India Women: పాపం..! ఆస్ట్రేలియాలో మహిళా క్రికెటర్ల ‘ఇరుకు’ కష్టాలు

టీమ్‌ఇండియా అమ్మాయిలు ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌ కష్టాలు పడుతున్నారు! చాలీచాలని ఇరుకు గదుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు....

Published : 04 Sep 2021 01:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా అమ్మాయిలు ఆస్ట్రేలియాలో క్వారంటైన్‌ కష్టాలు పడుతున్నారు! చాలీచాలని ఇరుకు గదుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం తమ పడక నుంచి పక్కకు నడిచేంత చోటూ లేకపోవడం మానసికంగా వారిపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు.

ప్రస్తుతం భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. అక్కడి ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఫలితంగా అమ్మాయిలు కఠిన క్వారంటైన్‌ కష్టాలు అనుభవిస్తున్నారు. ఈ 14 రోజులు వారు ఇరుకు హోటల్‌ గదుల్లోనే ఉండాల్సి వస్తోంది. కనీసం కసరత్తులు చేసేందుకూ అవకాశం ఉండటం లేదు.

‘ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ గదులు ఇరుకుగా ఉన్నాయి. పడక నుంచి పక్కకు నడవడం, తేలికపాటి కసరత్తులు చేయడమూ కష్టమే. బ్రిటన్‌లో మాదిరిగా బయట భద్రతా సిబ్బందేమీ ఉండటం లేదు. కానీ నిబంధనలు మాత్రం కఠినంగా ఉన్నాయి. రోజూ ఆహార పదార్థాల జాబితా మారుస్తున్నారు. రుచి, నాణ్యత ఫర్వాలేదు! ఏదేమైనా ఈ రెండు వారాలు కఠిన సవాలే’ అని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు.

కొన్నాళ్ల క్రితమే టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌లో పర్యటించింది. అక్కడ సదుపాయాలు, నిబంధనలు బాగున్నాయి. మొదట అమ్మాయిలు ముంబయిలోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆ తర్వాత బ్రిటన్‌కు వెళ్లారు. అక్కడ క్వారంటైన్‌లో ఉన్నా బయటకు వచ్చి కసరత్తులు చేసుకొనేందుకు, సాధన చేసేందుకు అవకాశం దొరికింది. ఆస్ట్రేలియాలో మాత్రం అలా లేదు.

కొవిడ్‌ నిబంధనల వల్ల వేదికలు మారాయి. సిడ్నీ, పెర్త్‌, మెల్‌బోర్న్‌లో నిబంధనలు కఠినతరం చేశారు. ఫలితంగా అమ్మాయిలు సోమవారం బ్రిస్బేన్‌కు చేరుకున్నారు. మూడు వన్డేలు, మూడు టీ20లు, ఒక డే/నైట్‌ టెస్టును క్వీన్స్‌లాండ్‌లోనే ఆడనున్నారు. ఈ నెల ఆఖరి వారంలో మ్యాచులు మొదలవుతాయి.

మహిళల కోచ్‌ రమేశ్‌ పొవార్‌ క్వారంటైన్‌ గురించి ఓ ట్వీట్‌ చేశాడు. ‘కిటికీలు ఉన్నంత కాలం జీవితం ఆసక్తికరంగానే ఉంటుంది’ అని దానికో వ్యాఖ్య పెట్టాడు. కాగా ఒక ప్రైవేట్‌ హోటల్లో క్వారంటైన్‌ ఎందుకు ఏర్పాటు చేయించలేదని బీసీసీఐని అభిమానులు విమర్శిస్తున్నారు. అమ్మాయిలపై వివక్ష ఎందుకని ప్రశ్నిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని