T20 World Cup: దంచేసిన దక్షిణాఫ్రికా.. ఇంగ్లాండ్‌ ముందు భారీ లక్ష్యం

టీ20 ప్రపంచకప్‌ 2021లో ఇప్పటి వరకు ఓటమిని చవిచూడని ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఉగ్రరూపం దాల్చారు. టాస్‌ నెగ్గిన ఇంగ్లాండ్‌ మొదట బౌలింగ్‌ ఎంచుకుంది

Updated : 06 Nov 2021 21:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటి వరకు ఓటమిని చవిచూడని ఇంగ్లాండ్‌పై దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఉగ్రరూపం దాల్చారు. టాస్‌ నెగ్గిన ఇంగ్లాండ్‌ మొదట బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో ఇంగ్లాండ్‌ ముందు 190 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సౌతాఫ్రికా ఓపెనర్‌ హెడ్రిక్స్‌ (2) విఫలమైనా.. ఆ ప్రభావం స్కోరు బోర్డు మీద పడలేదు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన డస్సెన్ (94*: ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్లు) మరో ఓపెనర్‌ డికాక్‌ (34) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. వీరిద్దరూ కలిసి 71 పరుగుల జోడించారు.

డికాక్‌ పెవిలియన్‌కు చేరిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మారక్రమ్‌ (52: రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అగ్నికి వాయువు తోడైనట్లు డస్సెన్‌తో కలిసి వీరవిహారం చేశాడు. ఈ క్రమంలో వీరిద్దరూ 52 బంతుల్లోనే శతకం భాగస్వామ్యం (103) నిర్మించారు. ఇంగ్లాండ్‌ బౌలర్లు క్రిస్‌ వోక్స్‌ (4-0-43-0), మార్క్‌ వుడ్ (4-0-47-0), క్రిస్‌ జొర్డాన్‌ (4-0-36-0) ప్రభావం చూపలేకపోయారు. మొయిన్‌ అలీ (4-0-27-1), అదిల్‌ రషీద్‌ (4-0-32-1) మాత్రమే వికెట్లు తీయగలిగారు. ఇప్పటికే ఇంగ్లాండ్‌ సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకోగా.. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్‌ గెలిస్తే ఆసీస్ నేరుగా సెమీస్‌కు వెళ్లిపోతుంది. ఒకవేళ దక్షిణాఫ్రికా గెలిస్తే.. అప్పుడు రెండో సెమీస్‌ స్థానం కోసం నెట్‌రన్‌రేట్‌ కీలకమవుతుంది. ఇంగ్లాండ్‌ను 130 పరుగులకే కట్టడి చేసి సౌతాఫ్రికా విజయం సాధిస్తే సెమీస్‌లోకి అడుగుపెడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని