T20 World Cup: బంగ్లాదేశ్‌పై ఇంగ్లాండ్‌ అలవోక విజయం 

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జేసన్‌ రాయ్ (61; 38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు),

Updated : 27 Oct 2021 18:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జేసన్‌ రాయ్ (61; 38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), డేవిడ్ మలన్‌ (28; 25 బంతుల్లో 3 ఫోర్లు) రాణించడంతో బంగ్లాదేశ్ నిర్దేశించిన 125 పరుగుల లక్ష్యాన్ని 14.1 ఓవర్లలోనే ఇంగ్లాండ్‌ ఛేదించింది. తొలుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టడి చేసిన ఇంగ్లాండ్‌ జట్టు.. బ్యాటింగ్‌లోనూ సత్తా చాటింది. ఇంకా ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఊదేసింది.

బంగ్లాదేశ్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు ఆరంభంలో ఓపెనర్ జోస్ బట్లర్ (18) రూపంలో షాక్‌ తగిలింది. ఐదో ఓవర్‌లో అతడు వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్‌ రాయ్‌ క్రీజులో కుదురుకోవడం, మలన్‌ అతడికి తోడవ్వడం విజయం కోసం ఆ జట్టు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇస్లామ్‌ వేసిన 13వ ఓవర్లో రాయ్‌ ఔటైనప్పటికీ  ఆ తర్వాత వచ్చిన బెయిర్‌స్టో (8)తో కలిసి మలన్‌ జట్టుకు విజయాన్ని అందించాడు. బంగ్లా బౌలర్లలో ఇస్లామ్‌, నసూమ్‌ తలో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. ముష్ఫికర్‌ రహీమ్ (29) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన లిటన్‌ దాస్ (9), మహమ్మద్‌ నయీమ్‌ (5) విఫలమయ్యారు. ఆ తర్వాత వచ్చిన షకీబ్‌-అల్-హసన్‌ (4) కూడా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసేలోపే ఆ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ముష్ఫికర్‌ రహీమ్‌, మహమ్మదుల్లా (19) నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే లివింగ్‌ స్టోన్ వేసిన 11వ ఓవర్లో రహీమ్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 15వ ఓవర్లో మహ్మదుల్లా క్రిస్‌ వోక్స్‌కి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. మెహెదీ హసన్‌ (11), అఫీఫ్‌ హొస్సేన్‌ (5) ఆకట్టుకోలేకపోయారు. ఆఖర్లో వచ్చిన నురుల్ హసన్‌ (16), నసూమ్‌ అహ్మద్‌ (19) ధాటిగా ఆడటంతో బంగ్లాదేశ్ ఆ మాత్రం పరుగులైనా చేయగలిగింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో టైమల్‌ మిల్స్‌ మూడు, మొయిన్ అలీ రెండు, లివింగ్‌ స్టోన్ రెండు‌, క్రిస్‌ వోక్స్‌ ఒక వికెట్ తీశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని