Team India: క్రికెటర్లు రోబోలు కాదు.. టీమ్‌ఇండియాలో రెండు గ్రూపులు..!

ఏ ఆటగాడూ ఓడాలని బరిలోకి దిగడని, గెలిచేందుకే ప్రయత్నిస్తాడని ఇంగ్లాండ్‌ మాజీ సారథి కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. అతడు తాజాగా టీమ్‌ఇండియాకు అండగా నిలుస్తూ...

Updated : 16 Nov 2021 15:19 IST

కోహ్లీసేనపై కెవిన్‌ పీటర్సన్‌, షోయబ్‌ అక్తర్‌ వ్యాఖ్యలు..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏ ఆటగాడూ ఓడాలని బరిలోకి దిగడని, గెలిచేందుకే ప్రయత్నిస్తాడని ఇంగ్లాండ్‌ మాజీ సారథి కెవిన్‌ పీటర్సన్‌ అన్నాడు. అతడు తాజాగా టీమ్‌ఇండియాకు అండగా నిలుస్తూ ట్విటర్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు రోబోలు కాదని సున్నితంగా వివరించాడు. యూఏఈ వేదికగా జరుగుతోన్న టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా వరుసగా రెండు ఘోర పరాభవాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో సెమీస్‌ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి. ఈ నేపథ్యంలోనే కోహ్లీసేన ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అయితే, ఇంగ్లాండ్‌ మాజీ సారథి కెవిన్‌ పీటర్సన్‌ ఇప్పుడు భారత జట్టుకు అండగా నిలవడం గమనార్హం.

‘ఆటలో ఒకరు విజేతగా నిలిస్తే మరొకరు ఓటమిపాలవుతారు. ఎవరూ ఓడాలని బరిలోకి దిగరు. దేశం తరఫున ఆడటం అనేది అన్నిటికన్నా గొప్ప గౌరవం. జట్టులోని ఆటగాళ్లు రోబోలు కాదనే విషయాన్ని మీరంతా గుర్తించాలి. ఎల్లప్పుడూ ఆటగాళ్లకు అండగా నిలుస్తూ మద్దతు తెలపాలి’ అని పీటర్సన్‌ టీమ్‌ఇండియా అభిమానులకు సూచించాడు.

ఇదిలా ఉండగా.. న్యూజిలాండ్‌తో భారత్‌ ఓటమి అనంతరం పాక్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ సైతం తన అభిప్రాయాలు పంచుకున్నాడు. తన యూట్యూబ్‌ ఛానల్లో మాట్లాడుతూ.. టీమ్‌ఇండియాలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయని అన్నాడు. ఒకటి కెప్టెన్‌ కోహ్లీ వైపు మొగ్గుచూపుతుంటే.. మరొకటి అతడికి వ్యతిరేకంగా ఉందని చెప్పాడు. కివీస్‌తో మ్యాచ్‌లో విరాట్‌ తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా అతడో గొప్ప క్రికెటర్‌ అని, అతడిని గౌరవించాలని పాక్‌ మాజీ పేసర్‌ తన వీడియోలో చెప్పుకొచ్చాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని