Kohli-Abd: మన బంధం విడదీయరానిది‌ బ్రదర్‌.. ‘ఐ లవ్‌ యూ’: విరాట్ కోహ్లీ

ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌ ఆటకే....

Published : 20 Nov 2021 01:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్‌ ఆటకే వీడ్కోలు చెబుతున్నట్లు ‘మిస్టర్‌ 360’ ఇవాళ ప్రకటించాడు. భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో సహ ఆటగాళ్లు. వీరిద్దరి మధ్య ఆత్మీయ అనుబంధం విడదీయరానిది. దీంతో ఏబీడీ తీసుకున్న నిర్ణయంపై కోహ్లీ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. ‘‘ఈ నిర్ణయం నా మనస్సును ఎంతో గాయపరిచింది. వ్యక్తిగత జీవితం, కుటుంబం కోసం సమయం కేటాయించేందుకు నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందేనని అనుకుంటున్నా. ఐ లవ్‌ యూ బ్రదర్‌ ఏబీడీ. మన తరంలో నువ్వు అత్యుత్తమ ఆటగాడివి. నేను కలిసిన వారిలో స్ఫూర్తివంతమైన వ్యక్తివి నువ్వే. ఆర్‌సీబీ కోసం నువ్వు చేసిన, అందించిన సహకార పట్ల ఎప్పుడూ నువ్వు గర్విస్తావని భావిస్తున్నాను బ్రదర్‌. మన అనుబంధం ఆటలోనే కాదు.. ఎల్లవేళలా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. 

2004లో దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపికైన ఏబీ డివిలియర్స్‌ దాదాపు 14 ఏళ్లపాటు జాతీయ జట్టుకు సేవలందించాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. అయితే జట్టు అవసరంరీత్యా 2019 వన్డే ప్రపంచకప్‌కు అందుబాటులో ఉండాలని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు కోరినా.. ఏబీడీ అంగీకరించలేదు. తన స్థానంలో యువకులను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అయితే మరికొంతకాలం టీ20 లీగుల్లో ఆడతానని అప్పుడే వెల్లడించాడు. ఇప్పుడు ఆటకే వీడ్కోలు పలకడంతో ఏబీడీని ఆటగాడిగా కాకుండా వేరే పాత్రలో చూసే అవకాశం ఉండొచ్చు. 2011 నుంచి గత ఐపీఎల్‌ వరకు ఏబీ డివిలియర్స్‌ ఆర్‌సీబీ జట్టుకు ఆడాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి ఎదురు దెబ్బ తగిలినట్లే. మైదానంలో నలువైపులా షాట్లు కొట్టగలిగే ఏబీడీ క్రీజ్‌లో ఉన్నాడంటే ప్రత్యర్థికి వెన్నులో వణుకు పుట్టాల్సిందే. 2011, 2016లో ఆర్‌సీబీ ఫైనల్‌కు చేరడంలో కోహ్లీ, ఏబీడీ కీలక పాత్ర పోషించారు. అయితే టైటిల్‌ను సాధించాలనే కల నెరవేరకుండానే ఏబీడీ ఆటకు వీడ్కోలు చెప్పడం సగటు ఆర్‌సీబీ జట్టు అభిమానిని బాధ పెట్టే అంశం. 

ఏబీడీ సాధించిన గణాంకాలు ఇవే..

* 114 టెస్టుల్లో 8,765 పరుగులు. అందులో 22 శతకాలు, 46 అర్ధశతకాలు. బ్యాటింగ్‌ సగటు 50.68. అత్యధిక స్కోరు 278  నాటౌట్‌ (అబుదాబి వేదికగా పాకిస్థాన్‌పై)

* 228 వన్డేల్లో 25 శతకాలు, 53 అర్ధశతకాలతో 9,577 పరుగులను 53.50 సగటుతో సాధించాడు. అత్యధిక స్కోరు 176 (బంగ్లాదేశ్‌పై)

* 78 టీ20ల్లో 1,672 పరుగులు. పది అర్ధశతకాలు ఉన్నాయి. సగటు 26.14. అత్యధిక స్కోరు 79 నాటౌట్ (స్కాట్లాండ్‌ మీద)

* వన్డేల్లో అత్యధిక వేగవంతమైన అర్ధశతకం: 16 బంతుల్లో (విండీస్‌పై)

* వన్డేల్లో అత్యధిక వేగవంతమైన శతకం: 31 బంతుల్లో (విండీస్‌పై)

* ఐపీఎల్‌: 184 మ్యాచుల్లో 5,162 పరుగులు చేశాడు. అందులో మూడు శతకాలు, 40 అర్ధశతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 133 నాటౌట్

Read latest Sports News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని