Rohit Sharma: కోహ్లీని దాటేసిన రోహిత్‌.. ఇక లక్ష్యం నం.1

టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ టెస్టు కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు అందుకున్నాడు. సారథి విరాట్‌ కోహ్లీని దాటేసి ఐదో స్థానానికి ఎగబాకాడు. వరుస శతకాలతో జోరు మీదున్న ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ అగ్రస్థానానికి చేరుకున్నాడు...

Published : 02 Sep 2021 01:19 IST

దుబాయ్‌: టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ టెస్టు కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు అందుకున్నాడు. సారథి విరాట్‌ కోహ్లీని దాటేసి ఐదో స్థానానికి ఎగబాకాడు. వరుస శతకాలతో జోరు మీదున్న ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ అగ్రస్థానానికి చేరుకున్నాడు.ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో 19, 59 పరుగులు చేయడంతో రోహిత్‌ (773) ఒక స్థానం మెరుగు పర్చుకున్నాడు. కెరీర్‌ అత్యుత్తమ ఐదో ర్యాంకు అందుకున్నాడు. దాంతో విరాట్‌ కోహ్లీ (766) ఆరో స్థానానికి పరిమితం అయ్యాడు. వీరిద్దరి మధ్య ఇప్పుడు 7 రేటింగ్‌ పాయింట్ల అంతరమే ఉండటం గమనార్హం. మూడో టెస్టులో 91 పరుగులు చేసిన చెతేశ్వర్‌ పుజారా మూడు ర్యాంకులు మెరుగయ్యాడు. 15వ ర్యాంకు సాధించాడు. రిషభ్ పంత్‌ నాలుగు స్థానాలు కోల్పోయి 12కు పరిమితం అయ్యాడు.టీమ్‌ఇండియా పేసుగుర్రం జస్ప్రీత్‌ బుమ్రా ఒక స్థానం ఎగబాకి తొమ్మిదో ర్యాంకుకు చేరుకున్నాడు. సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆడనప్పటికీ ఎప్పట్లాగే రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్‌ కమిన్స్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌ వరుసగా 3, 4 స్థానాల్లో ఉండటం గమనార్హం.దాదాపుగా ఆరేళ్లకు జో రూట్‌ ప్రపంచ నంబర్‌ వన్‌గా అవతరించాడు.

టీమ్‌ఇండియాతో సిరీసుకు ముందు అతడు ఐదో స్థానంలో ఉన్నాడు. మూడు శతకాలు సహా 507 పరుగులు చేయడంతో మార్నస్‌ లబుషేన్‌, కేన్‌ విలియమ్సన్‌, స్టీవ్‌స్మిత్‌ను దాటేసి అగ్రస్థానం అందుకున్నాడు. స్మిత్‌తో పోలిస్తే రూట్‌ (916) ఖాతాలో 15 రేటింగ్‌ పాయింట్లు ఎక్కువగా ఉన్నాయి.చివరిసారిగా 2015, డిసెంబర్లో రూట్‌ నంబర్‌వన్‌గా ఉన్నాడు. ఆ తర్వాత కేన్‌ విలియమ్సన్‌ ఆ స్థానాన్ని ఆక్రమించాడు. కొన్నాళ్లు ఏబీ డివిలియర్స్‌, స్టీవ్‌స్మిత్‌, విలియమ్సన్‌, కోహ్లీ నంబర్‌వన్‌గా ఉన్నారు. మళ్లీ ఇన్నాళ్లకు రూట్‌కు సమయం వచ్చింది. బౌలర్ల విభాగంలో జేమ్స్‌ అండర్సన్‌ 5, రాబిన్సన్‌ 36వ స్థానంలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని