IPL 2021: సంజూ శాంసన్‌ కొట్టుడు.. రాజస్థాన్‌ రాయల్స్‌ ఓడుడు!

రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఊహించని పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అతడు బ్యాట్‌ ఝుళిపించిన ప్రతిసారి ఆ జట్టు ఓటముల పాలవుతోంది...

Published : 29 Sep 2021 02:10 IST

ధావన్‌ నుంచి ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్న రాజస్థాన్‌ కెప్టెన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ఊహించని పరిస్థితులు ఎదుర్కొంటున్నాడు. అతడు బ్యాట్‌ ఝుళిపించిన ప్రతిసారి ఆ జట్టు ఓటముల పాలవుతోంది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో అతడు మూడు మ్యాచ్‌ల్లో దంచి కొట్టగా అన్నింట్లోనూ రాజస్థాన్‌ విఫలమైంది. తాజాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే పరిస్థితి ఎదురైంది.

సంజూ తొలుత ఏప్రిల్‌లో టోర్నీ ప్రారంభమైనప్పుడు పంజాబ్‌పై చెలరేగాడు. అప్పుడా మ్యాచ్‌లో (119) సెంచరీతో చెలరేగగా పంజాబ్‌ నిర్దేశించిన 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్‌ 217 పరుగులు చేసింది. దీంతో త్రుటిలో రాజస్థాన్‌ తొలి విజయాన్ని కోల్పోయింది. అనంతరం రెండో దశలో దిల్లీతో జరిగిన మ్యాచ్‌లోనూ 155 పరుగుల ఛేదనలో సంజూ (70 నాటౌట్‌; 53 బంతుల్లో 8x4, 1x6) విజృంభించాడు. కానీ, రాజస్థాన్‌ 121/6 స్కోరుకే పరిమితమై ఓటమి చవిచూసింది. ఇక సోమవారం హైదరాబాద్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 164/5 స్కోర్‌ సాధించింది. కెప్టెన్‌ (82; 57 బంతుల్లో 7x4, 3x6) మరోసారి చెలరేగాడు. అయినా ఫలితం సున్నా. ఈ నేపథ్యంలో రాబోయే మ్యాచ్‌ల్లో అయినా రాజస్థాన్‌ గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

టాప్‌లోకి దూసుకొచ్చాడు..
మరోవైపు సంజూ శాంసన్‌ ఐపీఎల్‌లో మూడు వేల పరుగుల మైలురాయి పూర్తి  చేసుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన 19వ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. గతరాత్రి హైదరాబాద్‌పై ధాటిగా ఆడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్‌లో మూడు వేల పరుగులు పూర్తి చేయడమే కాకుండా ఈ సీజన్‌లో అత్యధిక పరుగులతో దూసుకుపోతున్నాడు. దిల్లీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (430)ను అధిగమించి సంజూ (433) ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. ఇక ఇప్పటివరకు సంజూ ఐపీఎల్‌లో మొత్తం 3,017 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ 6,185 పరుగులతో అందరి కన్నా ముందున్నాడు. ఆ తర్వాత ధావన్‌ (5,627), రోహిత్ శర్మ (5,556), సురేశ్‌ రైనా (5,523), డేవిడ్‌ వార్నర్‌ (5,449) పరుగులతో వరుసగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని