్కోర్‌ అందించారు. అనంతరం జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 276 పరుగులకు ఆలౌటైంది. టాప్‌ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కైటానో (87), బ్రెండన్‌ టేలర్‌ (81) అర్ధశతకాలతో రాణించారు. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 284/1 స్కోర్‌ వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసింది. షద్మన్‌ ఇస్లామ్‌ (115), షాంటో (117) శతకాలతో మెరిశారు. ఈ క్రమంలోనే జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 256 పరుగులకు ఆలౌటైంది. దాంతో బంగ్లా 220 పరుగుల తేడాతో విజయం సాధించింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని