IPL 2021: ఇది ఛేదిస్తామనుకున్నా: సంజూ.. ప్రణాళిక ప్రకారమే ఆడతాం: పంత్

దిల్లీతో తలపడిన మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించొచ్చని అనుకున్నానని రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ అన్నాడు. శనివారం ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో దిల్లీ తొలుత బ్యాటింగ్...

Updated : 27 Sep 2021 04:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దిల్లీతో తలపడిన మ్యాచ్‌లో 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదించొచ్చని అనుకున్నానని రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ అన్నాడు. శనివారం ఇరు జట్ల మధ్య జరిగిన పోరులో దిల్లీ తొలుత బ్యాటింగ్‌ చేసి 154/6 స్కోర్‌ సాధించగా.. రాజస్థాన్‌ ఛేదనలో తడబడింది. ఈ జట్టు 121/6కే పరిమితమై ఓటమిపాలైంది. దీంతో దిల్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకొని ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. మరోవైపు ఈ ఓటమితో రాజస్థాన్‌ ఏడో స్థానానికి పడిపోయింది.

155 ఛేదిస్తామనుకున్నా: సంజూ

‘మాకున్న బ్యాటింగ్‌ లైనప్‌ చూసి 155 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తామనుకున్నా. అయితే 121 పరుగులకే పరిమితమవ్వడం నిరాశ కలిగించింది. తర్వాతి మ్యాచ్‌లో మరింత బలంగా పుంజుకొంటాం. ప్రస్తుతం మేమంతా చాలా భావోద్వగంతో ఉన్నాం. ఈ ఓటమి గురించి ఆదివారం చర్చించుకుంటాం. అయితే, ఈ పిచ్‌ మరీ అంత నెమ్మదిగా లేకపోయినా పెద్ద స్కోర్‌ సాధించేలా అనిపించలేదు. అయితే, మాకు కొన్ని వికెట్లు మిగిలి ఉంటే ఈ మ్యాచ్‌ను గెలిచేవాళ్లం’ అని సంజూ వివరించాడు.

ప్రణాళిక పరంగా ఆడతాం: పంత్‌

‘మా బౌలర్ల నుంచి ఇదో అత్యుత్తమ ప్రదర్శన. ఆడే మ్యాచ్‌పైనే దృష్టిసారించి ప్రణాళికలు రచిస్తాం. బ్యాట్స్‌మెన్‌ను బట్టి వాటిని మైదానంలో అమలు చేస్తాం. మా జట్టులో అశ్విన్‌ బౌలింగ్‌ చేసేటప్పుడు ఫీల్డింగ్‌ తానే సెట్‌ చేస్తాడు. అతడొక సీనియర్‌ ఆటగాడైనందున చొరవ తీసుకోవాలని చూస్తాడు. ఒక కెప్టెన్‌గా నేనది గౌరవిస్తా. అలాగే నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. ముఖ్యంగా ఇలా వరుస విజయాలు సాధిస్తుంటే ఆనందంగా ఉంది. ఇక నేనూ, శ్రేయస్‌ అయ్యర్‌ చాలా కాలంగా ఒకే ఫ్రాంఛైజీ తరఫున ఆడుతున్నందున మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం నెలకొంది’ అని పంత్‌ చెప్పుకొచ్చాడు.

వాళ్లిద్దరూ ఈసారి ఆడలేకపోయారు: శ్రేయస్‌

‘ఈ మ్యాచ్‌లో ఏం జరిగినా నేను క్రీజులో పాతుకుపోవాలని నిర్ణయించుకున్నా. బంతిని గమనిస్తూ ఫీల్డర్ల మధ్య నుంచి ఆడాలనుకున్నా. తర్వాత స్పిన్నర్లను టార్గెట్‌ చేద్దామనుకున్నా. అయితే, మా జట్టులో ధావన్‌, పృథ్వీ.. ఇద్దరూ దూకుడైన బ్యాట్స్‌మెన్‌. ఈసారి వాళ్లు ఆడలేకపోయారు. వాళ్లు బాగా ఆడితే జట్టుకు శుభారంభాలే అందిస్తారు. ఈ క్రమంలోనే వాళ్లు ఔటయ్యాక భాగస్వామ్యాలు జోడించాలనుకున్నా. పంత్‌ రాగానే ఇద్దరం అర్ధశతక భాగస్వామ్యం నెలకొల్పాం. అతడు వచ్చీ రాగానే బౌలర్లపై విరుచుకుపడితే మరో ఎండ్‌లో ఉండే నాకు ఉపశమనం లభిస్తుంది. ఇక గాయం నుంచి పూర్తిగా కోలుకోవడం సంతోషంగా ఉంది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు, స్పేహితులు అండగా నిలిచారు. ఇప్పుడు మైదానంలో రాణించడం బాగుంది’ అని శ్రేయస్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని