Published : 30/07/2021 11:59 IST

Mary Kom: బౌట్‌కు ఒక్క నిమిషం ముందు.. డ్రెస్‌ మార్చుకోమన్నారు!

జడ్జిమెంట్‌పై మేరీకోమ్‌ అసంతృప్తి

దిల్లీ: ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌, లండన్‌ ఒలింపిక్‌ కాంస్య పతక విజేత మేరీకోమ్‌ అనూహ్య రీతిలో టోక్యో ఒలింపిక్స్‌ నుంచి నిష్క్రమించింది. గురువారం జరిగిన 51 కిలోల ప్రీక్వార్టర్స్‌లో 2-3తో రియో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత ఇంగ్రిట్‌ వాలెన్సియా (కొలంబియా) చేతిలో ఓడింది. అయితే బౌట్‌ ఆద్యంతం ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించినా.. న్యాయనిర్ణేతల స్ప్లిట్‌ డిసిషన్‌తో మేరీకి పరాజయం తప్పలేదు. దీంతో జడ్జీల తీరుపై మేరీకోమ్‌ అసంతృప్తి చెందింది. అంతేగాక, బౌట్‌కు ఒక్క నిమిషం ముందు తనను డ్రెస్‌ మార్చుకోమని అడగడంపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. 

పోటీ అనంతరం మేరీకోమ్‌ ఓ ట్వీట్‌ చేసింది. ‘‘ఆశ్చర్యకరంగా ఉంది.. అసలు రింగ్ డ్రెస్‌ అంటే ఏంటీ? నా ప్రీక్వార్టర్‌ బౌట్‌కు ఒక్క నిమిషం ముందు నన్ను రింగ్‌ డ్రెస్‌ మార్చుకుని రమ్మని చెప్పారు. అలా ఎందుకు అడిగారో చెబుతారా?’’ అని ఆమె ప్రశ్నించింది. 

ఓడిపోయానంటే నమ్మలేకపోతున్నా..

ప్రీ క్వార్టర్స్‌లో తాను మూడింట రెండు రౌండ్లు గెలిచినప్పటికీ జడ్జీలు ప్రతికూల నిర్ణయం ప్రకటించడంతో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ(ఐఓసీ) బాక్సింగ్‌ టాస్క్ ఫోర్స్‌పై మేరీకోమ్‌ విమర్శలు చేసింది. ‘‘న్యాయనిర్ణేతల నిర్ణయం ఏంటో నాకు అర్థం కావట్లేదు. టాస్క్‌ఫోర్స్‌, ఐఓసీకి ఏమైంది?’’ అని పీటీఐకి ఇచ్చిన టెలిఫోన్‌ ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేసింది. ఓడిపోయానంటే ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటూ ఆవేదన చెందింది. 

‘‘టాస్క్‌ఫోర్స్‌లో నేను కూడా సభ్యురాలినే. పారదర్శకంగా పోటీలు జరిగేందుకు నేను కూడా సలహాలు ఇస్తుంటా. కానీ ఈ రోజు ఏం జరిగింది? నేను రింగ్‌లో ఎంతో సంతోషంగా ఉన్నాను. కచ్చితంగా నేను గెలిచానని నాకు తెలుసు. ఆ నమ్మకంతోనే బయటకు వచ్చాను. ఆ తర్వాత నన్ను డోపింగ్‌కు తీసుకెళ్లారు. అప్పుడు కూడా ఆనందంగానే ఉన్నాను. కానీ నా కోచ్‌ చెప్పేదాకా నేను ఓడిపోయాననే విషయం నాకు తెలియలేదు. ఇదే ప్రత్యర్థిని గతంలో రెండు సార్లు ఓడించాను. కానీ రిఫరీ ఆమె(వాలెన్సియా) చేతిని ఎత్తడం ఇంకా నమ్మలేకపోతున్నా’’ అని మేరీ చెప్పుకొచ్చింది. ‘‘రెండో రౌండ్‌లో నేను ఏకగ్రీవంగా గెలవాల్సింది. కానీ న్యాయనిర్ణేతల నుంచి 3-2 ఫలితం వచ్చింది. అంతా అనూహ్యంగా జరిగిపోయింది. ఒక్క క్షణంలో అథ్లెట్‌ భవిష్యత్తే మారుతుంది. ఈ రోజు జరిగిందంతా దురదృష్టకరం. న్యాయనిర్ణేతల ఫలితంతో నేను అసంతృప్తి చెందాను. అయితే మరో బాధాకరమైన విషయం ఏంటంటే.. ఇక్కడ రివ్యూ అడగడానికి, ఆందోళన చేయడానికి అవకాశం ఉండదు. కానీ జరిగిందాన్ని ప్రపంచం అంతా చూస్తోంది’’ అని మేరీ ఆవేదన వ్యక్తం చేసింది. 

అయితే ఇక్కడితో తన కెరీర్‌ ముగిసిందని భావించట్లేదని మేరీ తెలిపింది. బాక్సింగ్‌ను ఎప్పటికీ విడిచిపెట్టేది లేదని, ఒలింపిక్స్‌ నుంచి తిరిగొచ్చాక కొద్ది రోజులు కుటుంబంతో గడిపి.. తర్వాతి పోటీలకు సాధన మొదలుపెడతానని చెప్పింది. 38ఏళ్ల మేరీకోమ్‌కు ఇదే చివరి ఒలింపిక్స్‌ కావడం గమనార్హం. 40ఏళ్ల పైబడిన బాక్సర్లు ఒలింపిక్‌కు అర్హులు కారని ప్రస్తుతం నిబంధన ఉంది. 

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్