Tokyo Olympics: ‘మాగ్నిఫిసెంట్‌ మేరీ’ నిష్క్రమణ.. ఓటమి భారంతో విలవిలా ఏడ్చేసిన విజేత!

భారత అగ్రశ్రేణి బాక్సర్‌, ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ మేరీకోమ్‌ టోక్యో ఒలింపిక్స్‌ నుంచి నిష్క్రమించింది. 48-51 కిలోల విభాగంలో జరిగిన ప్రి క్వార్టర్‌ ఫైనల్లో ఆమె పోరాడి ఓడింది. కొలంబియాకు చెందిన వలెన్షియా విక్టోరియా...

Updated : 29 Jul 2021 16:56 IST

ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌.. ఐదు సార్లు ఆసియా విజేత.. ఒలింపిక్స్‌లో కాంస్యం.. 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌.. భారతమాత ముద్దుబిడ్డ.. ప్రపంచం మెచ్చిన ‘మాగ్నిఫిసెంట్‌ మేరీ’..

ఆమె వీడ్కోలుపై ఎన్నెన్నో ఊహాగానాలు..51 కిలోల విభాగంలో ఆమెవల్ల యువతకు అవకాశాలు రావడం లేదని విమర్శలు.. 38 ఏళ్లు.. ఈ వయసులో బాక్సింగ్‌ ఏమంత సులువు కాదు..

బాక్సింగ్‌ ప్రపంచంలో ఎన్నో అపూర్వ విజయాలు అందుకున్న మేరీ సాధించాల్సింది మరేం లేదు! అయినా ఆమె ఓ కలగన్నది. టోక్యోలో స్వర్ణపతకం గెలిచి భరతమాత మెడలో అలంకరించాలని ఆశించింది..

విధి ఆమెకు అడ్డు తగిలింది.. తనలాగే.. తన దేశానికి మరో పతకం తీసుకురావాలని.. ఆ దేశం తరఫున తొలి పతకం గెలిచిన  మరో సీనియర్‌ బాక్సర్‌ చేతిలో మేరీ ఓటమి పాలైంది. ఆ భారంతో బాక్సింగ్‌ రింగ్‌లోనే విలపించింది. కన్నీరు కార్చింది. ఇక ఆమె వీడ్కోలు పలికినట్టే!

మహిళల బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ మేరీకోమ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టోక్యో ఒలింపిక్స్‌ ప్రిక్వార్టర్స్‌లోనే ఆమె నిష్క్రమించింది. 51 కిలోల విభాగంలో రియో కాంస్యపతక విజేత, కొలంబియాకు చెందిన వలెన్షియా విక్టోరియా ఇంగ్రిట్‌ లొరనా చేతిలో 2-3 తేడాతో పరాజయం చవిచూసింది. హోరాహోరీగా సాగిన పోరు చివర్లో రిఫరీ తన ప్రత్యర్థి చేయి పైకెత్తగానే మేరీ ఒకపక్క నవ్వుతూనే.. తన బాధను భరించలేక ఏడ్చేసింది.

వీరిద్దరి మధ్య పోరు ఆరంభమవ్వగానే బాక్సింగ్‌ రింగులో ఓల్టేజీ తారస్థాయికి చేరుకుంది. ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డారు. పాయింట్ల కోసం శ్రమించారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దుల వర్షం కురిపించసాగారు. తొలిరౌండ్లో త్రుటిలో వలెన్షియాకు ఆధిక్యం దక్కింది. ఐదుగురు జడ్జీలు ఆమెకు 49 పాయింట్లు ఇవ్వగా మేరీకోమ్‌కు 46 మాత్రమే కేటాయించారు. దాంతో 4-1తో వలెన్షియా ముందంజ వేసింది.

ఆ తర్వాతి రెండు రౌండ్లలో భారత బాక్సర్‌ విజృంభించింది. తన అనుభవాన్ని ఉపయోగించి పంచ్‌లు విసిరింది. ప్రత్యర్థి సైతం అదే రీతిలో చెలరేగినా 3-2 తేడాతో రెండు రౌండ్లనూ గెలిచింది. అయితే తొలిరౌండ్లో వలెన్షియాకు స్వల్ప ఆధిక్యం ఉండటంతో మేరీకోమ్‌ ఓటమి పాలైంది. మొత్తంగా ఈ పోరులో 27-30, 28-29, 30-27, 28-29, 29-28 తేడాతో పరాజయం చవిచూసింది. బహుశా ఇక ఆమె కెరీర్‌ ముగిసినట్టే! 

2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ క్వార్టర్స్‌లో వలెన్షియాను ఓడించిన మేరీకోమ్‌ ఒలింపిక్స్‌ ప్రిక్వార్టర్లో ఆమె చేతిలోనే ఓటమి చెందాల్సి వచ్చింది. కొలంబియా తరఫున ఒలింపిక్స్‌లో తొలి పతకం గెలిచిన మహిళా బాక్సర్‌ వలెన్షియానే కావడం గమనార్హం.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని