2016 Rio Olympics: ఆ ఒలింపిక్స్‌ బౌట్లు ఫిక్స్‌

2016 రియో ఒలింపిక్స్‌లో డబ్బు కోసం, ఇతర ప్రయోజనాల కోసం 10కి పైగా బాక్సింగ్‌ బౌట్ల ఫలితాలను తారుమారు చేశారనే సంచలన విషయం బయటకు వచ్చింది...

Published : 02 Oct 2021 01:46 IST

దిల్లీ: 2016 రియో ఒలింపిక్స్‌లో డబ్బు కోసం, ఇతర ప్రయోజనాల కోసం 10కి పైగా బాక్సింగ్‌ బౌట్ల ఫలితాలను తారుమారు చేశారనే సంచలన విషయం బయటకు వచ్చింది. అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం (ఏఐబీఏ) నియమించిన మెక్‌లారెన్‌ గ్లోబల్‌ స్పోర్ట్స్‌ సొల్యూషన్స్‌ (ఎమ్‌జీఎస్‌ఎస్‌) సంస్థ చేపట్టిన స్వతంత్ర దర్యాప్తుతో ఇది వెలుగులోకి వచ్చింది. తమ విచారణకు సంబంధించిన తొలి దశ నివేదికను ఏఐబీఏకు ఈ సంస్థ అందించింది. దాని ప్రకారం రెండు ఫైనల్స్‌ సహా మొత్తం 14 బౌట్ల ఫలితాలలో ఇలా అక్రమాలు జరిగినట్లు ఆ నివేదిక పేర్కొంది. 2012 లండన్‌ ఒలింపిక్స్‌ కంటే ముందే ఈ కుట్రకు అడుగులు పడ్డాయని, 2016 క్రీడల అర్హత రౌండ్లలో ట్రయల్‌ కూడా చేశారని తెలిసింది. అవినీతిపరులైన రిఫరీలు, న్యాయనిర్ణేతలు, డ్రా కమిషన్‌ అందులో భాగమయ్యారని నివేదిక వెల్లడించింది. అప్పటి ఏఐబీఏ అధ్యక్షుడు చింగ్‌ దీనికి బాధ్యత వహించాల్సి ఉందని పేర్కొంది. ఆ ఒలింపిక్స్‌లో ముఖ్యంగా రెండు బౌట్లలో వచ్చిన ఫలితాలు ఈ అవినీతి వ్యవస్థకు నిదర్శనంగా నిలిచాయి. బాంటమ్‌వెయిట్‌ క్వార్టర్స్‌లో రష్యా బాక్సర్‌ వ్లాదిమిర్‌పై పిడిగుద్దులతో విరుచుకుపడ్డప్పటికీ ప్రపంచ ఛాంపియన్‌ మైకెల్‌ను ఓడిపోయాడని ప్రకటించడంతో అతను రిఫరీ, న్యాయ నిర్ణేతలను దూషించాడు. హెవీవెయిట్‌ పసిడి పోరులో లెవిట్‌ (కజకిస్థాన్‌) ఆధిపత్యం ప్రదర్శించినా గెలవలేకపోయాడు. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) నుంచి తిరిగి గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్న ఏఐబీఏ ఈ నివేదిక నేపథ్యంలో రిఫరీలు, న్యాయ నిర్ణేతల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వచ్చే నెల 24న సెర్బియాలో ఆరంభమయ్యే ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌ కోసం రిఫరీలు, న్యాయ నిర్ణేతలు, సాంకేతిక ప్రతినిధుల ఎంపికలో ప్రమాణాలు, నేపథ్యం లాంటి విషయాలను ఇప్పుడు ఎమ్‌జీఎస్‌ఎస్‌ చూసుకోనుంది. ఈ కుట్రకు కారణమైన వాళ్లపై తగిన చర్యలు తీసుకోవడం కోసం న్యాయ సలహాలు తీసుకుంటామని ఏఐబీఏ అధ్యక్షుడు ఉమర్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు