Virat Kohli : సఫారీల గడ్డపై విరాట్‌ కోహ్లీ రికార్డుల పర్వం!

టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ.. తన క్రికెట్‌ కెరీర్‌లో కొత్త అధ్యయాన్ని ఘనంగా ప్రారంభించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లీ (51) అర్ధ శతకంతో రాణించిన విషయం...

Published : 20 Jan 2022 14:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ.. తన కెరీర్‌లో సరికొత్త అధ్యయాన్ని ఘనంగా ప్రారంభించాడు. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ (51) అర్ధ శతకంతో రాణించాడు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ వదులుకున్న తర్వాత అతడు నమోదు చేసిన తొలి అర్ధ శతకం ఇదే. సారథ్య బాధ్యతలు చేపట్టక ముందు అంటే అక్టోబరు 29, 2016న న్యూజిలాండ్‌ వన్డే సిరీస్‌లో పూర్తి స్థాయి బ్యాటర్‌గా కోహ్లీ చివరిసారిగా అర్ధ శతకం నమోదు చేశాడు. ఐదేళ్ల తర్వాత తాజా సిరీస్‌లో అతడు చేసిన హాఫ్ సెంచరీ ప్రత్యేకంగా నిలిచిపోయింది. దక్షిణాఫ్రికాలో చివరగా ఆడిన ఏడు వన్డే మ్యాచుల్లో కోహ్లీకిది ఐదో అర్ధ శతకం కావడం గమనార్హం. 

బుధవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి.. 296 పరుగులు చేసింది. 297 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్‌ఇండియా ఆరంభంలోనే కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (12) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. ఆ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్‌ కోహ్లీ సంయమనంతో ఆడాడు. 60 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతడికిది 63వ అర్ధ శతకం. ఇదే మ్యాచులో కోహ్లీ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. విదేశాల్లో అత్యధిక పరుగులు (5,108) చేసిన భారత ఆటగాడిగా అతడు నిలిచాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (5,065) రికార్డును బద్దలు కొట్టాడు. 

మరోవైపు, దక్షిణాఫ్రికాలో అత్యధిక పరుగులు చేసిన మాజీ ఆటగాళ్లు సౌరభ్ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌ రికార్డులనూ కోహ్లీ బ్రేక్ చేశాడు. సఫారీల గడ్డపై 1,338 పరుగులు చేసిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. గంగూలీ (29 మ్యాచుల్లో 1,313 పరుగులు), రాహుల్ ద్రవిడ్‌ (36 మ్యాచుల్లో 1,309 పరుగులు) దక్షిణాఫ్రికాలో నెలకొల్పిన రికార్డులను అధిగమించాడు. సచిన్ టెండూల్కర్‌ 57 మ్యాచుల్లో 2,001 పరుగులు చేసి సఫారీ జట్టుపై అత్యధిక పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని