T20 World Cup: బంగ్లాపై ఘన విజయం.. రెండో స్థానానికి ఆసీస్‌

దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ...

Published : 05 Nov 2021 01:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై భారీ విజయంతో ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. సూపర్‌ 12 గ్రూప్‌-1 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్‌ (8) సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకోగా.. రెండో స్థానం కోసం నాలుగేసి మ్యాచుల్లో మూడు విజయాలు, ఒక ఓటమితో దక్షిణాఫ్రికా (6), ఆస్ట్రేలియా (6) పోటీ పడుతున్నాయి. ఉత్తమ రన్‌రేట్‌తో ఆసీస్‌ రెండో స్థానానికి చేరుకుంది. ఇక తమ ఆఖరి మ్యాచ్‌లో సౌతాఫ్రికా-ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా-వెస్టిండీస్‌ తలపడతాయి. ఒక్క విజయం లేకుండానే బంగ్లాదేశ్‌ (0) టోర్నీ నుంచి నిష్ర్రమించింది. 

దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లా 73 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ బౌలర్‌ ఆడమ్ జంపా (5/19) దెబ్బకు బంగ్లా హడలెత్తిపోయింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ రెండు వికెట్ల నష్టపోకుండా 6.2 ఓవర్లలో ఛేదించి విజయం సాధించింది. దీంతో రన్‌రేట్‌ను పెంచుకుంది. ఛేదనను ఆసీస్‌ ఓపెనర్లు కెప్టెన్‌ ఆరోన్ ఫించ్‌ (40), డేవిడ్ వార్నర్‌ (18) ధాటిగా ఆరంభించారు. తొలి వికెట్‌కు అర్ధశతకం (58) భాగస్వామ్యం నిర్మించారు. అయితే ఇద్దరిని స్వల్ప వ్యవధిలో ఔట్‌ చేయడం మినహా బంగ్లా బౌలర్లు సాధించేదేమీ లేదు. అనంతరం వచ్చిన మిచెల్‌ మార్ష్ (16*), మ్యాక్స్‌వెల్‌ (0*) ఇంకో వికెట్‌ పడనీయకుండా 78 పరుగులు చేసి లక్ష్యాన్ని పూర్తి చేశారు. బంగ్లా బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్, ఇస్లామ్‌ చెరో వికెట్ పడగొట్టారు. 

జంపా దెబ్బకు విలవిల

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఏదీ కలిసిరాలేదు. తొలుత స్టార్క్‌, హేజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ఇబ్బంది పడిన బంగ్లా బ్యాటర్లు.. తర్వాత వచ్చిన ఆడమ్‌ జంపా (5/19)కు దాసోహమన్నారు. వెంటవెంటనే వికెట్లను కోల్పోవడం మినహా ఒక్కరూ క్రీజ్‌లో నిలబడలేకపోయారు. బంగ్లా బ్యాటర్లలో నలుగురు డకౌట్‌గా వెనుదిరిగారు. లిటన్‌ దాస్‌,  హుస్సేన్‌, హసన్‌, ఇస్లామ్‌ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరారు. మిగతావారిలో నయీమ్‌ 17, సౌమ్య సర్కార్‌ 5, ముష్ఫికర్‌ రహీమ్‌ 1, మహమ్మదుల్లా 16, షమీమ్‌ 19, తస్కిన్‌ 6*, ముస్తాఫిజర్‌ 4 పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో జంపా 5, స్టార్క్‌ 2, హేజిల్‌వుడ్ 2, మ్యాక్స్‌వెల్‌ ఒక వికెట్ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని