Tokyo olympics: లవ్లీనా సంచలనం.. పతకానికి అడుగు దూరమే..!

టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్‌ లవ్లీనా బొర్గొహైన్‌ (69కిలోలు) సంచలనం సృష్టించింది. మెగా క్రీడల్లో ఘనంగా అరంగేట్రం చేసింది. ప్రిక్వార్టర్స్‌లో జర్మన్‌ బాక్సర్‌ నడైన్‌ ఆప్టెజ్‌ను 3-2 తేడాతో ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది....

Published : 27 Jul 2021 12:06 IST

క్వార్టర్స్‌కు చేరుకున్న భారత బాక్సర్‌

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత బాక్సర్‌ లవ్లీనా బొర్గొహైన్‌ (69కిలోలు) సంచలనం సృష్టించింది. మెగా క్రీడల్లో ఘనంగా అరంగేట్రం చేసింది. ప్రిక్వార్టర్స్‌లో జర్మన్‌ బాక్సర్‌ నడైన్‌ ఆప్టెజ్‌ను 3-2 తేడాతో ఓడించి క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తన తర్వాతి మ్యాచులో గెలిస్తే ఆమె కనీసం కాంస్యం ఖాయం చేసుకుంటుంది. తొలిరౌండ్లో లవ్లీనాకు బై లభించడం గమనార్హం.

మంగళవారం భారత్‌ నుంచి పోటీపడిన ఏకైక బాక్సర్‌ లవ్లీనా మాత్రమే. ఆప్టెజ్‌పై ఆమె విజయం సునాయసంగా రాలేదు. 12 ఏళ్ల అనుభవం ఉన్న ప్రత్యర్థిపై తెలివిగా ఆడి గెలిచింది. స్వల్పతేడాతో పై చేయి సాధించింది. యాదృచ్ఛికంగా వీరిద్దరికీ ఇదే తొలి ఒలింపిక్స్‌ కావడం గమనార్హం. జర్మనీ నుంచి ఒలింపిక్స్‌కు ఎంపికైన తొలి బాక్సర్‌ ఆప్టెజ్‌. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్యం గెలిచింది. ఇక లవ్లీనాకూ సైతం రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్‌లో కాంస్యాలు గెలిచిన అనుభవం ఉంది.

తొలిరౌండ్లో లవ్లీనా దూకుడుగా ఆడింది. మరోవైపు ఆప్టెజ్‌ సైతం ఘాటుగా బదులిచ్చింది. ఆ తర్వాత వ్యూహం మార్చిన లవ్లీనా లెప్ట్‌ హుక్స్‌తో పాయింట్లు రాబట్టింది. సహనం ప్రదర్శించింది. ఐదుగురు న్యాయ నిర్ణేతల్లో ముగ్గురు లవ్లీనా వైపు మొగ్గడంతో 28-29, 29-28, 30-27, 30-27, 27-30తో విజయం సాధించి క్వార్టర్స్‌కు చేరుకుంది. ఆమె ప్రత్యర్థి ఆప్టెజ్‌ జర్మనీలో న్యూరోసైన్స్‌లో పీహెచ్‌డీ చేస్తుండటం ప్రత్యేకం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని