Updated : 19/11/2021 23:44 IST

T20: కివీస్‌పై ఘన విజయం.. సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్‌ 

 

రాంచీ:  కొత్త కోచ్‌.. నూతన సారథ్యం.. అసలే టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరలేదనే అపవాదు. ఆ టోర్నీలోనే కివీస్‌పై ఓటమి.. విరాట్‌ కోహ్లీ, బుమ్రా, షమీ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు విశ్రాంతి.. ఈ నేపథ్యంలో భారత కుర్రాళ్లు అదరగొట్టేశారు. మూడు టీ20ల సిరీస్‌ను 2-0తేడాతో కైవసం చేసుకున్నారు. తొలి టీ20 మ్యాచ్‌లో ఆఖరి వరకు టెన్షన్ పెట్టినా... రెండో మ్యాచ్‌లో మాత్రం పట్టువిడవనీయకుండా విజయాన్ని ఒడిసి పట్టారు. మరోవైపు కివీస్‌ కూడా కీలక ఆటగాళ్లు లేకపోయినా ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ సాధ్యమైనంత వరకు గట్టిపోటీనే ఇచ్చింది. ఇక ఆఖరి మ్యాచ్‌ నవంబర్ 21న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరగనుంది. ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్, నూతన టీ20 జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మలకిది తొలి సిరీస్‌ విజయం కావడం విశేషం. 

టాస్‌ నెగ్గిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకుని కివీస్‌కు బ్యాటింగ్ అప్పగించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. అనంతరం భారత్‌ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 17.2 ఓవర్లలో 155 పరుగులు చేసి లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (65 పరుగులు: 6X4, 2X6), రోహిత్ శర్మ (55 పరుగులు: 1X4, 5X6)) రాణించారు. సూర్యకుమార్‌ యాదవ్‌ (1) విఫలం కాగా.. వెంకటేశ్‌ అయ్యర్ 12, రిషభ్‌ పంత్‌ 12* పరుగులు చేశారు. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ మూడు వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 450 సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ అరుదైన రికార్డు సృష్టించాడు.

మెరిసిన అరంగేట్ర బౌలర్‌

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌కు ఆరంభంలో భారత బౌలర్లు ఇబ్బందిపెట్టలేకపోయారు. ఓపెనర్లు మార్టిన్‌ గప్తిల్ (31), డారిల్ మిచెల్ (31) ఇద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.  అయితే వారితోపాటు చాప్‌మన్‌ (21) ఔట్‌ కావడంతో వేగం మందగించింది. మిడిలార్డర్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (34) ధాటిగా ఆడటంతో న్యూజిలాండ్‌ 150 పరుగులనైనా దాటగలిగింది. సీఫర్ట్‌ 13, నీషమ్ 3,  సాట్నర్ 8*, మిల్నే 5* పరుగులు చేశారు. కివీస్‌ బ్యాటర్లలో కీలకంగా మారిన డారిల్ మిచెల్‌, ఫిలిప్స్‌ వికెట్లను భారత అరంగేట్ర బౌలర్ హర్షల్‌ పటేల్ (2/25) తీసి తన సత్తా చాటాడు. దీంతో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. మిగతా బౌలర్లలో అక్షర్‌ (1/26), అశ్విన్‌(1/19) రాణించగా.. భువనేశ్వర్‌ (1/39), దీపక్‌ చాహర్ (1/42) భారీగా పరుగులు సమర్పించారు.

నమోదైన రికార్డులు

* 50 స్కోరు కంటే ఎక్కువ నమోదైన సందర్భాలు: కోహ్లీ (29), రోహిత్ శర్మ (29: ఇందులో నాలుగు శతకాలు), బాబర్ అజామ్‌ (25), డేవిడ్ వార్నర్ (22)

* ఇతర బ్యాటర్‌తో కలిసి శతక భాగస్వామ్యాలు జోడించడంలో రోహిత్ శర్మ (13 సార్లు), బాబర్‌ అజామ్‌ (12), మార్టిన్‌ గప్తిల్ (12), డేవిడ్ వార్నర్ (11)

* అత్యధిక శతక భాగస్వామ్యాలు: బాబర్‌-రిజ్వాన్ (22 ఇన్నింగ్స్‌ల్లో 5 సార్లు), రోహిత్-కేఎల్ రాహుల్ (27 ఇన్నింగ్స్‌ల్లో 5 సార్లు)

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని