IPL 2021: దిల్లీ క్యాపిటల్స్‌ చేసిన  పెద్ద తప్పు అదే.. గంభీర్‌ ఏమన్నాడంటే?

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తప్పు చేసిందని, కీలక సమయంలో రబాడాకు బౌలింగ్‌ ఇవ్వకుండా మ్యాచ్‌ను కోల్పోయిందని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అభిప్రాయపడ్డాడు...

Published : 12 Oct 2021 01:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ తప్పు చేసిందని, కీలక సమయంలో రబాడాకు బౌలింగ్‌ ఇవ్వకుండా మ్యాచ్‌ను కోల్పోయిందని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ పేర్కొన్నాడు. ఆదివారం రాత్రి జరిగిన ఈ కీలక పోరులో ధోనీసేన రెండు బంతులు మిగిలి ఉండగా 173 పరుగుల లక్ష్య ఛేదనను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్‌లో ఆ జట్టు తొమ్మిదోసారి ఫైనల్‌ చేరింది. మ్యాచ్‌ అనంతరం ఓ క్రీడా ఛానెల్‌తో మాట్లాడిన గంభీర్‌ దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ చివర్లో తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్లే ఆ జట్టు ఓటమిపాలైందని చెప్పాడు.

‘రబాడ లాంటి కీలక పేసర్‌ను 19వ ఓవర్‌లో బౌలింగ్‌ చేయించకపోవడమే దిల్లీ క్యాపిటల్స్‌ చేసిన అతిపెద్ద తప్పు. అవేశ్‌ఖాన్‌ ఆ ఓవర్‌ తొలి బంతికి రుతురాజ్‌ గైక్వాడ్‌(70) లాంటి కీలక బ్యాట్స్‌మన్‌ వికెట్‌ తీసినా నేను మాత్రం రబాడ బౌలింగ్‌కే మొగ్గు చూపేవాడిని’ అని గంభీర్‌ పేర్కొన్నాడు. కాగా, అవేశ్‌ వేసిన ఆ ఓవర్‌లో చెన్నై 11 పరుగులు సాధించింది. మొయిన్‌ అలీ (16) ఒక బౌండరీ బాదగా ధోనీ(18) ఒక సిక్సర్‌ సాధించాడు. దీంతో చివరి ఓవర్‌లో ఆ జట్టు విజయానికి 13 పరుగులే అవసరమయ్యాయి. ఆ సమయంలోనే టామ్‌కరన్‌ వేసిన చివరి ఓవర్‌ ధోనీ మూడు ఫోర్లు బాది జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు రాబిన్‌ ఉతప్ప (63) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. రుతురాజ్‌తో కలిసి రెండో వికెట్‌కు 110 పరుగులు జోడించాడు. అయితే, ఉతప్పను మూడో స్థానంలో బరిలోకి దించడం ధోనీ తీసుకున్న మంచి నిర్ణయమని గంభీర్‌ కొనియాడాడు. ఈ విషయంలో క్రెడిటంతా చెన్నై సారథికే దక్కుతుందని చెప్పాడు. మూడో స్థానంలో మొయిన్‌ అలీని పంపే అవకాశం ఉన్నా మహీ ఉతప్పను పంపాడన్నాడు. అతడిపై ధోనీకి అంత నమ్మకం ఉందన్నాడు. మరోవైపు ఈ కర్ణాటక బ్యాట్స్‌మన్‌కు సైతం ఎప్పుడూ టాప్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయాలంటే ఇష్టమని తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని