Tokyo Olympics: 13 కుట్లు పడినా అలాగే పోరాడిన సతీశ్‌ కుమార్‌ 

టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సింగ్‌లో మరో ఎదురుదెబ్బ తగిలింది. పురుషుల 91+ కేజీల విభాగంలో భారీ అంచనాలు పెట్టుకున్న సతీశ్‌ కుమార్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్‌ బాఖోదిర్‌ జలొలోవ్...

Updated : 01 Aug 2021 13:20 IST

కఠిన పరిస్థితుల్లో పోరాడి ఓడిన బాక్సర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టోక్యో ఒలింపిక్స్‌ బాక్సింగ్‌లో భారత్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. పురుషుల 91+ కేజీల విభాగంలో భారీ అంచనాలు పెట్టుకున్న సతీశ్‌ కుమార్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఉజ్బెకిస్థాన్‌ బాక్సర్‌ బాఖోదిర్‌ జలొలోవ్‌ చేతిలో 0-5 తేడాతో ఓటమిపాలయ్యాడు. ఈ స్కోర్‌ చూడడానికి మరీ పేలవంగా ఉన్నా సతీశ్‌ పోరాటం అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే ప్రీ క్వార్టర్స్‌ సమయంలో అతడి ముఖంపై గాయాలయ్యాయి. నుదుటి భాగం, గడ్డం దగ్గర మొత్తం 13 కుట్లు పడినా అదేమీ లెక్క చేయకుండా క్వార్టర్స్‌లో పోటీపడ్డాడు. ఈ క్రమంలోనే జలొలోవ్‌ చేతిలో ఓటమిపాలయ్యాడు.

ప్రస్తుతం అతడు కాస్త నిరాశకు గురయ్యాడని, ఓటమి నుంచి తేరుకున్నాక అతడెంత గొప్ప పోరాటం చేశాడో అర్థం చేసుకుంటాడని ఇండియన్‌ బాక్సింగ్‌ హైపెర్ఫామెన్స్‌ డైరెక్టర్‌ సాంటియాగో నీవా పీటీఐతో అన్నారు. అంతటి గాయాలతో ఆడటం తేలికైన విషయం కాదని, అది గర్వపడాల్సిన విషయమని ఆయన పేర్కొన్నారు. జలొలోవ్‌ కొట్టిన ప్రతి పంచ్‌ సతీశ్‌కు తీవ్రమైన నొప్పిని కలిగించిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆడటం అతడి ధైర్యం, దేశభక్తికి నిదర్శనమని కొనియాడారు.

ఇక ఈ ఓటమితో ఒలింపిక్స్‌లో భారత బాక్సింగ్‌ పోరుకు దాదాపుగా తెరపడింది. ఒక్క లవ్లీనా బొర్గోహెన్‌ మాత్రమే మహిళల 69 కేజీల విభాగంలో సెమీస్‌ చేరింది. దాంతో భారత్‌కు ఈ ఏడాది బాక్సింగ్‌లో ఒక పతకం సాధించే అవకాశం దక్కింది. మరోవైపు శనివారం 52 కేజీల పురుషుల విభాగంలో అమిత్‌ పంగాల్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అంతకుముందు మేరీకోమ్‌ 51 కేజీల విభాగంలో, 75 కేజీల విభాగంలో పూజా రాణి, 60 కేజీల విభాగంలో సిమ్రన్‌జిత్‌ కౌర్‌ ఓడిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని