IND vs NZ: భువీకి విశ్రాంతినిచ్చి అవేశ్‌ను తీసుకోండి: గంభీర్

న్యూజిలాండ్‌తో ఆదివారం రాత్రి జరగబోయే మూడో టీ20లో టీమ్‌ఇండియా భువనేశ్వర్‌కుమార్‌కు విశ్రాంతినిచ్చి అవేశ్‌ ఖాన్‌ను తీసుకోవాలని మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ సూచించాడు...

Published : 21 Nov 2021 12:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌తో ఆదివారం రాత్రి జరగబోయే మూడో టీ20లో టీమ్‌ఇండియా భువనేశ్వర్‌కుమార్‌కు విశ్రాంతినిచ్చి అవేశ్‌ ఖాన్‌ను తీసుకోవాలని మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ సూచించాడు. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకున్న టీమ్‌ఇండియా చివరి మ్యాచ్‌లో పలు ప్రయోగాలు చేసే అవకాశం ఉంది. అవకాశాలు రాని ఆటగాళ్లను ఈ మ్యాచ్‌లో ఆడించే వీలుంది. ఈ నేపథ్యంలోనే ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడిన గౌతీ తన అభిప్రాయం పంచుకున్నాడు.

‘బౌలింగ్‌ బృందంలో భువీని తొలగించి అవేశ్‌ను ప్రయత్నించొచ్చు. ఆ వికెట్‌ అతడికి సరిపోతుంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో పేస్‌, బౌన్స్‌కు మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి కచ్చితంగా ఈ మ్యాచ్‌లో నేను అవేశ్‌ను చూడాలనుకుంటున్నా. ఇప్పటికే సిరీస్‌ గెలిచిన పరిస్థితుల్లో అతడికి అవకాశం ఇచ్చి చూడాలి. అతడు అంతర్జాతీయ మ్యాచ్‌లో ఎలా ఆడతాడో గమనించాలి. అయితే.. ఈ మ్యాచ్‌ను అంత తేలిగ్గా తీసుకోవద్దు. ఇందులోనూ విజయం సాధించి 3-0తో నిలవాలి. ఒత్తిడికి గురికావొద్దు’ అని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు. కాగా, అవేశ్‌ ఇటీవల పూర్తయిన ఐపీఎల్‌ 2021లో మొత్తం 24 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. దీంతో ఆ టోర్నీలో రెండో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే కివీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైన అతడు ఇంకా అరంగేట్రం చేయలేదు. ఈరోజు అతడిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం లేకపోలేదు.

Read latest Sports News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు