Sachin Tendulkar: రైతు కుమార్తె కలను నిజం చేసిన సచిన్‌

భారత క్రికెట్‌లో దేవుడిగా భావించే దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. ఓ పేద రైతు కుమార్తె కలను నిజం చేశారు. డాక్టర్‌ అయ్యేంతవరకు ఆ విద్యార్థికి అయ్యే ఖర్చులను భరించనున్నారు....

Published : 29 Jul 2021 01:51 IST

ముంబయి: భారత క్రికెట్‌లో దేవుడిగా భావించే దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందూల్కర్‌ మరోసారి తన పెద్దమనసు చాటుకున్నారు. ఓ పేద రైతు కుమార్తె కలను నిజం చేశారు. డాక్టర్‌ అయ్యేంతవరకు ఆ విద్యార్థికి అయ్యే ఖర్చులను భరించనున్నారు. మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా జైరే ప్రాంతానికి చెందిన పేద రైతు కుమార్తె దీప్తి విశ్వాస్‌రావు డాక్టర్‌ కావాలని చిన్నప్పటి నుంచి కలలుగనేది. ఆ దిశగానే అడుగులు వేస్తూ కష్టపడి చదివి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సంపాదించింది. అయితే, అంతంతమాత్రంగానే ఉండే ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న సేవా సహ్యోగ్‌ అనే స్వచ్ఛంద సంస్థ.. ఈ విషయాన్ని సచిన్‌ తెందూల్కర్‌ ఫౌండేషన్‌ ‘ఎస్‌ఆర్‌టీ10’ దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే స్పందించిన ఫౌండేషన్.. ఆ విద్యార్థి డాక్టర్‌ పట్టా పొందేవరకు అయ్యే ఖర్చులను భరించనున్నట్లు పేర్కొంది. సచిన్‌ సాయంతో దీప్తి ప్రస్తుతం వైద్య విద్యను అభ్యసిస్తోంది.

ఈసందర్భంగా దిప్తీ ట్విటర్‌ వేదికగా ఓ వీడియోను పంచుకొంటూ సచిన్‌కు ధన్యవాదాలు తెలిపింది. ‘ప్రస్తుతం నేను అకోలాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ చదువుతున్నాను. మా నాన్న రైతు. మా అమ్మ గృహిణి. కష్టపడితేనే విజయం వరిస్తుందని తెలుసుకున్నా. ఆ కష్టానికి ప్రతిఫలంగానే ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో సీటు సంపాదించా. నాకు స్కాలర్‌షిప్ అందిస్తున్న సచిన్‌ తెందూల్కర్‌ ఫౌండేషన్‌కు ధన్యవాదాలు’ అని దీప్తి సంతోషం వ్యక్తం చేసింది.

సచిన్‌ ఆమె గురించి మాట్లాడారు. కలలు కంటూ వాటిని ఎలా సాధించాలో దీప్తి నిరూపించిందన్నారు. అనుకున్న లక్ష్యాలను చేరేందుకు విద్యార్థిని ప్రయాణం ఎంతో మందికి ఆదర్శమని కొనియాడారు. భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని