Mumbai Indians: ముంబయి ఇండియన్స్‌ ఇప్పుడలా ఆడితే కుదరదు.. దంచి కొట్టాల్సిందే!

మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 14వ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌ల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌ ట్రోఫీ నిలబెట్టుకోవాలంటే తొలి బంతి నుంచే చెలరేగాలని ఇంగ్లాండ్‌ మాజీ సారథి కెవిన్‌ పీటర్సన్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 17 Sep 2021 19:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌ 14వ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌ల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ముంబయి ఇండియన్స్‌ ట్రోఫీ నిలబెట్టుకోవాలంటే తొలి బంతి నుంచే చెలరేగాలని ఇంగ్లాండ్‌ మాజీ సారథి కెవిన్‌ పీటర్సన్‌ అభిప్రాయపడ్డాడు. ఏటా టోర్నీ ఆరంభంలో ఆ జట్టు ఓటములతో మొదలుపెడుతుందని, తర్వాత వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుందని అన్నాడు. అయితే, ఈ సీజన్‌లో ఇప్పటికే సగం మ్యాచ్‌లు పూర్తయినందున ఇకపై ప్రతి మ్యాచ్‌ రోహిత్‌ జట్టుకు ముఖ్యమని తెలిపాడు. పీటర్సన్‌ ఆన్‌లైన్‌ ఓ బ్లాగ్‌లో ఇలా రాసుకొచ్చాడు.

ముంబయి ఇండియన్స్‌ మిగిలిన సీజన్‌లో మూడు, నాలుగు మ్యాచ్‌లు ఓడడానికి సిద్ధంగా లేదని, ఇకపై సగం మ్యాచ్‌లే మిగిలి ఉండటంతో తొలి బంతి నుంచే విజయాలు సాధించేలా ఆడాలని పీటర్సన్‌ సూచించాడు. ఆ జట్టుకున్న ఆటగాళ్లతో అదేం పెద్ద సమస్య కాదని తన అభిప్రాయం వెల్లడించాడు. అనంతరం చెన్నై సూపర్‌ కింగ్స్‌పై స్పందించిన అతడు.. ఈ సీజన్‌ మొదలవ్వడానికి ముందు ఏప్రిల్‌లో ప్రతి ఒక్కరూ ధోనీసేన పనైపోయిందని విమర్శించారని గుర్తుచేశాడు. అయితే.. టోర్నీ మధ్యలో నిలిచిపోయేసరికి ఆ జట్టు మెరుగైన స్థితిలో నిలిచిందన్నాడు. అప్పుడు విదేశీ ఆటగాళ్లు ఫా డుప్లెసిస్‌, మొయిన్‌ అలీ, సామ్‌కరన్‌ బాగా ఆడారని మెచ్చుకున్నాడు. అయితే, ఇప్పుడు నాలుగు నెలలు విరామం దొరకడంతో మిగిలిన సీజన్‌లో చెన్నై ఆటగాళ్లు ఎలా ఆడతారనేది కీలకంగా ఉంటుందన్నాడు. ఒకవేళ చెన్నై ఇంతకుముందు లాగే బాగా ఆడితే టైటిల్‌ సాధించే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. దీంతో ఆ జట్టు పనైపోయిందన్న అందరి నోళ్లు మూతపడతాయని పీటర్సన్‌ ఎద్దేవా చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని