Pakistan Cricket: ప్రపంచకప్‌ ముందు పాక్‌ జట్టుకు భారీ షాక్

వచ్చేనెల టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు ప్రధాన కోచ్‌ మిస్బాఉల్‌హక్‌, బౌలింగ్‌ కోచ్‌ వకార్‌ యూనిస్‌ తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు...

Published : 07 Sep 2021 01:18 IST

కరాచి: వచ్చేనెల టీ20 ప్రపంచకప్‌కు ముందు పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు ప్రధాన కోచ్‌ మిస్బాఉల్‌హక్‌, బౌలింగ్‌ కోచ్‌ వకార్‌ యూనిస్‌ తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వారిద్దరు తమ పదవులకు రాజీనామా చేశారని సోమవారం పాక్‌ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ క్రమంలోనే మాజీ ఆటగాళ్లు సక్లేన్‌ ముస్తాక్‌, అబ్దుల్‌ రజాక్‌లను తాత్కాలిక కోచ్‌లుగా నియమించినట్లు స్పష్టంచేసింది. మరోవైపు పీసీబీ నూతన ఛైర్మన్‌గా మాజీ కెప్టెన్‌ రమీజ్‌ రాజా వచ్చేవారం బాధ్యతలు చేపడుతున్న క్రమంలోనే మిస్బా, వకార్‌ తప్పుకోవడం అనుమానాలకు తావిస్తోంది.

కాగా, రమీజ్‌ గతంలో మిస్బా, వకార్‌ యూనిస్‌ల పనితీరుపై అసహనం వ్యక్తం చేయడం కూడా ఈ ఊహాగాలను బలపరుస్తోంది. అలాగే ప్రపంచకప్ ఈవెంట్‌కు సోమవారం ప్రకటించిన పాక్‌ జట్టులోనూ రమీజ్‌ రాజా ప్రభావం అధికంగా ఉన్నట్లు సమాచారం. అయితే, భవిష్యత్‌లో పాకిస్థాన్‌ మ్యాచ్‌లు అధికంగా ఉండటంతో ఎక్కువకాలం బయోబుడగలో ఉంటూ కుటుంబానికి దూరంగా ఉండాల్సిన వస్తుందని, అందువల్లే తాను రాజీనామా చేస్తున్నట్లు మిస్బా ఒక ప్రకటనలో వివరించాడు. కీలకమైన ప్రపంచకప్‌కు ముందు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదంటూనే రాబోయే సవాళ్లను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా లేనన్నాడు. వేరేవాళ్లు కోచింగ్‌ బాధ్యతలు చేపట్టి పాక్‌ జట్టును ముందుకు నడిపించాలని ఆకాంక్షించాడు. అతడితోపాటే బౌలింగ్‌ కోచ్‌గా ఒకేసారి బాధ్యతలు చేపట్టిన వకార్‌ సైతం మిస్బా బాటలోనే నడవాలనుకున్నట్లు వెల్లడించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని