Shikhar Dhawan : కఠిన పరిస్థితులే.. నన్ను దృఢంగా తయారు చేశాయి : శిఖర్‌ ధావన్‌

యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్న ప్రస్తుత తరుణంలో జట్టులో స్థానం నిలుపుకోవాలంటే కచ్చితంగా రాణించాల్సిన మ్యాచులో శిఖర్‌ ధావన్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన..

Published : 20 Jan 2022 15:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : తనపై వేటు పడ్డ ప్రతిసారి గొప్పగా పునరాగమనం చేస్తూ సత్తా చాటుకుంటుంటాడు టీమ్‌ ఇండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలోనూ ఇదే చేసి చూపించాడు. జట్టులో స్థానం కోసం యువ ఆటగాళ్ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్న తరుణంలో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి వన్డేలో ధావన్‌ (79; 84 బంతుల్లో 10×4) అర్ధ శతకంతో రాణించిన విషయం తెలిసిందే.

నా ఆటపై పూర్తి నమ్మకముంది. కెరీర్‌ పట్ల స్పష్టత ఉన్నందునే తిరిగి జట్టులోకి రాగలిగాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. నాకు ఎదురైన కఠిన పరిస్థితులే, నన్ను మరింత దృఢంగా చేశాయి. నాపై వేటు పడిన ప్రతిసారి పుంజుకుని ఘనంగా పునరాగమనం చేశాను. నా అనుభవం, ఆత్మవిశ్వాసంతో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నించాను. క్రికెట్‌ ఆడినంత కాలం జట్టు విజయం కోసం శాయశక్తులా శ్రమిస్తాను. మీడియాలో వచ్చే వార్తలను పట్టించుకోను. వార్తలు చదవను. అందుకే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండగలుగుతున్నాను

- శిఖర్‌ ధావన్‌, టీమ్‌ ఇండియా ఓపెనర్‌

షాట్లు ఆడటం అంత తేలిక కాదు..

మేం ఇన్నింగ్స్‌ను గొప్పగా ప్రారంభించాం. ఆ తర్వాత పిచ్‌ మందగించింది. అక్కడే మ్యాచ్‌ మలుపు తిరిగింది అని శిఖర్‌ ధావన్‌ విశ్లేషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత సులువేం కాదన్నాడు. ‘‘బౌలర్లకు అనుకూలంగా మారుతున్న పిచ్‌పై మిడిల్ ఓవర్లలో షాట్లు ఆడటం అంత తేలిక కాదు. అందుకే భారత్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. అదే మా విజయావకాశాలను దెబ్బతీసింది. రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్, వెంకటేశ్‌ అయ్యర్‌ లాంటి యువ ఆటగాళ్లు నిరూపించుకునేందుకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. జట్టు అవసరాలకు అనుగుణంగా మెరుగ్గా రాణించేలా తీర్చిదిద్దాలి. 2023 వన్డే ప్రపంచకప్‌ దృష్ట్యా జట్టును సిద్ధం చేస్తున్నాం. మధ్యలో ఇలాంటి ఓటములు ఎదురు కావడం సహజమే. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అతడు జట్టులోకి వస్తే రాహుల్‌ మిడిలార్డర్‌లో ఆడతాడు. కాబట్టి జట్టు బలోపేతం అవుతుంది’’ అని శిఖర్‌ ధావన్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని