Tokyo Olympics: జావెలిన్‌ త్రోలోనూ భారత్‌కు నిరాశే.. ఆకట్టుకోలేకపోయిన అన్ను రాణి

ఒలింపిక్స్‌లో మంగళవారం భారత్‌కు మరో నిరాశే ఎదురైంది. జావెలిన్‌ త్రో విభాగంలో తుదిపోరుకు అర్హత సాధించే పోటీల్లో జాతీయ అత్యుత్తమ రికార్డు కలిగిన అథ్లెట్‌ అన్ను రాణి నిరుత్సాహపర్చింది....

Published : 03 Aug 2021 19:33 IST

టోక్యో: ఒలింపిక్స్‌లో మంగళవారం భారత్‌కు మరో నిరాశే ఎదురైంది. జావెలిన్‌ త్రో విభాగంలో తుదిపోరుకు అర్హత సాధించే పోటీల్లో జాతీయ అత్యుత్తమ రికార్డు కలిగిన అథ్లెట్‌ అన్ను రాణి నిరుత్సాహపర్చింది. ఆమె మూడో ప్రయత్నంలో 54.04 మీటర్ల ప్రదర్శన చేసి క్వాలిఫికేషన్‌-ఏలో 14వ స్థానంలో నిలిచింది. దాంతో ఆమె మార్చిలో నెలకొల్పిన తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన 63.24 మీటర్లు కూడా చేరుకోలేకపోయింది. ఈ క్రమంలోనే రెండు అర్హత పోటీలు పూర్తయ్యేసరికి ఆమె 29వ స్థానంలో నిలిచింది.

ఇక అన్ను తొలి రెండు ప్రయత్నాల్లో 50.35 మీటర్లు, 53.19 మీటర్ల ప్రదర్శనలతో మరింత తక్కువస్థాయి ప్రదర్శన చేసింది. కాగా, ఈ ఈవెంట్‌లో ఎవరైనా అథ్లెట్లు 63 మీటర్ల ప్రదర్శన చేస్తే.. వాళ్లు నేరుగా ఫైనల్స్‌కు దూసుకెళతారు. లేదా ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తుది 12 మందిని ఫైనల్స్‌కు ఎంపికచేస్తారు. ఈ క్రమంలోనే క్వాలిఫికేషన్‌-ఏలో పొలాండ్‌ అథ్లెట్‌ మారియా అండ్రెజిక్‌ 65.25 మీటర్ల మేటి ప్రదర్శనతో తొలి ప్రయత్నంలోనే ఫైనల్‌ బెర్తును ఖరారుచేసుకుంది. మరోవైవు పురుషుల జావెలిన్‌ త్రో విభాగంలో భారత అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా బుధవారం తుదిపోరుకు అర్హత సాధించే పోటీల్లో పాల్గొననున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని