IPL 2021: కోల్‌కతా ప్లేఆఫ్స్‌ చేరుతుందా?

రాజస్థాన్‌తో తలపడే మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఆ జట్టు నేరుగా ప్లేఆఫ్స్‌ చేరే అవకాశం ఉంది....

Published : 07 Oct 2021 15:42 IST

రాజస్థాన్‌తో కీలక పోరు.. ప్రివ్యూ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ ప్లేఆఫ్స్‌ రేస్‌ ఆసక్తికరంగా మారింది. మూడు జట్లు ఇప్పటికే తమ స్థానాలను పదిలం చేసుకోగా మిగిలిన నాలుగో స్థానం కోసమే మిగతా జట్లు పోటీపడుతున్నాయి. ఇందులో 12 పాయింట్లతో ఉన్న కోల్‌కతా జట్టుకే మెరుగైన అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రాత్రి రాజస్థాన్‌తో తలపడే మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఆ జట్టు నేరుగా ప్లేఆఫ్స్‌ చేరే అవకాశం ఉంది. రన్‌రేట్‌ పరంగా ముంబయి కన్నా మెరుగ్గా ఉండటమే అందుకు కారణం. ఒకవేళ రాజస్థాన్‌ గెలిస్తే అప్పుడు మోర్గాన్‌ టీమ్‌.. ముంబయి, సన్‌రైజర్స్‌ ఫలితంపై ఆధారపడాలి. అయితే, రాజస్థాన్‌ గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే సంజూ టీమ్‌ ప్లేఆఫ్స్‌ చేరాలంటే కోల్‌కతాను 125 పరుగుల భారీ తేడాతో ఓడించడమే కాకుండా ముంబయిపై సన్‌రైజర్స్‌ టీమ్‌ 40 పరుగులతో గెలవాలి. ఇది అసంభవవమనే చెప్పొచ్చు.

కోల్‌కతానే ఫేవరెట్‌..

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో కోల్‌కతానే ఫేవరెట్‌గా కనిపిస్తోంది. ఎందుకంటే యూఏఈలో జరుగుతున్న రెండో దశలో కోల్‌కతా ఆరు మ్యాచ్‌లు ఆడగా నాలుగు విజయాలు సాధించి రెండు మ్యాచ్‌లు ఓటమిపాలైంది. మరోవైపు రాజస్థాన్‌ దీనికి పూర్తి భిన్నంగా రెండు మ్యాచ్‌లే గెలిచి నాలుగు ఓటములు చవిచూసింది. దీంతో మోర్గాన్‌ జట్టే బలంగా ఉంది. ఇక గత మ్యాచ్‌లోనూ కోల్‌కతా సన్‌రైజర్స్‌ను ఓడించడం విశేషం. అలాగే రాజస్థాన్‌ చివరి మ్యాచ్‌లో ముంబయి చేతిలో ఘోరంగా విఫలమైంది. దీంతో ఎలా చూసినా కోల్‌కతానే ఫేవరెట్‌గా ఉంది.

ఈ ఆటగాళ్లే కీలకం..

కోల్‌కతా జట్టు రెండో దశలో రాణించడానికి ముఖ్య కారణం టాప్‌ఆర్డర్‌ ఫామ్‌లోకి రావడం. వెంకటేశ్‌ అయ్యర్‌, నితీశ్‌ రాణా, శుభ్‌మన్‌గిల్‌, రాహుల్‌ త్రిపాఠి ఒకరుపోతే ఒకరు పరుగులు చేస్తూ జట్టును ముందుండి నడిపిస్తున్నారు. వీరికి తోడు బౌలింగ్‌లో వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌, షకిబ్‌ అల్‌ హసన్‌, లాకీ ఫెర్గూసన్‌ వికెట్లు తీసి మెరుస్తున్నారు. మరోవైపు రాజస్థాన్‌ ఆటగాళ్లలో నిలకడ లేమే ప్రధాన సమస్యగా మారింది. ఎవరు ఎప్పుడు ఎలా ఆడతారో అంచనా వేయలేని పరిస్థితి. ఒకవేళ ఆడితే యశస్వి జైశ్వాల్‌, కెప్టెన్‌ సంజూ శాంసన్‌లపైనే నమ్మకాలు పెట్టుకోవాలి. బౌలింగ్‌ పరంగా చేతన్‌ సకారియా మినహా ఆకట్టుకునే పరిస్థితి లేదు. దీంతో కోల్‌కతా విజయం సాధించి ప్లేఆఫ్స్‌ చేరేందుకు మార్గం సుగుమం చేసుకునేలా అనిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని