U-19 World Cup: ఐర్లాండ్‌పై యువభారత్‌ భారీ విజయం

అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ దుమ్మురేపుతోంది. తొలిమ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికాను చిత్తుచేసిన యువ భారత్‌ తాజాగా పసికూన ఐర్లాండ్‌ను 174 పరుగుల తేడాతో మట్టికరిపించింది.

Updated : 20 Jan 2022 16:03 IST

టరౌబా(ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో): అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ దుమ్మురేపుతోంది. తొలిమ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికాను చిత్తుచేసిన యువ భారత్‌ తాజాగా పసికూన ఐర్లాండ్‌ను 174 పరుగుల తేడాతో మట్టికరిపించింది. కరోనా కలకలంతో కెప్టెన్‌ యశ్‌దుల్‌ సహా కీలక ఆటగాళ్లు బరిలోకి దిగకున్నా.. నిశాంత్‌ సింధు నేతృత్వంలో భారత జట్టు మొదట బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. ఓపెనర్లు హర్నూర్‌ సింగ్‌(88), రఘువంశీ(79) అర్ధశతకాలతో చెలరేగారు. తొలివికెట్‌కు 164 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గట్టి పునాది వేశారు. ఇక మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రాజ్‌ బవ(42), నిశాంత్‌ సింధు(36), రాజ్‌వర్ధన్‌(39) రాణించడంతో భారత్‌ 300 పైచిలుకు పరుగులు చేసింది. అనంతరం 308 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన ఐర్లాండ్‌ 39 ఓవర్లలో 133 పరుగులకే చాపచుట్టేసింది. దీంతో భారత్‌ 174 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్ల సమష్ఠిగా బౌలింగ్‌ చేశారు. సంగ్వాన్‌, అనీశ్వర్‌ గౌతమ్‌, కౌషల్‌ తంబే తలో రెండు వికెట్లు తీయగా, విక్కీ ఓస్వాల్‌, రవికుమార్‌, రాజవర్ధన్‌ తలో వికెట్‌ తీశారు. హర్నూర్‌ సింగ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది అవార్డు వచ్చింది. 

బెంబేలెత్తిన ఐర్లాండ్‌..

భారత బౌలర్ల పదునైన బంతులకు ఐర్లాండ్‌ బెంబేలెత్తింది. 308 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ ఏ దశలోనూ విజయం దిశగా ఇన్నింగ్స్‌ను నడిపించలేదు. 10 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 17 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయిన ఆజట్టు 66 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆ జట్టు దాదాపు ఓటమిని అంగీకరించినట్లైంది. ఆ జట్టులో స్కాట్‌ మెక్‌బెత్‌(32) టాప్‌స్కోరర్‌. 

 

 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని