Updated : 11/10/2021 09:33 IST

IPL 2021: నేను ఈ సీజన్‌లో బాగా ఆడలేదు.. అందుకే ఇలా: ధోనీ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐపీఎల్ 14వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తొమ్మిదోసారి ఫైనల్‌ చేరడంపై ఆ జట్టు సారథి మహేంద్రసింగ్‌ ధోనీ హర్షం వ్యక్తం చేశాడు. ఆదివారం రాత్రి దిల్లీ క్యాపిటల్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో చెన్నై రెండు బంతులు మిగిలుండగానే విజయం సాధించిన సంగతి తెలిసిందే. ధోనీ (18 నాటౌట్‌; 6 బంతుల్లో 3x4, 1x6) మునుపటిలా ఫినిషర్‌ పాత్ర పోషించి మ్యాచ్‌ను గెలిపించిన తీరు అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్‌ అనంతరం మాట్లాడిన చెన్నై సారథి.. ఈ సీజన్‌లో తాను పెద్దగా బ్యాటింగ్‌ చేయలేదని.. అందుకే ఆ వెలితి నుంచి బయటపడాలని ఇలా ఆడానని చెప్పాడు.

‘ఈ మ్యాచ్‌లో నేను ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. బంతిని చూసి షాట్లు ఆడానంతే. ఈ టోర్నీలో నేను పెద్దగా రాణించలేదు. అందుకే ఆ పరిస్థితుల నుంచి బయటపడాలనుకున్నా. బంతి ఎక్కడ పడుతుంది, బౌలర్‌ ఎలాంటి వేరియేషన్లతో వస్తున్నాడు.. అనేవి ఆలోచించి ఆడానంతే. అలా కాకుండా ఇతర విషయాలు గురించి ఆలోచిస్తే బ్యాటింగ్‌పై దృష్టిపెట్టలేను’ అని అన్నాడు. ఇక జడేజా కన్నా ఇతరులను ముందు పంపడంపై మాట్లాడుతూ.. ‘మా జట్టులో తొమ్మిదో స్థానంలో వచ్చే దీపక్‌ చాహర్‌ వరకూ బ్యాటింగ్‌ చేయగలరు. ఇటీవలి కాలంలో శార్దూల్‌తో పాటు దీపక్‌ కూడా బాగా ఆడుతున్నాడు. సహజంగా ఏ బ్యాట్స్‌మన్‌ అయినా క్రీజులోకి వెళ్లగానే తొలి బంతినే బౌండరీగా మలచడానికి ఒకటి రెండుసార్లు ఆలోచిస్తాడు. కానీ, వీళ్లిద్దరూ అలా కాదు. తొలి బంతి నుంచే ఎదురుదాడి చేయాలనుకుంటారు. వాళ్లు కనీసం ఒకటి, రెండు బౌండరీలు సాధించినా మాకు మంచిదే. ఎందుకంటే ఇటీవలి కాలంలో జట్ల మధ్య 15-20 పరుగుల తేడానే ఉంటుంది. రాబిన్‌ ఉతప్ప టాప్‌ ఆర్డర్‌లో ఆడాలని ఆశిస్తాడు. అందుకే అతడిని పంపించాం. ఇంతకుముందు మొయిన్‌ అలీ మూడో స్థానంలో బాగా ఆడాడు’ అని ధోనీ చెప్పుకొచ్చాడు.

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ రుతురాజ్‌ (70; 50 బంతుల్లో 5x4, 2x6)పై స్పందిస్తూ.. ‘రుతురాజ్‌ 20 ఓవర్ల పాటు ఆడాలని అనుకుంటాడు. ఈ సీజన్‌లో ఒక మ్యాచ్‌ తర్వాత తనతో కలిసి మాట్లాడినప్పుడు.. ఓపెనర్‌గా నీకు శుభారంభం దక్కితే 10-12 ఓవర్లే బ్యాటింగ్‌ చేయాలనే నియమాలేవీ లేవు. వీలైతే 20 ఓవర్లపాటు క్రీజులో కొనసాగాలని చెప్పా. దీంతో తర్వాతి మ్యాచ్‌లోనే ఆఖరి బంతి వరకూ నిలబడి సెంచరీ చేశాడు. దీన్ని బట్టి అతడు కొత్త విషయాలను నేర్చుకోవాలనే కుతూహలంతో ఉన్నాడని అర్థమవుతోంది. తన షాట్లు కూడా కచ్చితత్వంతో ఉంటాయి. ఎంతో నైపుణ్యమున్న ఆటగాడు’ అని కెప్టెన్‌ కొనియాడాడు. చివరగా చెన్నై ఫైనల్‌ చేరడంపై మాట్లాడిన ధోనీ.. ఇది జట్టు సమష్టి కృషి అని అన్నాడు. గతేడాది ప్లేఆఫ్స్‌కు చేరకపోవడం బాధ కలిగించిందని, అప్పుడు భావోద్వేగానికి కూడా గురయ్యానని చెప్పాడు. ప్రస్తుతం  ఫైనల్‌పై దృష్టిసారించామన్నాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని