Neeraj Chopra on Sumit Antil: సుమిత్‌ భాయ్‌ ఖతర్నాక్‌ ప్రదర్శన చేశావ్‌!

పారాలింపిక్స్‌లో సోమవారం భారత్‌కు రెండో స్వర్ణం అందించిన జావెలిన్‌ త్రో అథ్లెట్‌ సుమిత్‌ అంటిల్‌ను ఒలింపిక్స్‌ పసిడి పతక విజేత నీరజ్‌ చోప్రా ప్రత్యేకంగా అభినందించాడు...

Published : 30 Aug 2021 21:50 IST

టోక్యో: పారాలింపిక్స్‌లో సోమవారం భారత్‌కు రెండో స్వర్ణం అందించిన జావెలిన్‌ త్రో అథ్లెట్‌ సుమిత్‌ అంటిల్‌ను ఒలింపిక్స్‌ పసిడి పతక విజేత నీరజ్‌ చోప్రా ప్రత్యేకంగా అభినందించాడు. ట్విటర్‌లో అతడి ప్రదర్శనను కొనియాడుతూ ఖతర్నాక్‌ ప్రదర్శన చేశావని మెచ్చుకున్నాడు. పారాలింపిక్స్‌లో పురుషుల ఎఫ్‌-64 జావెలిన్‌ త్రో విభాగంలో సుమిత్‌ పలుమార్లు తన ప్రపంచ రికార్డును తానే తిరగరాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఐదో ప్రయత్నంలో 68.55 మీటర్ల దూరంలో ఈటెను విసిరి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దాంతో పారాలింపిక్స్‌లో భారత్‌కు రెండో స్వర్ణం అందించాడు. మరోవైపు నీరజ్‌ చోప్రా సైతం ఈనెల ఆరంభంలో ఒలింపిక్స్‌లో జావెలిన్‌ త్రో విభాగంలోనే పసిడి పతకం సాధించిన సంగతి తెలిసిందే. అతడు 88.58 మీటర్లు విసిరి ఈ ఏడాది ఒలింపిక్స్‌లో ఏకైక పసిడి పతకం ఖాయం చేశాడు. దాంతో నీరజ్‌ ఒక్కసారిగా హీరో అయ్యాడు. ఇప్పుడు అదే విభాగంలో సుమిత్‌ సైతం పారా అథ్లెట్‌గా బంగారు పతకం కైవసం చేసుకోవడం విశేషం. కాగా, సుమిత్‌ బంగారు పతకం గెలవడంతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవిండ్‌, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని